పండగ ముందు.. మిఠాయి చేదు!
ABN , Publish Date - Nov 02 , 2026 | 05:05 AM
మిఠాయిల పండగంటే దీపావళే.. ఈ సందర్భంగా స్వీట్ల తయారీ, విక్రయాలు భారీగా పెరుగు తాయి. కానీ, ఈసారి దీపావళికి ముందు పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది.
స్వీట్ల తయారీలో చాలాచోట్ల నిబంధనల ఉల్లంఘన..
పేరున్న స్వీట్ షాపుల్లోనూ అపరిశుభ్ర వాతావరణం
టీజీ సేఫ్ వరుస తనిఖీలు.. మూతపడుతున్న కిచెన్లు
141చోట్ల సోదాలు.. 24.88 టన్నుల స్వీట్లు, సరుకు సీజ్
17యూనిట్ల నిలిపివేత.. లైసెన్సుల్లేని మరో 8 మూత
హైదరాబాద్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): మిఠాయిల పండగంటే దీపావళే.. ఈ సందర్భంగా స్వీట్ల తయారీ, విక్రయాలు భారీగా పెరుగు తాయి. కానీ, ఈసారి దీపావళికి ముందు పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. అపరిశుభ్రమైన పరిస్థితుల్లో స్వీట్లు తయారు చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా స్వీట్ల తయారీ కేంద్రాలపై తెలంగాణ ఫుడ్‌సేఫ్టీ విభాగం (టీజీ సేఫ్) కొరడా ఝళిపిస్తోంది. పేరున్న స్వీట్ షాపులు, వాటికి సరఫరా చేసే సెంట్రల్ కిచెన్లలోనూ అపరిశుభ్ర వాతావరణంలో స్వీట్లు తయారుచేస్తున్నట్లు తనిఖీల్లో బయ టపడటంతో పలు యూనిట్లపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 28న నిర్వహించిన తనిఖీల్లో 16 యూనిట్లను పరిశీలించి, లైసెన్సులు లేని 5 యూనిట్లను మూసివేశారు.
హైదరాబాద్- సికింద్రా బాద్ జంట నగరాల పరిధిలో 40 షాపులున్న ఓ ప్రముఖ బ్రాండెడ్ స్వీట్ షాపు సెంట్రల్ కిచెన్‌ను కూడా అధికారులు మూసివేశారు. ఈ సంస్థ ఏడాదికి సుమారు రూ.2 కోట్ల మేర జీఎస్టీ చెల్లించే స్థాయిలో వ్యాపారం నిర్వహిస్తున్నట్లు సమాచారం. భారీ టర్నోవర్, బ్రాండ్ ఇమేజ్ ఉన్నా పరిశుభ్రత పాటించకపోవటంపై విమర్శలు వ్యక్తమవు తున్నాయి. ప్రముఖ స్వీట్ షాపులకు స్వీట్లు, ఇతర ఆహార పదార్థాలను సరఫరా చేసే సెంట్రల్ కిచెన్లపైనా టీజీ సేఫ్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. తయారీ ప్రదేశాల పరిశుభ్రత, ముడిసరుకు నిల్వ, తయా రీ విధానం, ఆహార నాణ్యత వంటి అంశాలను అధికారులు పరిశీలిస్తు న్నారు. నిబంధనలు పాటించని యూనిట్లకు షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. అవసరమైతే మూసివేస్తున్నారు. దీంతో కొన్ని స్వీట్ తయారీ కేంద్రాలు, వాటి సరఫరా వ్యవస్థలపై ప్రభావం పడుతోంది.
141 తనిఖీలు.. 35 నమూనాల సేకరణ
టీజీ సేఫ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ఆగస్టు 25 నుంచి ఈ నెల 28 వరకు స్వీట్ల తయారీ, విక్రయ కేంద్రాలపై ఆరు విడతల్లో మొత్తం 141 తనిఖీలు నిర్వహించి.. 135 నమూనాలను సేకరించారు. 39 యూనిట్లకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులిచ్చారు. 28 షోకాజ్ నోటీసులు జారీచేశారు. 17 యూనిట్ల కార్యకలాపాలను సస్పెండ్ చేశారు. లైసెన్సులు లేని 8 యూనిట్లను మూసివేశారు. 24.88 టన్నుల స్వీట్లు, ఇతర పదార్థాలను సీజ్ చేశారు. దీని విలువ రూ.70,70,046 అని అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై చర్యలు తీసుకోవడం అవసరమే అయినప్పటికీ, భారీ టర్నోవర్ ఉన్న సంస్థల కార్యకలాపాలు నిలిచిపోవడంతో వ్యాపార లావాదేవీలపైనా ప్రభావం పడుతోంది. స్వీట్ల తయారీ, విక్రయాలు నిలిచిపోవడం, సెంట్రల్ కిచెన్లు మూతపడటం వల్ల సరఫరా వ్యవస్థ దెబ్బతింటోంది.
మరోవైపు ఈ దుకాణాలు, తయారీ కేంద్రాల్లో పనిచేసే వందలాది మంది పండగకు ముందు ఉపాధిని కోల్పో తున్నారు. పండగలతో సంబంధం లేకుండా హైదరాబాద్‌లో నాలుగింట మూడొంతుల కుటుంబాలు నెలకు కనీసం కొన్ని సార్లయినా స్వీట్లు తింటున్నాయని ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలింది. డిమాండ్‌కు తగ్గట్లే ఈ పరిశ్రమలో ఉపాధి కూడా భారీగానే ఉంటోంది. దీపావళి వేళ అది మరింత పెరుగుతుంది. ఒక స్వీట్ షాపు సాధారణ రోజుల్లో రోజుకు రూ.1,000 విలువైన మిఠాయిలు విక్రయిస్తే... దసరా, దీపావళి సమయంలో రోజుకు సగటున రూ.3 వేల వరకు అమ్ముతుంటామని ఓ మిఠాయివాలా ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
సరిదిద్దుకునే సమయమివ్వాలి
టీజీ సేఫ్ చేపట్టే తనిఖీల విషయంలో అభ్యంతరం లేదు. స్వీట్లు, ఆహార పదార్థాలు తయారు చేసే వంటశాలలను పరిశుభ్రంగా ఉంచాలి. అయి నా చిన్నచిన్న తప్పులు దొర్లుతుంటాయి. తనిఖీల సమయంలో వాటిని అధికారులు గుర్తిస్తే.. సరిచేసుకొనేందుకు సమయం ఇవ్వాలి. చిన్న కారణాలతో సెంట్రల్ కిచెన్లను కూడా మూసివేస్తే ప్రభుత్వ ఆదాయానికి గండి పడటంతోపాటు ఎంతోమంది ఉపాధి కోల్పోతారు.
- రవికిరణ్,
హైదరాబాద్‌లోని ఓ స్వీట్ షాపు యజమాని
ఈ వార్తలు కూడా చదవండి..
ఏడాదిలో 1000 మంది మహిళల అక్రమ రవాణా!
బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయానికి పోలీసు అధికారుల నివాళి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News