Share News

CM Revanth Reddy: ఆదిలాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ వరాల జల్లు

ABN , Publish Date - Jan 16 , 2026 | 04:49 PM

ఆదిలాబాద్ జిల్లాపై సీఎం రేవంత్‌రెడ్డి వరాల జల్లు కురిపించారు. రూ.386 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు, సదర్మట్ బ్యారేజ్‌ను జాతికి అంకితం చేశారు. జిల్లాకు ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కేసీఆర్ హయాంలోని పెండింగ్ ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందని సీఎం స్పష్టం చేశారు.

CM Revanth Reddy: ఆదిలాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ వరాల జల్లు
CM Revanth Reddy

ఆదిలాబాద్, జనవరి16 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్ జిల్లా అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి(CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. అత్యంత వెనుకబడిన ఈ జిల్లాకు ఆశించిన న్యాయం జరగలేదని పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శక్రవారం సీఎం పర్యటించిన ఆయన.. రూ.386.46 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. హాతిఘాట్‌లో చనాకా - కొరాట బ్యారేజ్ పంప్‌హౌస్ ప్రారంభించారు. సదర్మట్‌ బ్యారేజ్‌ను జాతికి అంకితం చేశారు. యాసంగి పంటకు నీరు విడుదల చేశారు. పొన్కల్‌ దగ్గర గోదావరి నదిపై సదర్మట్‌ బ్యారేజ్‌ నిర్మాణాన్ని ప్రారంభించారు. రూ.676 కోట్లతో ప్రభుత్వం సదర్మట్‌ బ్యారేజ్‌ నిర్మాణం చేపట్టిందని సీఎం ప్రసంగించారు. ఈ బ్యారేజ్‌ ద్వారా 18 వేల ఎకరాలకు సాగునీరును ప్రభుత్వం అందించనుందన్నారు.


సరైన న్యాయం జరగలేదు..

పోరాటం, పౌరుషాల గడ్డ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అని రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు సరైన న్యాయం జరగలేదని చెప్పుకొచ్చారు. పాలమూరుతో సమానంగా ఆదిలాబాద్‌ అభివృద్ధి చేస్తామని వివరించారు. ఆదిలాబాద్‌కు కావాల్సిన నిధులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో చిత్తశుద్ధిగా పనిచేసి ఉంటే చనాక - కొరాట ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయ్యేదని తెలిపారు. పాలమూరు జిల్లాతో సమానంగా ఆదిలాబాద్ అభివృద్ధికి నిధులు ఇస్తామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి.


నిధులు మంజూరు చేశాం..

చనాక - కొరాట, సదర్మట్‌ బ్యారేజీలు గత పదేళ్లలో పూర్తికాలేదని ఈ సందర్భంగా సీఎం చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అవసరమైన నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేశామని వెల్లడించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీ ఇవ్వాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. బాసర ట్రిపుల్ ఐటీలోనే యూనివర్సిటీని ప్రారంభిస్తామన్నారు. ఇందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రికి సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.

ఆదిలాబాద్‌ యూనివర్సిటీని తానే ప్రారంభిస్తానని రేవంత్ చెప్పుకొచ్చారు.కాళేశ్వరానికి రూ.లక్షా 10 వేల కోట్లు ఖర్చుచేసినా.. చుక్కనీరు రాలేదని విమర్శించారు. రైతులకు నీరు రావాలంటే తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొన్నారు. ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నామని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. నాగోబా జాతరకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రూ.300 కోట్లతో మేడారం ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు సీఎం రేవంత్.


అందుకే మోదీని కలుస్తున్నా..

‘ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేయబోతున్నాం. ప్రధాని మోదీ చేతులమీదుగా ప్రారంభిస్తాం. ఆదిలాబాద్‌లో పరిశ్రమల అభివృద్ధికి 10వేల ఎకరాల భూసేకరణ జరుపుతాం. పరిశ్రమలు వస్తేనే అభివృద్ధి సాధ్యం అవుతుంది. ఎన్నికలప్పుడే రాజకీయాలు.. ఎన్నికలు ముగిసిన తర్వాత అభివృద్ధికి కలిసి పనిచేద్దాం. అందుకే ప్రతి మూడు నెలలకోసారి ప్రధానిని, కేంద్ర మంత్రులను కలుస్తున్నాం. బీజేపీ ప్రజా ప్రతినిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకువస్తే పరిష్కరిస్తాం. నేను తరచూ ప్రధానిని కలవడంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నాకు నరేంద్ర మోదీతో బంధుత్వం లేదు.. చుట్టమూ కాదు. ఆయన మనకు ప్రధాని.. ఆయనతో పనులు చేయించుకుంటున్నాం. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తా, పైరవీల కోసం పోవడం లేదు, పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. ఎవరిని కలిసినా అభివృద్ధి కోసమే. కేంద్రం సహకారంతోనే అవసరమైన ఎయిర్ పోర్టులు, నిధులు వస్తున్నాయి. నాటి పాలకులు చేసిన అప్పులే ఇప్పుడు ఉరి తాడు అయ్యాయి. మేం ఫ్యూచర్ సిటీ అంటే మమ్మల్ని రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ అంటున్నారు’ అని ప్రతిపక్షాలనుద్దేశించి అన్నారు ముఖ్యమంత్రి.


ఫామ్‌హౌస్‌లోనే ఉండండి..

‘పదేళ్ల పాలనలో ఏమీచేయని వ్యక్తి ప్రజాపాలనను భరించలేక పోతున్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఉన్న వ్యక్తి ఇలాగేనా మాట్లాడేది. చేతనైతే మమ్మల్ని ఆశీర్వదించండి.. లేకుంటే ఫామ్‌హౌస్‌లోనే ఉండండి. మారీచుడు, సుగ్రీవుడు తరహాలో రాక్షసుల్లా.. అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. శుక్రాచార్యుడిలా ఫామ్‌హౌస్‌లో ఉన్న వ్యక్తి ప్రోత్సహిస్తున్నారు. పదేళ్లు అధికారంలో ఉండి రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారు. బీఆర్ఎస్ నేతలకు అభివృద్ధి అంటే ఇష్టం లేకపోతే ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకోవచ్చు. బావాబామ్మర్దులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. మొన్న పంచాయతీ ఎన్నికల్లో 66శాతం కాంగ్రెస్ సర్పంచ్‌లను గెలిపించారు ప్రజలు. వారి నమ్మకాన్ని వమ్ము చేయం. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ మంచి వాళ్లను ఎన్నుకోండి. సమస్యలను పరిష్కరించే వాళ్లను, ప్రజా ప్రభుత్వంతో కలిసి పనిచేసిన వాళ్లనే గెలిపించుకోండి. నేను ఓడిపోయిన వాళ్ల గురించి మాట్లాడను. మేం పాలకులం కాదు.. సేవకులం. మీ మనసు గెలుస్తాం.. రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తాం. 2038వరకు అధికారంలో ఉంటాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి...

సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌ రెడ్డి లేఖ.. ఎందుకంటే..

సంక్రాంతి వేళ దొంగల హల్‌చల్.. చెంగిచెర్లలో భారీ చోరీలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 16 , 2026 | 05:41 PM