ఎల్‌పీజీ వినియోగదారులకు ఊరట
ABN , Publish Date - Sep 24 , 2026 | 01:50 PM
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్దం కారణంగా ఈ ఏడాది మార్చి నుంచి గ్యాస్ సిలిండర్ల రీఫిల్ బుకింగ్‌లపై కేంద్ర ప్రభుత్వం అంక్షలు విధించింది.
25 రోజులకే రీఫిల్ బుక్ చేసుకునే అవకాశం
వాంకిడి(ఆదిలాబాద్): పశ్చిమాసియాలో నెలకొన్న యుద్దం కారణంగా ఈ ఏడాది మార్చి నుంచి గ్యాస్ సిలిండర్ల రీఫిల్ బుకింగ్‌లపై కేంద్ర ప్రభుత్వం అంక్షలు విధించింది. దీంతో పట్టణాలు, గ్రామాల్లో ప్రజలు గ్యాస్‌ను పొదుపుగా వినియోగించారు. ఒక సిలిండర్ బుక్ చేసిన తరువాత మళ్లీ తీసుకోవాలంటే పట్టణ ప్రాంతాల్లో 35, గ్రామీణ ప్రాంతాల వారు 45 రోజులు ఆగేవారు. ప్రస్తుతం గ్యాస్ సరఫరా మెరుగుపడడంతో ఆంక్షలను సడలించారు.
25 రోజులకే సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 25 రోజులకు సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం కల్పించడంతో గ్యాస్ గోదాముల వద్ద రద్దీ బాగా తగ్గింది. 45 రోజులకు బుకింగ్ చేసుకోవాలని ఆంక్షలు ఉన్నప్పుడు సిలిండర్ రీఫిల్ కోసం గోదాముల వద్ద వినియోగదారులు బారులు తీరేవారు. ప్రస్తుతం మళ్లీ పూర్వపు పరిస్థితులు నెలకొనడంతో వనియోగదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
కొత్త కనెక్షన్ల కోసం..
కొత్త గ్యాస్ కనెక్షన్ల మంజూరు నిలిచి పోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొత్త గ్యాస్ కనెక్షన్ల జారీపై కేంద్ర ప్రభుత్వం అనధికారికంగా నిషేధం అమలు చేస్తోంది. గత మార్చి నుంచి ఏజెన్సీలు, కొత్త కనెక్షన్లు ఇవ్వడం లేదు. దీంతో గ్యాస్ కనెక్షన్ ఇప్పటి వరకు లేని వారు, కొత్తగా పెళ్లయిన జంటలు, వేరు కాపురాలు పెట్టిన వారు, జీవనో పాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కొత్త గ్యాస్ కనెక్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇంధన దిగుమతి సరిగా లేకపోవడంతో కొత్త గ్యాస్ కనెక్షన్ల మంజూరును కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది.
ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త కనెక్షన్లు మంజూరు చేస్తే సంక్షోభం మరింత పెరుగుతుందని భావించిన కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జిల్లాలోని 12 గ్యాస్ ఏజెన్సీల్లో 1,41,212 గృహ అవసర కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి నెల 52 వేల సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. కాగజ్‌నగర్‌లోని ఏజెన్సీల్లో 17 వేలు, ఆసిఫాబాద్‌లో 8 వేలు, కౌటాలలో 6 వేలు సరఫరా అవతున్నాయి. కొత్త కనెక్షన్లు జారీ చేస్తే ఎంతో మందికి ప్రయోజనం కలుగుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
జేఎన్‌టీయూ హాస్టళ్లలో భద్రత డొల్ల!
Read Latest AP News And Telangana News And International News And Telugu News