Share News

WPL 2026: ఆ తప్పిదంతోనే గెలిచే మ్యాచ్‌లో ఓడాం.. హర్మన్‌ప్రీత్ కౌర్

ABN , Publish Date - Jan 10 , 2026 | 07:15 AM

మహిళల ప్రీమియర్ లీగ్ 2026 శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఆరంభ మ్యాచులోనే అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచింది. ఆఖరి బంతి వరకు పోరాడి.. గెలుపు అంచున కూడా లేని ఆర్సీబీ జట్టు.. అనూహ్యంగా ముంబై ఇండియన్స్‌పై 3 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. ఓటమిపై ఎంఐ కెప్టెన్ హర్మన్ మాట్లాడింది.

WPL 2026: ఆ  తప్పిదంతోనే గెలిచే మ్యాచ్‌లో ఓడాం.. హర్మన్‌ప్రీత్ కౌర్
WPL 2026

ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్(WPL 2026) నాలుగో సీజన్‌ తొలి మ్యాచే అభిమానులకు బోలెడంత వినోదాన్ని పంచింది. శుక్రవారం చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఆర్సీబీ 3 వికెట్ల తేడాతో ముంబైపై అనూహ్య విజయాన్నందుకుంది. గెలుపు ఆశల్లేని స్థితిలో నాడిన్ డి క్లెర్క్(63*) సంచలన ఇన్నింగ్స్ ఆడటంతో ఆర్సీబీ 3 వికెట్లు కోల్పోయి సరిగ్గా 2 ఓవర్లలో 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. అటు బంతితోనూ నాడిన్‌ అదరగొట్టింది. 26 పరుగులిచ్చి ఏకంగా 4 వికెట్లు పడగొట్టింది. ఓటమి ఖాయం అనుకున్న ఆర్సీబీ జట్టు.. అద్భుత విజయాన్ని అందుకోవడంలో డి క్లెర్క్ కీలక పాత్ర పోషించింది. ఆఖరి ఓవర్‌లో ముంబై జట్టు 18 పరుగులను డిఫెండ్ చేసుకోలేకపోయింది. అయితే ఎంఐ ఓటమిపై కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) స్పందించింది.


‘ఆఖరి ఓవర్‌లో ఎన్ని పరుగులు అవసరం అయినా.. వాటిని సాధించగల సామర్థ్యం డి క్లెర్క్‌కు ఉందన్న విషయం మాకు తెలుసు. చివరిలో మేం ఒక్కటంటే ఒక్క మంచి బంతిని కూడా వేయలేకపోయాం. టీ20 క్రికెట్‌లో ఇలాంటివి జరగడం సాధారణమే. మేం ఆమెకు చాలా అవకాశాలు ఇచ్చాం. క్యాచ్‌లు నేలపాలు చేశాం. రనౌట్ అవకాశాన్ని చేజార్చుకున్నాం. నాడిన్‌ను ఔట్ చేయలేకపోవడమే మా ఓటమిని కారణమైంది. కొన్నిసార్లు బ్యాటర్లు చాలా బలమైన మనస్తత్వంతో వస్తారు.


ఈ మ్యాచ్‌ గెలవడానికి మేం సాయశక్తులా ప్రయత్నించాం. కానీ వచ్చిన అవకాశాలను చేజార్చుకున్నాం. చివరి ఓవర్‌లో ఒక్క మంచి బంతి వేసినా మేం విజయం సాధించేవాళ్లం. డబ్ల్యూపీఎల్‌లో ఇలాంటి మ్యాచ్‌లు ఎదురవుతూనే ఉంటాయి. మేం ఈ ఓటమి గురించి ఆలోచిస్తూ ఉంటే.. తదుపరి మ్యాచ్‌ ఆడలేం. ఈ ఓటమిని మరిచి తర్వాతి మ్యాచ్‌లో ఇంకా మెరుగ్గా ఎలా రాణించాలో ఆలోచించాలి’ అని హర్మన్ వెల్లడించింది.


ఇవి కూడా చదవండి:

చరిత్ర సృష్టించిన రుతురాజ్‌ గైక్వాడ్

Bangladesh Cricket: బంగ్లాదేశ్‌ క్రికెటర్లకు భారీ ఎదురుదెబ్బ.. ఆర్థికంగా కుదేలు కానున్నారా..?

Updated Date - Jan 10 , 2026 | 07:24 AM