లోలోతుల్లోకి భూగర్భజలాలు
ABN , Publish Date - Nov 03 , 2026 | 04:03 AM
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో భూగర్భ జలాల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న నిర్మాణ రంగం, ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం..
గ్రేటర్ హైదరాబాద్‌లో ఏడాదిలోనే 7.17 మీటర్ల దిగువకు తగ్గిన నీటిమట్టం
కూకట్‌పల్లిలో 48.35 మీటర్ల లోతులో నీరు.. రాష్ట్రమంతటా ఆందోళనకర పరిస్థితులు
సగటున భూగర్భ జలాలు 8.28 మీటర్ల వద్ద.. గత ఏడాదితో పోలిస్తే 3.86 మీటర్ల కిందికి
554 మండలాల్లో పడిపోయిన నీటి మట్టాలు.. రాష్ట్ర భూగర్భ జలశాఖ నివేదికలో వెల్లడి
హైదరాబాద్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో భూగర్భ జలాల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న నిర్మాణ రంగం, ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం.. భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గత ఏడాది అక్టోబరుతో పోల్చితే ఈ ఏడాది అక్టోబరులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భూగర్భ జలమట్టం సగటున 7.17 మీటర్ల మేర పడిపోయింది. గతేడాది 5.42 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉండగా.. ఈసారి అవి 12.59 మీటర్ల లోతుకు దిగాయి. తెలంగాణ భూగర్భ జలశాఖ అక్టోబరు నెలకు సంబంధించి విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. జీహెచ్‌ఎంసీ, పరిసర మునిసిపల్ ప్రాంతాల పరిధిలో ఉన్న 46 మండలాల్లోని నీటిమట్టాలను భూగర్భజలశాఖ 107 పీజోమీటర్ల ద్వారా పరిశీలించింది. కూకట్‌పల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏకంగా 48.35 మీటర్ల లోతులో ఉన్నాయి.
కేపీహెచ్‌బీ ప్రాంతంలో 34.94 మీటర్లు, మేడిపల్లిలో 28.41 మీటర్లు, శంకర్‌పల్లిలో 21.81 మీటర్లు, హయత్‌నగర్‌లో 19.32 మీటర్ల లోతులో నీటిమట్టాలు నమోదయ్యాయి. గత ఏడాది అక్టోబరుతో పోల్చితే భూగర్భ జలమట్టం హయత్‌నగర్ మండలంలో 14.20 మీటర్లు, శంకర్‌పల్లిలో 12.55 మీటర్లు, కుత్బుల్లాపూర్‌లో 10.66 మీటర్లు, మేడిపల్లిలో 9.63 మీటర్లు, ఉప్పల్‌లో 8.40 మీటర్ల మేర తగ్గింది. మరోవైపు, జీహెచ్‌ఎంసీ, పరిసర మునిసిపల్ ప్రాంతాల పరిధిలో ఉన్న 46 మండలాల్లో అక్టోబరు 31వ తేదీ వరకు సాధారణంగా 729 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 484 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. అంటే సాధారణం కంటే 34 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. 46 మండలాల్లోకి కేవలం ఆరు మండలాల్లోనే సాధారణ వర్షపాతం నమోదుకాగా.. మిగిలిన 40 మండలాల్లో లోటు వర్షపాతం నెలకొంది.
రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకరంగా పరిస్థితి
గ్రేటర్ హైదరాబాద్‌లోనే కాదు రాష్ట్రమంతటా భూగర్భ జలాల పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. రాష్ట్రంలో సగటున భూగర్భ జలాలు 8.28 మీటర్ల లోతులో ఉన్నాయి. గత ఏడాది అక్టోబరుతో పోల్చితే 3.86 మీటర్ల మేర నీటిమట్టం పడిపోయింది. అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 7.37 మీటర్లు, సంగారెడ్డిలో 6.67 మీటర్లు, మెదక్‌లో 6.66 మీటర్లు, రంగారెడ్డిలో 6.61 మీటర్లు, మహబూబ్‌నగర్‌లో 6.57 మీటర్ల మేర నీటిమట్టం పడిపోయింది. సగటు నీటిమట్టాలను పరిశీలిస్తే వికారాబాద్‌లో 13.54 మీటర్ల లోతులో, సంగారెడ్డిలో 12.93 మీటర్లు, రంగారెడ్డిలో 12.75 మీటర్లు, మేడ్చల్‌లో 12.67 మీటర్లు, మహబూబ్‌నగర్‌లో 11.96 మీటర్లు, మెదక్‌లో 11.48 మీటర్లు, హైదరాబాద్ జిల్లాలో 11.10 మీటర్ల లోతులో భూగర్భ జలాలున్నాయి. జగిత్యాలలో అత్యల్పంగా 4.21 మీటర్లు, ఖమ్మంలో 4.34 మీటర్లు, మహబూబాబాద్‌లో 4.48 మీటర్ల లోతులో నీటిమట్టాలు నమోదయ్యాయి.
పదేళ్లతో పోల్చితే ఇదీ పరిస్థితి
గత పదేళ్లలో (2016-2025) అక్టోబరు నెలలో నమోదైన సగటు నీటిమట్టాలతో ప్రస్తుత పరిస్థితిని పోల్చినప్పుడు మరింత ఆందోళనకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలోని 621 మండలాలకుగాను 554 మండలాల్లో (89 శాతం) భూగర్భ జలాలు పడిపోయాయి. 20 మీటర్లకు మించి లోతులో భూగర్భ జలాలు ఉన్న ప్రాంతాల విస్తీర్ణం 478 చదరపు కిలోమీటర్ల నుంచి 2,040 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. మరోవైపు, 2026 జూన్ 1 నుంచి అక్టోబరు 31 వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 831 మిల్లీమీటర్లు కాగా, వాస్తవంగా 628 మిల్లీమీటర్లు మాత్రమే (24 శాతం లోటు) నమోదైంది. మొత్తం 33 జిల్లాలకుగాను 11 జిల్లాల్లో సాధారణ వర్షపాతం, మిగిలిన 22 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. జిల్లాల వారీగా గమనిస్తే... జోగులాంబ గద్వాల జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 50 శాతం తక్కువగా నమోదైంది. ఆ తర్వాత స్థానాల్లో నారాయణపేట (44 శాతం), నాగర్‌కర్నూల్, నల్లగొండ (42 శాతం), హనుమకొండ (41 శాతం) ఉన్నాయి.
రీచార్జికి చర్యలు అవసరం
రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాల పరిస్థితిని 1771 పీజోమీటర్ల ద్వారా పర్యవేక్షించినట్లు భూగర్భ జలశాఖ వెల్లడించింది. వర్షపాతం లోటు, నీటిమట్టాల పతనం వంటి అంశాలు భవిష్యత్తులో నీటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. వర్షపు నీటి సంరక్షణ, చెరువులు, కుంటల పునరుద్ధరణ, ఇంకుడు గుంతల ఏర్పాటు, భూగర్భ జలాల కృత్రిమ రీచార్జి, బోరుబావుల వినియోగంపై నియంత్రణ వంటి చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మూడు కోట్ల ఓట్లు అక్రమ వలసదారులవే
Read Latest Telangana News And AP News And National News
And Telugu News