ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Nov 07 , 2026 | 07:18 PM
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి, హైదరాబాద్, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఇరువురు నేతలు ఓ ప్రకటన విడుదల చేశారు.
దీపావళి ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నింపాలి: సీఎం చంద్రబాబు
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) పేర్కొన్నారు. ఈ పండుగ ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరియాలని అభిలాషించారు. ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు చిగురించాలని కోరుకున్నారు. మనం వెలిగించే దీపం మన ఇంటికే కాదని, సమాజానికీ వెలుగునివ్వాలని ఆకాంక్షించారు. సాటివారి జీవితాల్లో సంతోషాన్ని నింపేలా పండుగలో భాగం కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఐకమత్యం, పరస్పర సహకారంతో మనమంతా ముందుకు సాగాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
దీపావళి వెలుగులు ప్రతి ఇంటా సుఖసంతోషాలు నింపాలి: సీఎం రేవంత్‌రెడ్డి
దీపావళి వెలుగులు ప్రతి ఇంటా సుఖసంతోషాలు నింపాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) పేర్కొన్నారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ప్రజల జీవితాల్లోని చీకట్లను తొలగించి, వారి బతుకుల్లో కొత్త వెలుగులు నింపే లక్ష్యంతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. అన్నివర్గాల సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగకు విశిష్ఠమైన ప్రాధాన్యం ఉందని పేర్కొన్నారు.
దీపాల వెలుగులతో ఇళ్లను, పరిసరాలను అలంకరించుకుని రాష్ట్ర ప్రజలంతా ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. దీపావళి కాంతులు ప్రతి ఇంటా సుఖసంతోషాలను నింపాలని, ప్రజల జీవితాలు ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, శాంతిసౌభాగ్యాలతో వెల్లివిరియాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. పండుగ సంబరాల వేళ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ, కాలుష్యానికి తావులేకుండా, ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చిన్నారులు, పెద్దలు అందరూ సురక్షిత వాతావరణంలో దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తుఫాన్ బాధితులకు అండగా ఉంటాం.. అధైర్యపడొద్దు: సీఎం చంద్రబాబు
ఏపీ విపత్తు నిర్వహణ భేష్.. ప్రభుత్వ పనితీరుపై కేంద్రం ప్రశంసలు
పదే పదే అవమానించడంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా: విజయసాయిరెడ్డి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News