Vijay hazare Trophy: చరిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్
ABN , Publish Date - Jan 09 , 2026 | 11:00 AM
టీమిండియా స్టార్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో సంచలన రికార్డు నెలకొల్పాడు. ఈ టోర్నీలో భాగంగా గోవాతో జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ 134 పరుగులతో అద్భుత సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో అత్యధిక సెంచరీలు (15) చేసిన బ్యాటర్‌గా మహారాష్ట్ర జట్టుకు చెందిన అంకిత్ బావ్నే రికార్డును సమం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో అద్భుత ప్రదర్శనలు చేస్తున్నాడు. మహారాష్ట్ర కెప్టెన్‌గా ఉన్న రుతురాజ్.. దేశవాళీ క్రికెట్‌లో ఓ సంచలన రికార్డు నెలకొల్పాడు. ఈ టోర్నీలో భాగంగా గోవాతో జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ 134 పరుగులతో అద్భుత సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో అత్యధిక సెంచరీలు (15) చేసిన బ్యాటర్‌గా ఆ జట్టుకే చెందిన అంకిత్ బావ్నే రికార్డును సమం చేశాడు.
ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన గైక్వాడ్(Ruturaj Gaikwad) 131 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 134 పరుగులు సాధించాడు. ఇది ఈ సీజన్‌లో అతడికిది రెండో సెంచరీ. అతడి ఇన్నింగ్స్ వల్లే మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 249 పరుగుల స్కోరు చేయగలిగింది. మరోవైపు వన్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన అంకిత్ బావ్నే డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే రుతురాజ్ విజయ్ హజారేలో కేవలం 59 ఇన్నింగ్స్‌ల్లోనే 15 సెంచరీల మైలురాయిని అందుకోవడం విశేషం. అంకిత్ బావ్నే ఈ రికార్డు కోసం వందకు పైగా మ్యాచ్‌లు ఆడాడు.
ఈ జాబితాలో రుతురాజ్, బావ్నేల తర్వాతి స్థానాల్లో కర్ణాటక సూపర్ జోడీ దేవదత్ పడిక్కల్, మయాంక్ అగర్వాల్ (13 సెంచరీలు) ఉన్నారు. ముఖ్యంగా పడిక్కల్ ప్రస్తుత సీజన్‌లోనే నాలుగు సెంచరీలతో చెలరేగి ఆడాడు. ఇలాగే కొనసాగితే రుతురాజ్ రికార్డుకు బ్రేక్ పడే అవకాశం లేకపోలేదు. ఆశ్చర్యం ఏంటంటే.. స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోని వంటి భారత వన్డే దిగ్గజాలు కూడా విజయ్ హజారే ట్రోఫీలో ఈ రికార్డు దరిదాపుల్లోకి రాలేదు.
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్న రుతురాజ్‌ను న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేయకపోవడం అందరినీ ఆశ్చర్యం కలిగించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయినా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు రుతురాజ్‌ను పక్కన పెట్టడం చర్చనీయాంశమైంది.
ఇవి కూడా చదవండి:
గాయంతో తిలక్ వర్మ దూరం.. రేసులో ఉన్నదెవరంటే?
ఆ తప్పిదమే మా ఓటమికి కారణమైంది: బెన్ స్టోక్స్