Share News

ఇన్‌స్టాలో ఏఐతో వయసు గుర్తింపు.. టీనేజర్ల ఖాతాలకు అదనపు భద్రత!

ABN , Publish Date - Nov 10 , 2026 | 01:17 PM

టీనేజర్ల ఆన్‌లైన్ భద్రత కోసం మెటా కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏఐ సాయంతో వినియోగదారుల వయసును గుర్తించి, వయసు వివరాలు తప్పుగా నమోదు చేసినా టీనేజర్ల ఖాతాలను ప్రత్యేక రక్షణ కలిగిన టీన్ అకౌంట్స్ పరిధిలోకి తీసుకురానుంది.

ఇన్‌స్టాలో ఏఐతో వయసు గుర్తింపు.. టీనేజర్ల ఖాతాలకు అదనపు భద్రత!
Meta to expand AI age detection globally in Instagram

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో టీనేజర్ల భద్రతకు మరింత ప్రాధాన్యమిస్తూ మెటా కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాదారుల వయసును కృత్రిమ మేధ(ఏఐ) సాయంతో గుర్తించే సాంకేతికతను ప్రపంచవ్యాప్తంగా విస్తరించనున్నట్లు ప్రకటించింది. దీంతో వయసు వివరాలను తప్పుగా నమోదు చేసినప్పటికీ.. టీనేజర్లుగా గుర్తించిన లక్షలాది అకౌంట్లను ప్రత్యేక రక్షణ కలిగిన 'టీన్‌ అకౌంట్స్‌' పరిధిలోకి తీసుకురానుంది.


కాగా.. 2025 ఏప్రిల్‌లోనే మెటా ఈ ఏఐ ఆధారిత విధానాన్ని ఇన్‌స్టాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. అంటే ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో వయసును 18 ఏళ్లకు పైగా నమోదు చేసినట్టయితే.. వారి వాస్తవ వయసు టీనేజర్ల పరిధిలో ఉన్నట్లు ఏఐ గుర్తించే భద్రతా సెట్టింగులను అమలు చేస్తోంది. తద్వారా యువతకు అనుచితమైన, హానికరమైన కంటెంట్‌ వారి ఫీడ్‌లో కనిపించకుండా పరిమితులు విధించనుంది.


సామాజిక మాధ్యమాల వల్ల చిన్నారులు ఎదుర్కొంటున్న ప్రమాదాలపై ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, న్యాయస్థానాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పిల్లలను ఆకర్షించేలా ప్లాట్‌ఫామ్‌ల రూపకల్పన, అనుచిత పరిచయాలు, ఆన్‌లైన్‌ వేధింపులు, వ్యసనంగా మారుతున్న వినియోగంపై మెటా విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో కొత్త విధానంలో భాగంగా.. టీనేజర్ల ఖాతాలకు వయసుకు తగిన రక్షణ సెట్టింగ్స్ ఎలా అమలవుతాయో వివరించే వీడియోలను తల్లిదండ్రులకు అందుబాటులోకి తీసుకురానుంది. పిల్లలు సామాజిక మాధ్యమాలను సురక్షితంగా వినియోగించేలా తమ వంతు చర్యలు కొనసాగిస్తామని మెటా వెల్లడించింది. కొత్త ఫీచర్ల అమలు జనవరిలో ప్రారంభం కానున్నట్లు తెలిపింది.


ఇవీ చదవండి:

మోదీతో మాటలుండవు.. నమస్కారాలకే పరిమితం: సోనియా గాంధీ

ఎన్విడియా అధినేతకు బిగ్ షాక్.. ఒక్కరోజే 7.4 బిలియన్ డాలర్ల సంపద ఆవిరి.!

Updated Date - Nov 10 , 2026 | 01:19 PM