హైదరాబాద్ మెట్రోకు రూ.275 కోట్లు
ABN , Publish Date - Nov 03 , 2026 | 04:21 AM
హైదరాబాద్ మెట్రో విస్తరణ దిశగా సర్కారు ముందుకెళుతోంది. రెండోదశలో పార్ట్-ఏ, తొలిదశ ప్రాజెక్టు నిర్వహణకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ).. సోమవారం రూ.275 కోట్లు విడుదల చేసింది.
తొలిదశ నిర్వహణకు 125 కోట్ల రుణం
రెండోదశ పార్ట్-ఏ పనులకు 150 కోట్లు
2 వేర్వేరు జీవోలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్/ హైదరాబాద్ సిటీ, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మెట్రో విస్తరణ దిశగా సర్కారు ముందుకెళుతోంది. రెండోదశలో పార్ట్-ఏ, తొలిదశ ప్రాజెక్టు నిర్వహణకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ).. సోమవారం రూ.275 కోట్లు విడుదల చేసింది. అందుకు పరిపాలనా అనుమతినిస్తూ రెండు వేర్వేరు జీవోలు జారీ చేసింది. వీటిలో రెండోదశకు బడ్జెట్ కేటాయించిన రూ.600 కోట్లలో రూ.150 కోట్లు.. తొలి దశకు రుణాల కింద రూ.500 కోట్ల బడ్జెట్‌కు గానూ రూ.125 కోట్ల విడుదలకు అనుమతి ఇచ్చింది. హెచ్‌ఏఎంఎల్‌కు విడుదల చేసిన రూ.150 కోట్లలో ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట మధ్య 7.5 కి.మీ పాతబస్తీ మెట్రో మార్గంలో స్వాధీనం చేసుకున్న 888 ఆస్తుల్లో తొలుత 833 ఆస్తుల యజమానులకు రూ.820 కోట్లు చెల్లించింది.
మిగతా 55 ఆస్తులకు సుమారు రూ.100 కోట్లు చెల్లించాల్సి ఉండగా, కొంత మొత్తం చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ మార్గంలో తొలగించిన విద్యుత్ స్తంభాలు, చెట్లను దూర ప్రాంతాలకు తరలించడానికి.. మరో ఆరు ప్రతిపాదిత కారిడార్లలో అవసరమైన భూసేకరణ పనుల సర్వే, జనరల్ కన్సల్టెన్సీ (నిర్మాణ పనుల పర్యవేక్షక సంస్థ)కు మిగతా రూ.50 కోట్లను ఖర్చు చేయనున్నారు. తొలి దశ ప్రాజెక్టు నిర్వహణను పర్యవేక్షిస్తున్న హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) పరిధిలోని వివిధ స్టేషన్ల అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించలేదు. ప్రస్తుతం విడుదల చేసిన రూ.125 కోట్ల రుణంతో కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించే అవకాశముంది. ఇక సంస్థలో పని చేస్తున్న కొందరు ఉద్యోగుల పెండింగ్ వేతనాలు చెల్లించి దాని నిర్వహణ పనులను అధికారులు ముందుకు తీసుకెళ్లనున్నారు.
తొలిదశ స్వాధీనం తర్వాతే 2వ దశకు మోక్షం
రెండో దశలో పార్ట్-ఏ కింద ఏడు మార్గాల్లో 122.9 కి.మీ మేర మెట్రో రైలు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన సర్కారు.. ఆయా కారిడార్లకు రూ.38,595 కోట్లు ఖర్చవుతాయని ప్రతిపాదించింది. జాయింట్ వెంచర్ కింద 50:50 నిష్పత్తిలో రెండోదశ పార్ట్-ఏకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఖర్చు చేయాలని నిర్ణయించాయి. తొలిదశ మెట్రో ప్రాజెక్టును ఎల్ అండ్ టీ నుంచి రాష్ట్రం పూర్తిగా స్వాధీనం చేసుకున్నాకే.. రెండోదశ పార్ట్-ఏలోని ఏడు కారిడార్ల డీపీఆర్‌కు కేంద్రం అనుమతులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తొలిదశ ప్రాజెక్టు స్వాధీనానికి రూ.13,600 కోట్ల రుణ సమీకరణకు రాష్ట్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News