Share News

చుక్కను పట్టి.. పచ్చని వనమై!

ABN , Publish Date - Nov 02 , 2026 | 05:14 AM

ఎల్‌నినో.. ఇప్పుడు అందరి నోటా ఇదే మాట... వర్షాభావం వల్ల భయంకరమైన నీటి కొరత ఎదుర్కోనున్నామని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి.

చుక్కను పట్టి.. పచ్చని వనమై!
Gottigarpally Village

  • నీటి కొరత లేని ఊరిగా సంగారెడ్డి జిల్లా గొటిగర్‌పల్లి..

  • పాతికేళ్ల క్రితం కరువుతో అల్లాడిన పల్లె?

  • చతుర్విధ జల ప్రక్రియతో పెరిగిన భూగర్భ జలాలు

  • నేడు ఎల్‌నినో పరిస్థితుల్లోనూ మూడు పంటలు వేస్తున్న రైతులు

కోహీర్‌, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో.. ఇప్పుడు అందరి నోటా ఇదే మాట... వర్షాభావం వల్ల భయంకరమైన నీటి కొరత ఎదుర్కోనున్నామని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ప్రజలు నీళ్లను పొదుపుగా వాడుకోవాలని, రైతులు పంట వేయడం వాయిదా వేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరింది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్రంలోని ఓ గ్రామం నీటి కొరత భయం లేకుండా ఉంది. రాష్ట్రంలోని రైతులంతా వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తుంటే ఆ ఊరి రైతులు మూడో పంటకు సిద్ధమైపోతున్నారు. సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలం ‘గొటిగర్‌పల్లి’లో ప్రస్తుత పరిస్థితి ఉంది. 25 ఏళ్ల క్రితం తాగు, సాగు నీరు కోసం అల్లాడిపోయి, కరువు తాండవించిన గొటిగర్‌పల్లిలోని చెరువులు, బావులు ఇప్పుడు నిండుకుండల్లా ఉన్నాయి. భూగర్భ జలాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.


గొటిగర్‌పల్లిలో 25 ఏళ్ల క్రితం తాగు, సాగు నీటికి తీవ్ర ఇబ్బంది ఉండేది. అప్పట్లో రైతులు వర్షాలపై ఆధారపడి పంటలు వేసేవారు. అలాంటి గొటిగర్‌పల్లిలో కరువును పారద్రోలేందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సాగు నీటి శాఖ ఇంజనీరింగ్‌-ఇన్‌-చీఫ్‌, ప్రపంచ బ్యాంకు మాజీ సలహాదారు దివంగత టి. హనుమంతరావు సంకల్పించారు. ఇందుకోసం గ్రామం లో చతుర్విధ జల ప్రక్రియను అమలు చేశారు. చతుర్విధ జల ప్రక్రియ అంటే.. కురిసే ప్రతి వాన నీటి చుక్కను నిల్వ చేయడం, ఇంకుడు గుంతలు, భూగర్భజలాల పంపుల ద్వారా నీళ్లు భూమిలోకి ఇంకేలా చేయ డం, వాగులు, చెరువులు, రిజర్వాయర్లలో నీళ్లు నిల్వ చేయడం, భూమి లోపల తేమ ఆవిరైపోకుండా చూడడం. ఈ ప్రక్రియపై గ్రామస్థులకు అవగాహన కల్పించిన ఆయన అప్పటి డీపీఏపీ పథకం రూ.30 లక్షలు మంజూరు చేయించారు. ఈ నిధులతో వాటర్‌షెడ్లు నిర్మించారు. ఎకరానికి కేవలం రూ.5 వేల ఖర్చుతో ఎగువ ప్రాంతాల నుంచి పారే వర్షపు నీటికి అడ్డుకట్టలు వేశా రు. 95 శాతానికిపై మట్టి పనులతో సమతుల కందకాలు, చిన్న మట్టి కట్టలు, ఇంకుడు గుంతలు, చిన్నపాటి నీటి కుం టలు నిర్మించి నీరు భూమిలోకి ఇంకేలా చేశారు. నాలుగేళ్ల పాటు సాగిన ఈ పనులతో గ్రామంలోని 1500 ఎకరాల్లో జలసిరి పురుడుపోసుకుంది.


భూమిలోకి వర్షపు నీరు సమృద్ధిగా ఇంకడంతో భూగర్భ జలాలు విశేషంగా పెరిగింది. నేడు పక్క గ్రామాల్లో 30 అడుగులు తవ్వినా నీరు రాని పరిస్థితులుంటే.. గొటిగర్‌పల్లిలో మాత్రం కేవలం 15 నుంచి 50 అడుగుల లోతులోనే బోరుబావుల్లో పుష్కలంగా నీరు లభిస్తుండడం విశేషం. గ్రామంలోని ఖాన్‌ లోది ప్రాంతంలో భూమిలో నుంచి నీరు అన్ని కాలాల్లో ఉబికి వస్తోంది. అంతేకాకుండా, వర్షపు నీటికి కొట్టుకుపోయే సారవంతమైన పైమట్టి (టాప్‌ సాయిల్‌) అక్కడే స్థిరీకరణ చెందడంతో సహజ పోషకాలు నిల్వ ఉండి, రసాయనిక ఎరువుల ఖర్చు తగ్గింది. వేసవిలోనూ తాగునీటికి, పశుగ్రాసానికి కొరత లేకుండా పోయింది. ప్రస్తుతం గొటిగర్‌పల్లితో పాటు గోపినాయక్‌ తండా, సిద్దాపూర్‌ తండాల్లోని 610 కుటుంబాలు ఈ విధానంతో లబ్ధి పొందుతున్నాయి. జల వనరులు పుష్కలంగా ఉండడంతో గ్రామ రైతులు దాదాపు 80 శాతం విస్తీర్ణంలో చెరుకు, అల్లం, బంగాళాదుంప, అరటి వంటి వాణిజ్య పంటలను ఏడాదికి 3 పంటలు వేస్తున్నారు. ఇక, 2024 డిసెంబరులో జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో ఎంపీ కె.లక్ష్మణ్‌ గొటిగర్‌పల్లి సాధించిన విజయాన్ని ప్రస్తావించారు. గొటిగర్‌పల్లి స్ఫూర్తితో చతుర్విధ జల ప్రక్రియను అమలు చేసిన రాజస్థాన్‌ కూడా సత్ఫలితాలను సాధించిందని తెలిపారు. ఇప్పుడు ఎల్‌నినో నేపథ్యంలోనూ గొటిగర్‌పల్లి మళ్లీ దేశానికే ఆదర్శంగా నిలవడం విశేషం.


నీటిని ఒడిసిపట్టడం అభినందనీయం

గొటిగర్‌పల్లిలో కేవలం మట్టి, రాళ్లు, పచ్చదనంతో రిడ్జ్‌-టు-వ్యాలీ పద్ధతిలో నీటిని ఒడిసిపట్టడం అభినందనీయం. సాధారణ వర్షపాతం 700 మి.మీకి గాను 400మి.మీ మాత్రమే కురిసినా, భూగర్భ జలాలు పెరిగి ఎత్తైన ప్రదేశంలోని బావిలోనూ 30 అడుగుల నీరు నిల్వ ఉంటున్నాయి. భారీ ఖర్చుతో కూడిన నదుల అనుసంధానం కంటే తక్కువ ఖర్చుతో కూడిన ఇలాంటి శాశ్వత విధానాలను కేంద్ర ప్రభుత్వ పథకాలతో అనుసంధానించేందుకు కృషి చేస్తాను

- పి. దేవేందర్‌రావు (చీఫ్‌ ఇంజనీర్‌, నేషనల్‌ వాటర్‌ డెవల్‌పమెంట్‌ ఏజెన్సీ)


వర్షాభావం భయం లేదు..

పాతికేళ్ల క్రితం మా ఊరి పరిస్థితి తలుచుకుంటే భయమేస్తుంది. వందల అడుగులు తవ్వినా బోర్లలో చుక్క నీరు వచ్చేది కాదు. కానీ, హనుమంతరావు మార్గదర్శకత్వంలో చేపట్టిన చతుర్విధ జల ప్రక్రియ మా తలరాత మార్చింది. మా పొలాల్లో మేమే కందకాలు, చిన్న మట్టికట్టలు వేసుకుని వాన నీటిని భూమిలో ఇంకేలా చేశాం. ఆ రోజు పడ్డ కష్టానికి ఫలితమే ఈ రోజు కనిపిస్తోంది. చుట్టుపక్కల ఊళ్లలో బోర్లు ఎండిపోయినా మా ఊర్లో 30 నుంచి 40 అడుగుల లోతులోనే నీళ్లు పుష్కలంగా అందుతున్నాయి.

- రాచయ్య, మాజీ సర్పంచ్‌, గొటిగర్‌పల్లి


ఈ వార్తలు కూడా చదవండి..

ఏడాదిలో 1000 మంది మహిళల అక్రమ రవాణా!

పండగ ముందు.. మిఠాయి చేదు!

బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయానికి పోలీసు అధికారుల నివాళి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 02 , 2026 | 05:14 AM