ఉద్యమంలోకి వెళ్లి జీవితం పాడు చేసుకున్నా!
ABN , Publish Date - Nov 03 , 2026 | 04:36 AM
ఉడుకు నెత్తురు ఉరకలేస్తున్న విద్యార్థి దశలో తెలంగాణ ఉద్యమంలోకి దూకి.. స్వరాష్ట్రం కోసం నిరసనలు, ఆందోళనా కార్యక్రమాల్లో నేనుసైతం అంటూ ఉత్సాహంగా పాల్గొన్న అతడు ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సమస్యలతో చితికిపోయాడు!
దిక్కుతోచని పరిస్థితుల్లో చచ్చిపోతున్నా..
సూసైడ్ నోట్ రాసి తెలంగాణ ఉద్యమకారుడి ఆత్మహత్య
ఉద్యమ సమయంలో అప్పులు.. సాగు కలిసిరాక ఆర్థిక కష్టాలు
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నెలో విషాదం
మృతుడు బచ్చన్నపేట పీఏసీఎస్ డైరెక్టర్ లక్ష్మణ్ గౌడ్
బచ్చన్నపేట, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఉడుకు నెత్తురు ఉరకలేస్తున్న విద్యార్థి దశలో తెలంగాణ ఉద్యమంలోకి దూకి.. స్వరాష్ట్రం కోసం నిరసనలు, ఆందోళనా కార్యక్రమాల్లో నేనుసైతం అంటూ ఉత్సాహంగా పాల్గొన్న అతడు ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సమస్యలతో చితికిపోయాడు! దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామం వాస్తవ్యుడు, బచ్చన్నపేట పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ కో-ఆపరేటివ్ సొసైటీ) డైరెక్టర్ లక్ష్మణ్ గౌడ్ (40)! సూసైడ్‌నోట్‌లో ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు. ‘ఉద్యమంలో ఎన్నో ఇబ్బందులు పడ్డా. అయినా మా జీవితాలేమీ బాగుపడలేదు’ అని చెబుతూ.. ’బాపు (నాన్న) బాగా చదివించాడు. నేను ఉద్యమంలోకి పోయి జీవితాన్ని ఖరాబు చేసుకున్నాను’ అంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు! ఉద్యమ సమయంలో చేసిన అప్పులు, తాజాగా వ్యవసాయంలో తీవ్ర నష్టాలతోనే ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యాడని కుటుంబసభ్యులు తెలిపారు. లక్ష్మణ్‌కు భార్య స్వప్న, కుమారుడు, కుమా ర్తె ఉన్నారు. లక్ష్మణ్, బీఆర్‌ఎ్‌సలో స్వరాష్ట్రం కోసం విద్యార్థి ఉద్యమాలు నిర్మిస్తూ, యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
సోమవారం పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకున్నారు. అప్పుల బాధతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో స్వప్న పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో చేసిన అప్పులకు తోడు, తనకున్న 4 ఎకరాలకు, మరో 6ఎకరాలు కౌలుకు తీసుకొని అప్పులు తెచ్చి తన భర్త సాగు చేశారని, కాలం కలిసి రాక పంట చేతికి రాలేదని, దీంతో అప్పులు ఇంకా పెరిగాయని వివరించారు. ప్రైవేటు ఫైనాన్స్‌లతో పాటు, పలువురి వద్ద అప్పులు చేయగా వారి వేధింపులు ఎక్కువయ్యాయని తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా స్వరాష్ట్రం కోసం జరిగిన ఉద్యమ రోజుల్లో రాత్రింబవళ్లు పనిచేసిన లక్ష్మణ్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్రంగా కలిచి వేసిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సంతాపం తెలిపారు. మృతదేహం వద్ద నివాళులర్పించారు.
సూసైడ్ నోట్ యథాతథంగా..
ఫోన్‌లో లక్ష్మణ్ రాసిన సూసైడ్ నోట్ ఇదీ.. ‘అమ్మాబాపు క్షమించండి. స్వప్నా.. క్షమించు.. పిల్లలు జాగ్రత్త! మిమల్ని వీడి పోతున్నందుకు బాధగా ఉంది. బాపు బాగా చదివించాడు. నేను ఉద్యమంలోకి పోయి జీవితం ఖరాబు చేసుకున్న. కుటుంబం మొత్తం నావల్ల ఇబ్బంది పడుతోంది. 2006 నుంచి ఒకటే జెండా పట్టినా.. ఉద్యమంలో ఎన్నో ఇబ్బందు లు పడ్డా. ప్రభుత్వం వచ్చినా మా జీవితాలు బాగు పడలేదు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా. నా ఈ నిర్ణయం సరైంది కాదు. కానీ తప్పని పరిస్థితిలో తీసుకుంటున్నా. నా భార్య, పిల్లలు ఆగమవుతుండ్రు. నేను చేసిన పనికి స్వప్న సారీ. మిస్ యూ రా’’
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్ మెట్రోకు రూ.275 కోట్లు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News