కేయూ ప్రహరీ.. మళ్లీ మొదటికి
ABN , Publish Date - Nov 03 , 2026 | 04:17 AM
కాకతీయ యూనివర్సిటీ చుట్టూ ప్రహరీ నిర్మాణ పనులు ప్రారంభించకుండానే పడకేశాయి. ప్రభుత్వాలు మారినా, వర్సిటీకి కొత్త ఉన్నతాధికారులు వచ్చినా.. ప్రహరీ పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి.
నిర్మాణ పనులకు వీడని గ్రహణం
రూ.20 కోట్లు కేటాయించిన వర్సిటీ
10 కి.మీ. మేర గోడ నిర్మాణానికి టెండర్లు
పనులు దక్కించుకున్న ఈడబ్ల్యూఐడీసీ
ప్రారంభానికి ముందే చేతులెత్తేసిన సంస్థ
రూ.2 కోట్లు పెంచితేనే చేస్తామని మెలిక
రీ టెండర్ యోచనలో అధికారులు
కేయూ క్యాంపస్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): కాకతీయ యూనివర్సిటీ చుట్టూ ప్రహరీ నిర్మాణ పనులు ప్రారంభించకుండానే పడకేశాయి. ప్రభుత్వాలు మారినా, వర్సిటీకి కొత్త ఉన్నతాధికారులు వచ్చినా.. ప్రహరీ పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. 2001లో అప్పటి వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ చంద్రకాంత్ కోకాటే హయాంలో ప్రహరీ నిర్మాణ పనుల ప్రతిపాదన తెచ్చారు. కానీ, 2026 ముగింపునకు చేరుకుంటున్నా పనులు చేపట్టలేదు. అయితే 2024లో ఇన్‌చార్జి వీసీగా విధులు చేపట్టిన ఐఏఎస్ అధికారి వాకాటి కరుణ.. కేయూ ప్రహరీ నిర్మాణంపై దృష్టి పెట్టారు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన అనుభవంతో వర్సిటీ భూములపై పకడ్బందీగా సర్వేలు చేయించి భూముల లెక్కలు పక్కాగా తేల్చారు. తర్వాత మారిన పరిస్థితులు, వచ్చిన ఉన్నతాధికారుల తీరుతో విషయం మళ్లీ మొదటికి వచ్చింది. యూనివర్సిటీ చుట్టూ సుమారు 10 కిలోమీటర్ల దూరం, 8 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేయదలచిన ప్రహరీ నిర్మాణానికి వర్సిటీ పాలక మండలి రూ.20 కోట్ల నిధులు కేటాయించింది.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఏడాది ఏప్రిల్‌లో వర్సిటీ ఉన్నతాధికారులు టెండర్లు పిలిచారు. టెండర్ ద్వారా ఈ పనులను ప్రభుత్వ సంస్థ అయిన తెలగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఈడబ్ల్యూఐడీసీ) దక్కించుకుంది. అయితే పనులు ప్రారంభించకుండానే రూ.20 కోట్ల నిధులు సరిపోవంటూ మెలిక పెట్టింది. అదనంగా మరో రూ.2 కోట్లు కావాలని కోరుతోంది. పనులు చేపట్టకుండా తాత్సారం చేస్తోంది. మరోవైపు ప్రహరీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా ఇవ్వడం లేదు. ఇప్పటివరకు కేటాయించిన మొత్తం రూ.20 కోట్లు యూనివర్సిటీ నిధులే. భారీ అంచనా వ్యయంతో చేపట్టనున్న పనులు కావడంతో వర్సిటీ అంతర్గత నిధులను సమకూర్చుకునేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పనులు చేపట్టకుండానే టీజీఈడబ్ల్యూఐడీసీ చేతులేత్తేయడంతో రీ టెండర్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై వర్సిటీ ఉన్నతాధికారులు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
యూనివర్సిటీలో రూ.కోట్ల భూములు కబ్జా..
కాకతీయ యూనివర్సిటీ హనుమకొండ నడిబొడ్డున ఉండడంతో కబ్జాకోరులు నిత్యం వర్సిటీ భూముల్లోకి అక్రమంగా చొరబడుతున్నారు. మున్సిపల్ అధికారులు, వర్సిటీ ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని చాపకింద నీరులా వర్సిటీ భూముల్లోకి వస్తూ అక్కడ చిన్న చిన్న నిర్మాణాలు కూడా చేపడుతున్నారు. ఇప్పటికే వర్సిటీ భూములను సీఆర్‌పీఎఫ్ పోలీస్ క్యాంపు, వర్సిటీ పోలీస్ స్టేషన్, రేడియో స్టేషన్‌లకు కేటాయించారు. 412, 413, 414 సర్వే నెంబర్లలో 2.12 ఎకరాల భూమి కబ్జాకు గురైందని జిల్లా కలెక్టర్ల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వీటీతోపాటు కెనాల్ కాలువ పక్కన, కో ఎడ్యకేషన్ ఇంజనీరింగ్ కళాశాల పరిసరాల్లోనూ ఎకరాల మేరకు వర్సిటీ భూములు కబ్జాలకు గురయ్యాయి. మార్కెట్ విలువ మేరకు రూ.కోట్లలో వర్సిటీ భూములను బడా రాజకీయ నేతలు, పోలీస్ అధికారులు, వర్సిటీ ఉద్యోగులు అక్రమంగా చేజిక్కించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News