వరదలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. జాగ్రత్తలు తీసుకోండి: కలెక్టర్లతో సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Sep 24 , 2026 | 12:43 PM
వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నేడు, రేపు కూడా వర్షాలు కురవనున్నాయనే అంచనా ఉందని.. వివిధ జిల్లాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
అమరావతి, సెప్టెంబర్ 24: తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సీఎం చంద్రబాబు, మంత్రులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. తాజాగా వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నేడు, రేపు కూడా వర్షాలు కురవనున్నాయనే అంచనా ఉందని.. వివిధ జిల్లాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్షాలతో ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే క్షేత్రస్థాయికి వెళ్లి చక్కదిద్దాలని సూచించారు.
నీటి ఉధృతితో రోడ్లు దెబ్బతిని రాకపోకలకు అంతరాయం ఏర్పడిన చోట వెంటనే పునరుద్ధరించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. వర్షానికి కొండచరియలు విరిగిపడే చోట నివాసితులను అప్రమత్తం చేయాలని... అవసరమైతే తరలించాలని స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరాలో ఎక్కడా అంతరాయం కనిపించకూడదన్నారు. కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయి నుంచి సమాచారం తీసుకోవాలని ఆదేశించారు. చెరువులు నింపడంపై దృష్టి సారించడంతో పాటు గండ్లు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
క్షేత్రస్థాయి నుంచి ఎలాంటి సాయం కోరినా వెంటనే స్పందించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల అభిప్రాయాలను కూడా సేకరించాలని తెలిపారు. పలు ప్రాంతాల్లో భారీ గాలులు వీచడంతో విరిగిపడ్డ చెట్లను వెంటనే తొలగించి రవాణాకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. వరదలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ దానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ఇవి కూడా చదవండి...
విద్యుత్ వైర్లు తెగితే వెంటనే సమాచారం ఇవ్వాలి: మంత్రి గొట్టిపాటి రవికుమార్
వాయుగుండం ఎఫెక్ట్.. ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు.. కలెక్టర్ కీలక ఆదేశాలు
Read Latest AP News And Telugu News