Share News

జేఎన్‌టీయూ హాస్టళ్లలో భద్రత డొల్ల!

ABN , Publish Date - Sep 24 , 2026 | 12:03 PM

జేఎన్‌టీయూ హాస్టళ్లలో భద్రతా లోపాలున్నాయని పోలీసులు స్పష్టం చేశారు.

జేఎన్‌టీయూ హాస్టళ్లలో భద్రత డొల్ల!
JNTU Hyderabad hostels

  • పటిష్ట చర్యలు చేపట్టాలని యాజమాన్యానికి పోలీసుల సూచన

హైదరాబాద్‌ సిటీ: జేఎన్‌టీయూ హాస్టళ్లలో భద్రతా లోపాలున్నాయని పోలీసులు స్పష్టం చేశారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని యాజమాన్యం తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 3, 4 తేదీల్లో రెండు వర్గాలకు చెందిన విద్యార్థులు పరస్పరం భౌతిక దాడులకు దిగడం, యూనివర్సిటీ లోపల, వెలుపల వాతావరణం రణరంగంగా మారడంపై కూకట్‌పల్లి జోన్‌ పోలీసులు సీరియ్‌సగా దృష్టి సారించారు.


సుమారు 36మంది విద్యార్థులపై కేసులు నమోదు కావడంతో.. సమగ్ర విచారణ అనంతరం విద్యార్థుల భద్రతకు సంబంధించి యాజమాన్యానికి కీలకమైన సూచనలు చేస్తూ కూకట్‌పల్లి డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ రితిరాజ్‌ లేఖ రాశారు. సెప్టెంబరు 3, 4తేదీల మధ్య అర్ధరాత్రి సమయంలో 4 వేర్వేరు సంఘటనలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఆయా ఘటనలను పరిశీలిస్తే విశ్వవిద్యాలయం వైపు నుంచి లోపాలు కనిపించాయని పేర్కొన్నారు.


అంత జరిగినా అడ్డుకున్న వారేలేరు..

ఒక విద్యార్థి మంజీరా హాస్టల్‌ గది తలుపును పగులగొట్టి లోపల ఉన్న విద్యార్థులపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, అక్కడ హాస్టల్‌ వార్డెన్‌ కానీ, సెక్యూరిటీ సిబ్బంది కానీ ఎవరూ అందుబాటులో లేరు. సుమారు 10 నుంచి 15 నిమిషాల పాటు ఇదే పరిస్థితి కొనసాగినప్పటికీ, పరిస్థితిని అదుపు చేయడానికి విశ్వవిద్యాలయం నుంచి ఎవరూ ముందుకు రాలేదు. వార్డెన్‌గా నియమితులైన అధికారి యూనివర్సిటీ క్యాంప్‌సకు చాలా దూరంలో నివసిస్తున్నట్లు తెలిసింది.


మొదటి సంఘటన హాస్టల్‌ సమీపంలోనే బహిరంగ ప్రదేశంలో జరిగినా ఎటువంటి సీసీ ఫుటేజ్‌ లభించలేదు. గతంలో జరిగిన అనేక సంఘటనలను పరిష్కరించడంలో యూనివర్సిటీ యంత్రాంగం వైఫల్యం చెందడం వల్లే ప్రస్తుత సంఘటన తీవ్రరూపం దాల్చింది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన భద్రతా ఏర్పాట్లను చేసుకోవాలని డీసీపీ కోరారు.


భద్రత కోసం పోలీసుల సూచనలివీ..

సెప్టెంబర్‌ 3, 4 తేదీల మధ్య అర్ధరాత్రి విద్యార్థుల దురుసు ప్రవర్తనను ఎదుర్కోవడంలో ప్రస్తుత ఏజెన్సీ విఫలమైనందున, ఈ సమస్యను పరిష్కరించగల సామర్థ్యం ఉన్న, ప్రైవేట్‌ సెక్యూరిటీ ఏజెన్సీ రెగ్యులేషన్‌ యాక్ట్‌ 2005 కింద లైసెన్స్‌ పొందిన సెక్యూరిటీ ఏజెన్సీని నియమించాలి. హాస్టళ్లకు వార్డెన్‌ల వ్యవస్థను ఏర్పాటు చేయాలి. వార్డెన్‌ హాస్టల్‌లోనే ఉంటూ, ఏదైనా సమస్య తలెత్తినప్పుడు తక్షణమే అందుబాటులో ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా స్పందించడానికి, హాస్టళ్ల, ప్రధాన గేటు సమీపంలో తగినంత సెక్యూరిటీ గార్డులను నియమించాలి.


కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌ఓ) సూచించిన విధంగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. విద్యార్థులను అర్థం చేసుకోగల, వారు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత పరిపాలనా అధికారుల దృష్టికి తీసుకురాగల అర్హత కలిగిన కౌన్సిలర్లను తగినంత మందిని నియమించాలి. భద్రతా చర్యల అమలుకు సంబంధించి ఎస్‌హెచ్‌ఓతో సమన్వయం కోసం లైజన్‌ ఆఫీసర్‌ను నియమిస్తే మేలు. ఇలా చేస్తే భవిష్యత్తులో ఏవైనా ఘటనలు జరిగితే సకాలంలో స్పందించడానికి వీలవుతుందని పోలీసులు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

మహా గణపతి మునిగేలా చర్యలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 24 , 2026 | 12:03 PM