Share News

ఆటలు ముగిసినా వసతులు నిలవాలి

ABN , Publish Date - Nov 03 , 2026 | 04:08 AM

రాష్ట్రంలో నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ కోసం శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఆటలు ముగిసినా వసతులు నిలవాలి
Revanth Reddy Khelo India

  • ఖేలో ఇండియాకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు..

  • గ్రూప్‌-1 స్థాయి అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు

  • ఖేలో సమీక్షలో అధికారులకు రేవంత్‌ దిశానిర్దేశం

హైదరాబాద్‌, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ కోసం శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలను తీర్చిదిద్దాలని, పోటీల తర్వాత కూడా అవి గొప్ప క్రీడా వనరులుగా ఉపయోగపడేలా చూడాలని సూచించారు. డిసెంబరు 11 నుంచి 22 వరకు జరిగే 8వ ఎడిషన్‌ పోటీల ఏర్పాట్లపై సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్‌ అథారిటీ ఛైర్మన్‌ శివసేనారెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడమే లక్ష్యంగా ఈ పోటీలను గొప్ప అవకాశంగా మలుచుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని సీఎం అన్నారు. తెలంగాణ క్రీడా విధానం, యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ద్వారా రాష్ట్రాన్ని దేశంలోనే క్రీడల హబ్‌గా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఖేలో ఇండియా పోటీలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ ఈవెంట్‌ను అవకాశంగా తీసుకొని యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి వారిని అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని సీఎం పేర్కొన్నారు. ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌ కోసం సమకూర్చినవనరులన్నింటినీ ఖేలో ఇండియా పోటీలకూ ఉపయోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు.


డిసెంబరు 7 నుంచి 9 వరకు భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో జరిగే సమ్మిట్‌ ముగీసిన రెండు రోజులకే ఖేలో ఇండియా పోటీలు మొదలవుతాయని, సమ్మిట్‌లో పెట్టుబడుల ఆకర్షణ కూడా ఒక భాగమైనందున అధికారులందరూ కలిసికట్టుగా పని చేయాలన్నారు. ఏర్పాట్లలో లోపాలు లేకుండా చూసేందుకు గ్రూప్‌-1 స్థాయి అధికారులకు ఏర్పాట్ల దశ నుంచి క్రీడలు ముగిసే వరకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని సీఎం ఆదేశించారు. వివిధ జిల్లాల్లో జరిగే పోటీల ఏర్పాట్ల పర్యవేక్షణకు ఆయా చోట్ల పని చేస్తున్న ట్రైనీ అధికారులు, గ్రూప్‌-1 అధికారులను నియమించాలన్నారు. క్రీడాకారులకు ఆహారం, వసతి సౌకర్యాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, ప్రతి వారం ఏర్పాట్ల పురోగతిపై సమాచారం ఇవ్వాలని సూచించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో క్రీడల కోసం కొన్నిచోట్ల చేపట్టిన మౌలిక సదుపాయాల పనులు, పోటీలు ముగిసిన కొన్నేళ్లలోనే విచ్ఛిన్నమయ్యాయని తెలిపారు. అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎల్‌నినో నేపథ్యంలో పోటీల ప్రారంభ, ముగింపు వేడుకల్లో ఆడంబరాలకు తావు లేకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు. ప్రారంభోత్సవం గచ్చిబౌలి స్టేడియంలో, ముగింపు వేడుక ఎల్‌బీ స్టేడియం టెన్నిస్‌ కాంప్లెక్స్‌లో ఉండవచ్చు. ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.


6 నగరాలు.. 20 వేదికలు..

ఖేలో ఇండియా పోటీల కోసం ఏడు వేలకు పైగా యువ క్రీడాకారులతో పాటు సుమారు రెండు వేల మంది కోచింగ్‌ సిబ్బంది, అధికారులు రాష్ట్రానికి రానున్నారు. హైదరాబాద్‌ సహా 6 నగరాల్లో 20 వేదికల్లో 27 రకాల క్రీడా పోటీలు, ఒక డెమో పోటీ నిర్వహించనున్నారు. హనుమకొండలో అథ్లెటిక్స్‌, కరీంనగర్‌లో జూడో, ఖమ్మంలో ఆర్చరీ, మహబూబ్‌నగర్‌లో కబడ్డీ, నిజామాబాద్‌లో టేబుల్‌ టెన్నిస్‌ జరగనుండగా, మిగతా పోటీలు హైదరాబాద్‌లోని ప్రధాన వేదికల్లో జరుగుతాయి. హుస్సేన్‌ సాగర్‌లో రోయింగ్‌, కయాకింగ్‌, కనోయింగ్‌ పోటీలు నిర్వహించనుండగా, సెయిలింగ్‌ను డెమో క్రీడగా చేర్చారు. ఈ వేదికల్లో చేపడుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. క్రీడాకారుల డ్రెస్సింగ్‌ గదులు, ప్రేక్షకుల గ్యాలరీలు, వాష్‌రూమ్‌లు, ఈత కొలనులు, సైక్లింగ్‌ ట్రాక్‌లు, షూటింగ్‌ రేంజ్‌ల మెరుగుదల పనులు వీటిలో ఉన్నాయి. పోటీల కోసం కేంద్రం రూ.22 కోట్లు విడుదల చేసినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ కర్రసాము క్రీడను ఆతిథ్య రాష్ట్ర కోటాలో ఖేలో ఇండియా క్రీడల్లో చేర్చేలా వెంటనే కార్యాచరణ చేపట్టాలని సీఎం సూచించారు. తెలంగాణకు ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులు సత్తా చాటేలా చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే వివిధ జిల్లాల్లోని ఖేలో ఇండియా శిబిరాల్లో క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారని వివరించారు. సమావేశంలో సీఎస్‌ సంజయ్‌ జాజు, సీఎం సలహాదారు కె.రామకృష్ణారావు, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ(స్పోర్ట్స్‌) వాణీ ప్రసాద్‌ పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మూడు కోట్ల ఓట్లు అక్రమ వలసదారులవే

ఉత్సాహంగా బీజేపీ మహా పాదయాత్ర

లోలోతుల్లోకి భూగర్భజలాలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 03 , 2026 | 04:08 AM