యూపీఐ చెల్లింపులపై చార్జీలు.. ఎవరిపై భారం పడనుంది? పూర్తి వివరాలివే..
ABN , Publish Date - Sep 16 , 2026 | 09:06 AM
దేశవ్యాప్తంగా యూపీఐ చెల్లింపులపై చార్జీలు వసూలు చేయనున్న నేపథ్యంలో చాలా మంది యూపీఐ వినియోగదారుల్లో చార్జీలపై కొంత ఆందోళన నెలకొంది. కేంద్ర ఆర్థిక శాఖ నివేదిక ప్రకారం పర్సన్ టు పర్సన్ మధ్య జరిగే లావాదేవీలపై ఎలాంటి చార్జీలు ఉండవు. సాధారణంగా వినియోగదారుడు ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్రం పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా యూపీఐ చెల్లింపులపై చార్జీలు వసూలు చేయనున్న నేపథ్యంలో చాలా మంది యూపీఐ వినియోగదారుల్లో చార్జీలపై కొంత ఆందోళన నెలకొంది. కేంద్ర ఆర్థిక శాఖ నివేదిక ప్రకారం పర్సన్ టు పర్సన్ మధ్య జరిగే లావాదేవీలపై ఎలాంటి చార్జీలు ఉండవు. సాధారణంగా వినియోగదారుడు ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్రం పేర్కొంది. వ్యాపారి అయితేనే, రూ.2 వేలకుపైగా చేసిన లావాదేవీలపై 0.4 శాతం నామమాత్రపు చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే వ్యాపారి రూ.2 వేలు పొందితే, అతను 0.4 శాతం చార్జీ చెల్లించాలి. ఇది కూడా గరిష్టంగా రూ.300. మీరు మీ స్నేహితుడికిగానీ లేదా ఏదైనా వ్యక్తికి డబ్బు పంపితే, చార్జీ ఉండదు.
అంటే మీరు సాధారణ వినియోగదారుడు అయితే, చార్జీల భారం ఉండదు. ఉదాహరణకు ఏదైనా దుకాణంలో సరుకులు కొన్నా, ఇంధనం నింపించినా యూపీఐ చార్జీలు ఉండవు, ఎలాంటి అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. బిల్లు రూ.2 వేలు దాటినా.. మర్చంటే చెల్లించాలి. ఇక రైల్వే టికెట్ బుకింగ్, ఫ్యుయెల్ పేమెంట్ వంటి లావాదేవీలు రూ.2 వేలు దాటితే వాటిపై చార్జీని రూ.5గా నిర్ధారించారు. ఇక్కడ కూడా వినియోగదారుడు చార్జీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. వ్యాపారియే చెల్లించాలి. వినియోగదారుడి నుంచి అతను చార్జీ వసూలు చేయకూడదు. ఈ చార్జీలు వచ్చే నెల 15 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆ చార్జీలు బ్యాంకులు, యాప్ ప్రొవైడర్లకు వెళ్తాయని కేంద్రం తెలిపింది.
వ్యక్తుల మధ్య లావాదేవీలు పూర్తిగా ఫ్రీ
పర్సన్ టు పర్సన్ మధ్య లావాదేవీల విలువ ఎంత జరిగినా పూర్తిగా ఉచితమని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. మీరు మీ ఫ్రెండ్ లేదా మరేదైనా వ్యక్తికి ఎంత డబ్బు పంపినా ఎలాంటి చార్జీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. అలాగే, వ్యాపారులకు కస్టమర్ రూ.2 వేల వరకు చెల్లించినా కస్టమర్‌పై చార్జీ పడదు. అంటే ఏదైనా గ్రాసరీ షాప్‌లో మీ బిల్లు రూ.1000 అయితే, చార్జీ ఉండదు. అలాంటి లావాదేవీలకు వినియోగదారులు ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టత ఇచ్చారు. ఇక చిన్న మొత్తాల్లో లావాదేవీలు చేసే చిన్న వ్యాపారులు, లోకల్ షాపులు, వీధి వ్యాపారులు కూడా నెలకు రూ.1 లక్ష దాకా లావాదేవీలు జరిపితే ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎక్కడ చార్జీలు వేస్తారంటే..
ఏదైనా ఔట్లెట్లో రూ.2 వేలకుపైగా మర్చంట్ ట్రాన్సాక్షన్లు జరిపితే చార్జీ పడుతుంది. ఇక్కడ కూడా వినియోగదారుడు కాకుండా వ్యాపారియే చార్జీ చెల్లించాలి. కనీసం 0.4 శాతం, గరిష్టంగా రూ.300 చార్జీలు ఉంటాయి. ఆ చార్జీలను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగదారుడిపై వ్యాపారి వేయకూడదు. చార్జీల భారం కస్టమర్లపై పడకుండా చూడాలని బ్యాంకులను కేంద్రం ఆదేశించింది.
అయితే.. రైల్వేలు, టెలికమ్యూనికేషన్లు, బీమా, ఇంధనం, వ్యవసాయ ఇన్పుట్లు వంటి రంగాల్లో రూ.2 వేలకుపైగా చేసిన లావాదేవీల్లో రూ.5 వ్యాపారియే చెల్లించాలి. అలాగే.. మ్యూచువల్ ఫండ్లు, సెక్యూరిటీల కోసం లావాదేవీలు జరిపితే, ఇక్కడ కూడా మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) 0.02 శాతాన్ని మర్చంట్ చెల్లించాలి. ఈ చార్జీలన్నీ బ్యాంకులు, పేమెంట్ యాప్ ప్రొవైడర్లకు వెళతాయి.
క్లుప్తంగా..
కేస్ 1: మీరు మీ కారులో ఫ్యుయెల్ నింపించారు. బిల్లు రూ.5 వేలు అయింది. వినియోగదారుడిగా మీరు ఎలాంటి చార్జీ కట్టాల్సిన అవసరం లేదు. ఫ్యుయెల్ కంపెనీ లేదా పెట్రోల్ పంప్ ఆపరేటర్ ఆ చార్జీ చెల్లిస్తాడు.
కేస్ 2: మీరు ఏదైనా రెస్టారెంట్లో తిన్నారు. బిల్లు రూ.6 వేలు అయింది. ఇక్కడ కూడా మీరు రూ.6 వేలే చెల్లిస్తారు. ఎండీఆర్‌ను రెస్టారెంట్ యజమాని చెల్లించాలి.
కేస్ 3: మీరు మొబైల్ ఫోన్ కొన్నారు. దాని ధర రూ.30 వేలు. ఇక్కడ కూడా మీరు రూ.30 వేలే చెల్లిస్తారు. ఎండీఆర్ రూ.120ని (బేస్ రేటు 0.4 శాతం వద్ద) విక్రేత చెల్లిస్తాడు.
కేస్ 4: మీరు మీ ఫ్రెండ్‌కు రూ.10 వేలు పంపించారు. ఇక్కడ కూడా మీపై ఎలాంటి చార్జీ పడదు. పర్సన్ టు పర్సన్ చెల్లింపులన్నీ ఎంత జరిపినా ఫ్రీ. అయితే, వ్యాపారులు ఆ చార్జీలను ఎట్టి పరిస్థితుల్లోనూ కస్టమర్లపై వేయకూడదని కేంద్రం స్పష్టం చేసింది.