Share News

అభయన్స్‌.. క్లియరెన్స్‌!

ABN , Publish Date - Sep 16 , 2026 | 09:57 AM

22ఏ సెక్షన్‌ లక్షలాదిమందిని ఆందోళనకు గురి చేస్తోంది. తమ భూములు సక్రమమే అని నిరూపించుకునేందుకు బాధితులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

అభయన్స్‌.. క్లియరెన్స్‌!
Hyderabad Land Issues

  • 22ఏను అవకాశంగా మార్చుకుంటున్న కొందరు..

  • వాస్తవంగా వివాదాల్లో ఉన్న భూములకూ ఎన్‌ఓసీ పొందే యత్నం

  • కొన్నేళ్ల క్రితం కొన్ని ఇళ్లు హోల్డ్‌లో పెట్టిన పరిస్థితి

  • వాటిని రిజిస్ర్టేషన్‌ కాకుండా నిలిపివేసిన రెవెన్యూ అధికారులు

  • తాజాగా మళ్లీ తెరపైకి వస్తున్న వైనం

  • రూ.కోట్లు పలికే స్థలాలను కాజేసేందుకు సన్నాహాలు

హైదరాబాద్‌ సిటీ: 22ఏ సెక్షన్‌ లక్షలాదిమందిని ఆందోళనకు గురి చేస్తోంది. తమ భూములు సక్రమమే అని నిరూపించుకునేందుకు బాధితులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇదే అదునుగా కొందరు దీన్ని అవకాశంగా మార్చుకుంటున్నారు. కోర్టు కేసులు, వివిధ వర్గాలు, సంస్థల నడుమ తలెత్తిన వివాదాల కారణంగా రిజిస్ర్టేషన్‌కు ఆస్కారం లేకుండా ఏళ్ల క్రితం అభయన్స్‌లో (తాత్కాలిక నిలుపుదలలో) పెట్టిన ఇళ్లకు నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్లు (ఎన్‌ఓసీ) పొంది రిజిస్ర్టేషన్లు చేయించుకునే పనులకు తెరలేపారు. అధికారులను ప్రసన్నం చేసుకుని ప్రభుత్వ స్థలాలను సొంతం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.


హైదరాబాద్‌ జిల్లాలోని రెవెన్యూశాఖ ఐదు దశాబ్దాల కాలం నుంచి ప్రభుత్వ రంగ సంస్థలు, పరి శ్రమలు, సొసైటీలు, కమ్యూనిటీహాళ్లు, ఆలయాల నిర్మాణాలకు దాదాపు 3,276.22 ఎకరాల భూమిని కేటాయించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 291 ప్రభుత్వ రంగ సంస్థలు సుమారు 2,952.2 ఎకరాలు, మరో 178 సంస్థలు 292.04 భూమిలో నిర్మాణాలు చేపట్టకుండా ఖాళీగా ఉంచినట్లు రెవెన్యూ రికార్డులు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ భూములపై కన్నేసిన కొంతమంది సుమారు 20ఏళ్ల క్రితం వాటిలో కొంతమేరకు దర్జాగా ఆక్రమించుకుని నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు.


ఈ మేరకు కార్పొరేషన్‌ నుంచి ఇంటి నంబర్లను సైతం పొందారు. అయితే ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని రూ.కోట్ల భూమిని కొల్లగొడుతున్నారని అప్పట్లో స్థానికులు చేసిన ఫిర్యాదులతో రెవెన్యూ అధికారులు ఆయా ఇళ్లను రిజిస్ర్టేషన్‌ చేయకుండా అడ్డుకున్నారు. ఈ మేరకు కోర్టులో కేసులు వేసి రెవెన్యూ రికార్డుల్లో ‘అభయన్స్‌’ కాలంలో పెట్టారు. దీంతో వాటిని ఎలాగైనా తమ సొంతం చేసుకునేందుకు అప్పటి నుంచి సదరు వ్యక్తులు పడరాని పాట్లు పడుతున్నారు.


2010-12 కాలంలో ఎక్కువగా బ్రేక్‌

2010-12 మధ్యలో హైదరాబాద్‌ కలెక్టర్‌గా గుల్జార్‌ నటరాజన్‌ పనిచేశారు. జిల్లా పరిధిలోని ఎస్టేట్‌, శ్మశానవాటిక భూముల బదిలీలకు సంబంధించిన అవకతవకలను ఆయన స్వయంగా పరిశీలించి వాటిని చాలావరకు పరిష్కరించారు. ఇదే సమయంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకునే వారి ఆగడాలను అరికట్టేందుకు చర్యలు తీసుకున్నారు. తన హయాంలో జీహెచ్‌ఎంసీ సహకారంతో రెవెన్యూకు సంబంధించిన టౌన్‌ సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌(టీఎస్ఎల్‌ఆర్‌) ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఉన్న హౌస్‌ నంబర్లను మ్యాపింగ్‌ చేయించారు. ఇందులో కొన్ని రెవెన్యూ స్థలాలను ఆక్రమించుకుని ఇళ్లు కట్టుకున్నట్లు గుర్తించారు.


దీంతో ఆయన దాదాపు 70 ఇళ్లను రిజిస్ర్టేషన్‌ కాకుండా అభయన్స్‌ (తాత్కాలిక నిలుపుదల) చేయించినట్లు తెలిసింది. అయితే 2015, 2017, 2020లో పలుమార్లు జరిగిన సర్వేల్లో సుమారు 20వేల ఇళ్లను ప్రభుత్వ ఆమోదంతో రిజిస్ర్టేషన్‌కు అవకాశం కల్పించినట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం ఆ తరహాలో ఆగిపోయిన ఇళ్లను 22ఏ నిషేధిత జాబితాను అడ్డుపెట్టుకుని రెవెన్యూ రికార్డుల్లో నుంచి తొలగించి సబ్‌ రిజిస్ట్రార్లు తాజాగా రిజిస్ర్టేషన్‌ చేసేందుకు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా తమ చేతికి మట్టి అంటకుండా ఉండేందుకు రెవెన్యూ అధికారుల నుంచి ఎన్‌ఓసీ తీసుకురమ్మని ఇంటి యజమానులకు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కొందరు కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది.


శాటిలైట్‌ సర్వేతోనే..

రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోల్చితే హైదరాబాద్‌ జిల్లా భూముల పరిస్థితి భిన్నంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో విలేజీ సర్వే నంబర్లతో భూములుండగా.. ఇక్కడ టౌన్‌ సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ (టీఎస్ఎల్‌ఆర్‌) పేరుతో ఉంటాయి. అయితే పట్టణ భూ రికార్డులకు చట్టపరమైన స్పష్టత, క్రమబద్ధత తీసుకొచ్చేందుకు చేపట్టిన టీఎస్ఎల్‌ఆర్‌ 1971-73 మధ్యలో నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ప్రారంభమైంది. కాలాక్రమేణా మిగతా అన్నిచోట్ల చేపట్టారు. అయితే గతంలో ఒకసారి జీహెచ్‌ఎంసీ సహకారంతో నగర వ్యాప్తంగా శాటిలైట్‌ సర్వే నిర్వహించి ఎన్ని ఇళ్లు ఉన్నాయనేది గుర్తించారు.


ఈ మేరకు రెవెన్యూ సర్వే నంబర్లలోని భూముల్లో అక్రమంగా కట్టుకున్న వాటికి రిజిస్ర్టేషన్లు కాకుండా అడ్డుకున్నారు. అయితే తర్వాత కాలంలో దానిని వదిలేయడంతో మళ్లీ విలువైన స్థలాల్లో ఆక్రమణలు పెరిగిపోయి పెద్ద ఎత్తున నివాసాలు వెలిశాయి. ఈ నేపథ్యంలో అలాంటి ఇళ్లను గుర్తించేందుకు మళ్లీ శాటిలైట్‌ సర్వే నిర్వహించాల్సి ఉందని రెవెన్యూ రిటైర్డ్‌ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో గుర్తించిన వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని చెబుతున్నారు. అలాగే గతంలో ‘అభయన్స్‌’లో పెట్టిన వాటిని రిజిస్ర్టేషన్‌ కాకుండా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.


నాడు లక్షల్లో.. నేడు రూ.కోట్లలో..

జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 20 ఏళ్ల క్రితం ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూముల విలువ అప్పట్లో రూ.లక్షల్లో ఉండేది. ప్రస్తుతం వాటి విలువ రూ.కోట్లకు చేరింది. దీంతో వాటిని ఎలాగైనా చేజిక్కించుకునేందుకు అక్రమార్కులు ఆరాటపడుతున్నారు. 22ఏ నిషేధిత జాబితాను అడ్డుపెట్టుకుని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల వద్దకు వెళ్లి అధికారులను సంప్రదిస్తున్నారు. ఎన్‌ఓసీలు తీసుకొస్తే రిజిస్ర్టేషన్‌ చేస్తామని వారు అక్కడ అంగీకరించి హామీ ఇచ్చిన వెంటనే తహసీల్దార్లు, కలెక్టరేట్‌ కార్యాలయాల వద్దకు వెళ్లి అధికారులను ప్రసన్నం చేసుకుని తమ పనులను పూర్తి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సహకరిస్తున్న కొందరు సబ్‌రిజిస్ర్టార్లకు కొంత ముట్టచెబుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 16 , 2026 | 09:57 AM