Share News

భారీ వర్షాలు... పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

ABN , Publish Date - Sep 24 , 2026 | 10:38 AM

తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమ్యాయి.

భారీ వర్షాలు... పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
AP heavy rains

తూర్పుగోదావరి జిల్లా, సెప్టెంబర్ 24: తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమ్యాయి. రహదారులపైకి వరద నీరు వచ్చి చేరడంతో వాహనాల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెద్ద ఎత్తున కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. తూర్పుగోదావరి జిల్లాలోని ఎర్ర కాల్వ, ఎన్టీఆర్ జిల్లాలోని బుడమేరుకు వరద ఉధృతి కొనసాగుతోంది.


రాజమండ్రి: తుఫాన్ ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజమండ్రిలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైటెక్ బస్టాండ్ సెంటర్, రాజమండ్రి రైల్వే స్టేషన్ రహదారులు నీట మునిగాయి. అనపర్తి పొలమూరు రోడ్డులో ఎర్ర కాలువ వంతెన వద్ద భారీ వృక్షం కూలడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటు నిడదవోలు పరిసర ప్రాంతాలలో భారీగా కురుస్తున్న వర్షాలకు ఎర్ర కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. పలు రహదారుల పైకి వరద నీరు వచ్చి చేరడంతో రాకపోకలు స్థంభించాయి. నిడదవోలు నుంచి మాధవరం మీదుగా తాడేపల్లిగూడెం వెళ్లే వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సింగవరం- తాళ్లపాలెం వెళ్లే రహదారిలో రైల్వే అండర్ పాస్‌లోకి రెండు అడుగులకుపైగా నీరు చేరింది. అలాగే, తిమ్మరాజుపాలెంలోని శ్రీకోట సత్తెమ్మ ఆలయంలోకి వర్షపు నీరు చేరింది.


ఏలూరు జిల్లా: జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో వర్షం కారణంగా పలు చెట్లు నేలకొరిగాయి. రాకపోకలకు అంతరాయం కలగడంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. చెట్లను తొలగించి రాకపోకలకు ఏర్పాటు చేశారు.

విశాఖపట్నం: వర్షాల కారణంగా గాజువాక, పెదగంట్యాడ మండలంలో పలు కాలనీలు నీట మునిగాయి. రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి కుంచుమాంబ కాలనీ, నాతయ్యపాలెం, హౌసింగ్ బోర్డు కాలనీ, షీలానగర్, హరిజనజగ్గయ్యపాలెం ప్రాంతాలు జలమయమయ్యాయి. అర్ధరాత్రి ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.


కాకినాడ జిల్లా: ఎడతెరపిలేకుండా కురుస్తున్న ఏలేరు ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో భారీగా పెరుగుతోంది. గత రాత్రి 9 గంటలకు 850 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. ఈరోజు(గురువారం) ఉదయం 6 గంటలకు 4000 క్యూసెక్కులకు వరద చేరింది. మధ్యాహ్నానికి ఇన్‌ఫ్లో భారీగా పెరిగే అవకాశాలు ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని తాళ్లరేవు మండలం గాడిమొగ పంచాయతీ చిన్న వలసల గ్రామంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మట్టి గోడ కూలి 8 ఏళ్ల మల్లాడి లక్ష్మీనారాయణ అనే బాలుడు మృతిచెందాడు.

యానాం: తీవ్ర తుఫాన్ కారణంగా యానాం నియోజకవర్గంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో నియోజకవర్గం పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు పుదుచ్చేరి ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు యానాం పరిపాలనాధికారి శివరాజ్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.


పార్వతీపురం మన్యం: భారీ వర్షాల కారణంగా పాలకొండ కోర్టు దగ్గర ప్రధాన రహదారిపై భారీ వృక్షం నేలకొరిగింది. గాయత్రీ నగర్ కాలనీలోని వీధులు చెరువులను తలపిస్తున్న పరిస్థితి.

ఎన్టీఆర్ జిల్లా: మైలవరం నియోజకవర్గంలో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండటంతో బుడమేరకు వరద పెరిగింది. దీంతో అధికారులు బుడమేరులోకి పైనుంచి వచ్చే వరద నీటిని ఇబ్రహీంపట్నం యాక్టివ్ పవర్ ప్లాంట్ వద్ద గేట్లను ఎత్తివేసి కృష్ణానదిలోకి విడుదల చేశారు. పవిత్ర సంగమం వద్దకు భారీగా వరద నీరు చేరుకుంటోంది. మైలవరంలోని వెల్వడం వంతెన వద్ద బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. శుద్ధిపేటలో ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వర్షాల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో నేడు విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు.

పోలవరం జిల్లా: రంపచోడవరం ఏజెన్సీలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. మరేడుమిల్లి - భద్రాచలం ఘాట్ రోడ్‌లో పలుచోట్ల భారీ చెట్లు నేలకొరిగాయి. దీంతో మరేడుమిల్లి ఘాట్ రోడ్డులో ‌ఆర్టీసీ బస్సులు, వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే అధికారులు అక్కడకు చేరుకుని చెట్లను తొలగిస్తూ రాకపోకలు పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. మరోవైపు ఎడతెరిపిలేని వర్షాలకు రంపచోడవరం ఏజెన్సీలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. మారేడుమిల్లి మండలం బంద గిరిజన గ్రామం వద్ద వాగు ప్రమాదకర పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఆసుపత్రులు, అత్యవసర వైద్యం కోసం గిరిజన ప్రజలు బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. బంద వాగుపై వంతెన ఏర్పాటు చేయాలంటూ అధికారులు, ఎమ్మెల్యేకు సెల్ఫీ వీడియోలతో బంద గ్రామ గిరిజనులు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అటు పొల్లూరు జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రెండు రోజులపాటు పొల్లూరు వాటర్ ఫాల్స్‌ను అటవీ శాఖ అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.


ఇవి కూడా చదవండి...

పుష్కర ఘాట్లలో నీటి నాణ్యతపై పర్యవేక్షణ

ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలి గొంతు కోసి దారుణ హత్య

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 24 , 2026 | 11:29 AM