Hardik Pandya: హార్దిక్ పాండ్య సిక్సర్ల వర్షం .. భారీ స్కోరు చేసిన బరోడా..
ABN , Publish Date - Jan 08 , 2026 | 02:58 PM
విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. తొలి మ్యాచ్ లో విదర్భపై చెలరేగి ఆడిన పాండ్య.. నేడు చండీగడ్ పై ఆకాశమే హద్దుగా విజృంభించాడు.
ఇంటర్నెట్ డెస్క్: విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy 2025-26)లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య చెలరేగి ఆడుతున్నాడు. ఈ టోర్నీలో బరోడా తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న పాండ్య.. తన తొలి మ్యాచ్‌లోనే విదర్భపై చెలరేగి ఆడి శతకం చేశాడు. 92 బంతుల్లో 8 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 133 పరుగులు చేశాడు. ఇవాళ (గురువారం) చండీగడ్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోసారి తన ఉగ్రరూపం చూపించాడు. కేవలం 31 బంతుల్లో 75 పరుగులు చేశాడు. దీంతో బరోడా జట్టు 391 పరుగుల భారీ స్కోర్ చేసింది. మొత్తంగా ప్రస్తుత విజయ్ హజారే ట్రోఫీలో 125 బంతులు ఎదుర్కొన్న హార్దిక్ (Hardik Pandya).. 21 సిక్సర్లు, 10 ఫోర్లతో 208 పరుగులు చేసి జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇవాళ(గురువారం) విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా రాజ్‌కోట్ వేదికగా చండీగడ్‌తో బరోడా(Baroda vs Chandigarh) తలపడుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన బరోడా 49.1 ఓవర్లలో 391 పరుగులకు ఆలౌటైంది. ప్రియాంషు మోలియా (113) శతకంతో ఆకట్టుకున్నాడు. టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్య (31 బంతుల్లో 75 పరుగులు) అదిరిపోయే అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇందులో 2 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి.
అలానే మరో బ్యాటర్ జితేశ్ శర్మ (33 బంతుల్లో 73 పరుగులు) కూడా చండీగడ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. విష్ణు సోలంకి (54), నినాద్ అశ్విన్ కుమార్ (38), కృనాల్ పాండ్య (20) బరోడా భారీ స్కోర్ చేయడంలో తమవంత పాత్ర పోషించారు. ఇక చండీగడ్(Chandigarh) బౌలర్లలో జగ్జీత్ సింగ్ 3 వికెట్లు తీయగా.. రోహిత్ 2, హర్తేజస్వి కపూర్ 2, నిశుంక్ బిర్లా, విషు కశ్యప్, తరణ్‌ప్రీత్ సింగ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. భారీ టార్గెట్ ఛేదనలో బ్యాటింగ్‌కు దిగిన చండీగడ్ 15 ఓవర్లకు 83 పరుగులు చేసి.. నాలుగు వికెట్లు కోల్పోయింది.
ఇవి కూడా చదవండి..
టీ20 ప్రపంచ కప్‌నకు ముందు టీమిండియాకు షాక్.. తిలక్ వర్మకు సర్జరీ..