Share News

వాయుగుండం ఎఫెక్ట్.. ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు.. కలెక్టర్ కీలక ఆదేశాలు

ABN , Publish Date - Sep 24 , 2026 | 12:11 PM

వాయుగుండం కారణంగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు.

వాయుగుండం ఎఫెక్ట్.. ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు.. కలెక్టర్ కీలక ఆదేశాలు
NTR District News

విజయవాడ, సెప్టెంబర్ 24: వాయుగుండం కారణంగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. వర్షం కురుస్తున్న సమయంలోనే అధికారులు రైన్‌కోట్లు ధరించి క్షేత్రస్థాయిలో పర్యటించాలని.. ప్రజలకు భరోసా కల్పించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. తిరువూరు, జగ్గయ్యపేట, విజయవాడ పట్టణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.


అవసరమైన ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలను సురక్షితంగా తరలించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పునరావాస కేంద్రాల వివరాలను తెలియజేస్తూ బోర్డులు ఏర్పాటు చేసి, అక్కడ సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. ఇప్పటికే పొంగిన కట్టలేరు, మున్నేరు, పాలేరు వాగుల పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని వెల్లడించారు. కోతులవాగు, నల్లవాగు, పులివాగు, బుడమేరు పరిస్థితులను జలవనరుల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పరిశీలించాలని చెప్పుకొచ్చారు. పరిస్థితి చేయిదాటిన తర్వాత చర్యలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదని, ముందస్తు చర్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు.


వాగులు, కాలువలు, చెరువుల పరిస్థితుల్లో మార్పులను గుర్తించిన వెంటనే యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని లక్ష్మీ శ ఆదేశించారు. జగ్గయ్యపేట ఊర చెరువు ప్రాంతాన్ని వెంటనే పరిశీలించి అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని అన్ని చెరువులను, వాటి కట్టల స్థితిగతులను పరిశీలించి ఎక్కడైనా గండ్లు పడే అవకాశం ఉంటే తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇబ్రహీంపట్నం ప్రాంతంలో పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవసరమైతే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచనలు చేశారు. విజయవాడ పట్టణంలో నీరు చేరే ప్రాంతాల్లో సిబ్బందిని నియమించి నిరంతరం పర్యవేక్షిస్తూ తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. జలహారతి పనులు చేపట్టిన ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచే పరిస్థితి ఉందా లేదా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని తెలిపారు. వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించాలని సూచించారు. జిల్లాలోని అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి వర్షాల పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నారు. ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ లక్ష్మి శ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.


ఇవి కూడా చదవండి...

ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలి గొంతు కోసి దారుణ హత్య

విద్యుత్ వైర్లు తెగితే వెంటనే సమాచారం ఇవ్వాలి: మంత్రి గొట్టిపాటి రవికుమార్

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 24 , 2026 | 12:13 PM