Share News

Team India: టెస్టులకు 15 రోజుల ప్రిపరేషన్‌ విండో.. గిల్ నిర్ణయంపై మాజీ క్రికెటర్ల ప్రశంసలు!

ABN , Publish Date - Jan 09 , 2026 | 10:05 AM

మిగతా అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా.. టెస్టుల్లో మాత్రం తీవ్రంగా విఫలమవుతూ వస్తోంది. ఇకపై ప్రతి టెస్టు సిరీస్‌కు ముందు కనీసం 15 రోజుల ప్రాక్టీస్‌ విండో ఉండాలంటూ బీసీసీఐకి గిల్‌ సూచించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే గిల్ నిర్ణయాన్ని పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసిస్తున్నారు.

Team India: టెస్టులకు 15 రోజుల ప్రిపరేషన్‌ విండో.. గిల్ నిర్ణయంపై మాజీ క్రికెటర్ల ప్రశంసలు!
Team India

ఇంటర్నెట్ డెస్క్: మిగతా అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా.. టెస్టుల్లో మాత్రం తీవ్రంగా విఫలమవుతూ వస్తోంది. స్వదేశంలోనే న్యూజిలాండ్, సౌతాఫ్రికా చేతిలో క్లీన్ స్వీప్ అవ్వడమే దీనికి ఉదాహరణ. భారత టెస్టు క్రికెట్‌ గమనంలో పురోగతి కనిపించని వేళ, కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ తీసుకున్న ఓ కీలక నిర్ణయం క్రికెట్‌ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇకపై ప్రతి టెస్టు సిరీస్‌కు ముందు కనీసం 15 రోజుల ప్రాక్టీస్‌ విండో ఉండాలంటూ బీసీసీఐకి గిల్‌(Shubman Gill) సూచించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గతేడాది టీమిండియా షెడ్యూల్ చాలా బిజీగా ఉండటం వల్లే సరైన ప్రాక్టీస్ చేయలేకపోయామని.. ఓటములకు అదే ప్రధాన కారణమని గిల్ వెల్లడించాడు. అయితే గిల్ నిర్ణయాన్ని పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసిస్తున్నారు.


గత ఏడాది కాలంగా టెస్టుల్లో భారత్‌ ఆశించిన స్థాయిలో రాణించలేదు. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ చేతుల్లో సిరీస్‌ పరాజయాలతో వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ రేసులో భారత్‌ పరిస్థితి సంక్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలో గిల్‌ తీసుకున్న ఈ నిర్ణయం టెస్ట్ క్రికెట్ భవిష్యత్తుకు కీలకంగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘టీమిండియా టెస్టు కెప్టెన్‌గా గిల్‌ తీసుకున్న ఈ నిర్ణయం సాహసోపేతమైనది. టెస్టు సిరీస్‌ గెలవాలంటే కనీసం రెండు వారాల సంసిద్ధత తప్పనిసరి. టెస్టు క్రికెట్‌కు గౌరవం ఇవ్వాలంటే ఓ ప్రణాళిక, దానికి తగ్గట్లు ప్రాక్టీస్ అవసరం. ఈ అంశాన్ని గిల్ ప్రస్తావించినందుకు సంతోషంగా ఉంది’ అని మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప(Robin Uthappa) వ్యాఖ్యానించాడు.


అలాగే, మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా(Aakash Chopra) కూడా గిల్‌ నిర్ణయానికి మద్దతు పలికాడు. ‘బీసీసీఐ(BCCI) ఆర్థికంగా బలమైన బోర్డు. వెంట వెంటనే మ్యాచులు నిర్వహించాల్సిన అవసరం లేదు. కావాలంటే సరైన ప్రిపరేషన్‌ విండోను సృష్టించవచ్చు. ప్లేయర్లు ఒక దేశం నుంచి మరో దేశం వెళ్లి వేర్వేరు ఫార్మాట్లు ఆడటం కష్టం. సరైన ప్రాక్టీస్ లేకపోతే విఫలం కావడం సహజమే’ అని వ్యాఖ్యానించాడు. మొత్తంగా టెస్టు క్రికెట్‌కు ప్రాధాన్యం ఇచ్చే దిశగా గిల్‌ అడుగులు వేస్తుండటంతో భారత టెస్టు భవిష్యత్తుపై ఆశలు చిగురిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి:

గాయంతో తిలక్ వర్మ దూరం.. రేసులో ఉన్నదెవరంటే?

ఆ తప్పిదమే మా ఓటమికి కారణమైంది: బెన్ స్టోక్స్

Updated Date - Jan 09 , 2026 | 03:18 PM