Share News

T20 WC 2026: గాయంతో తిలక్ వర్మ దూరం.. రేసులో ఉన్నదెవరంటే?

ABN , Publish Date - Jan 09 , 2026 | 08:34 AM

టీ20 ప్రపంచకప్‌నకు ముందు న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు సిద్ధమవుతున్న టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కీలక మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ ఆ సిరీస్‌ తొలి మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో తిలక్ స్థానంలో ఆడే ప్లేయర్‌పై అంతటా చర్చ మొదలైంది. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ముఖ్యంగా ముగ్గురు ఆటగాళ్లు రేసులో ఉన్నారు.

T20 WC 2026: గాయంతో తిలక్ వర్మ దూరం.. రేసులో ఉన్నదెవరంటే?
T20 WC 2026

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌నకు ముందు న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు సిద్ధమవుతున్న టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బుధవారం రాజ్‌కోట్‌లో వృషణాలకు శస్రచికిత్స చేయించుకున్న కీలక మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ ఆ సిరీస్‌ తొలి మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఫిబ్రవరి 7న ప్రపంచ కప్ ఆరంభం కానున్న నేపథ్యంలో తిలక్ పరిస్థితి టీమిండియాకు ఆందోళన కలిగించేదే. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా హైదరాబాద్ తరఫున బరిలోకి దిగిన తిలక్ వర్మ(Tilak Varma)కు మ్యాచ్ తర్వాత గాయమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిలక్ స్థానంలో ఆడే ప్లేయర్‌పై అంతటా చర్చ మొదలైంది. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ముఖ్యంగా ముగ్గురు ఆటగాళ్లు రేసులో ఉన్నారు. వారెవరంటే..


ముందు వరుసలో గిల్..

తిలక్ వర్మ స్థానాన్ని టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌(Shubman Gill)తో భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. టీ20ల్లో ఓపెనర్‌గా విఫలమవడంతో గిల్.. తన వైస్ కెప్టెన్సీతో పాటు జట్టులో స్థానం కూడా కోల్పోయిన విషయం తెలిసిందే. తిలక్ వర్మ గైర్హాజరీ నేపథ్యంలో శుభ్‌మన్ గిల్‌ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. గిల్ మిడిలార్డర్ బ్యాటర్‌గానే తన టీ20 కెరీర్ ప్రారంభించాడు. అతను మిడిలార్డర్‌లో కూడా బ్యాటింగ్ చేయగలడు. 2018 నుంచి 175 టీ20లు ఆడిన గిల్.. 5,412 పరుగులు చేశాడు. అయితే న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో గిల్ చెలరేగితేనే అతనికి పిలుపు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.


అయ్యర్‌కు అవకాశం!

తిలక్ వర్మ స్థానంలో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌(Shreyas Iyer)కు అవకాశం దక్కవచ్చు. టీ20ల్లో అయ్యర్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయగలడు. ఐపీఎల్‌ 2025 సీజన్‌లో అతను అద్భుత ప్రదర్శన కనబర్చినప్పటికీ భారత టీ20 జట్టులో అయ్యర్‌కు చోటు దక్కలేదు. పంజాబ్ తరఫున అయ్యర్ 604 పరుగులు చేశాడు. 2023 నుంచి శ్రేయస్ ఒక్క అంతర్జాతీయ టీ20 కూడా ఆడలేదు. ఇటీవలే గాయం నుంచి కోలుకున్న అతడికి సెలెక్టర్లు అవకాశం ఇవ్వవచ్చు. అతడు కూడా న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో సత్తా చాటాల్సి ఉంది.


పంత్ తిరిగొస్తాడా..?

తిలక్ వర్మ‌ను భర్తీ చేసే ఆటగాళ్ల రేసులో రిషభ్ పంత్‌(Rishabh Pant) కూడా ఉన్నాడు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్‌‌కు ప్రాధాన్యత ఇస్తే పంత్‌కు అవకాశం దక్కుతుంది. ఇప్పటికే వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్ ఉన్న నేపథ్యంలో పంత్ స్పెషలిస్ట్ బ్యాటర్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే టీ20ల్లో పంత్‌కు గొప్ప ఫామ్ లేదు. దూకుడుగా ఆడే సామర్థ్యం ఉంది. టీ20 ప్రపంచకప్ 2024 విన్నింగ్ టీమ్‌లో పంత్ సభ్యుడిగా ఉన్నాడు. ఇప్పటి వరకు అతను 144.40 స్ట్రైక్‌రేట్‌తో 5291 పరుగులు చేశాడు.


ఇవి కూడా చదవండి..

Punjab vs Mumbai: ఉత్కంఠ పోరులో పంజాబ్ సంచలన విజయం..

Hardik Pandya: హార్దిక్ పాండ్య సిక్సర్ల వర్షం .. భారీ స్కోరు చేసిన బరోడా..

Updated Date - Jan 09 , 2026 | 08:34 AM