ED Raids: ఐప్యాక్‌పై ఈడీ నజర్.. వాటిపై ఫోకస్
ABN , Publish Date - Jan 08 , 2026 | 02:08 PM
దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దృష్టి కేంద్రీకరించింది. కోల్‌కత్తాలోని ఐప్యాక్ కార్యాలయంపై ఈడీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు.
ఢిల్లీ, జనవరి8 (ఆంధ్రజ్యోతి): దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (I-PAC)పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు (ED) స్పెషల్ ఫోకస్ పెట్టారు. కోల్‌కత్తాలోని ఐప్యాక్ కార్యాలయంపై ఇవాళ(గురువారం) ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈడీ దాడులు పీఎంఎల్‌ఏ (ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్) కింద జరుగుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు. ఐప్యాక్‌కు సంబంధించిన నిధుల లావాదేవీలపై అనుమానాలతోనే ఈ దాడులు జరిగినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు.
రాజకీయ వ్యూహకర్తగా ఐప్యాక్ కీలక పాత్ర..
ఐప్యాక్ దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా పని చేస్తోంది. గతంలో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా ఐప్యాక్ పని చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని టీఎంసీ పార్టీకి వ్యూహకర్తగా ఐప్యాక్ టీమ్ పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఐప్యాక్‌పై ఈడీ దాడులు జరగడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.
పీఎంఎల్‌ఏ నిధులపై అనుమానాలు..
ఐప్యాక్‌కు పీఎంఎల్‌ఏ పరిధిలోకి వచ్చే నిధులు అందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. కొన్ని లావాదేవీలు, ఫండింగ్ సోర్సులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సమాచారం. అయితే, ఇప్పటివరకు ఈడీ అధికారులు అధికారికంగా ఎలాంటి తుది ప్రకటన చేయలేదు. దర్యాప్తు కొనసాగుతోందని మాత్రమే పేర్కొన్నారు.
జగన్ చెల్లింపుల అంశం.. బయటపడే అవకాశం?
ఈడీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. గతంలో వైసీపీకి పనిచేసిన సందర్భంలో ఐప్యాక్‌కు జరిగిన చెల్లింపులపైనా విచారణ జరగవచ్చని ప్రచారం జరుగుతోంది. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన కొన్ని చెల్లింపులు బయటపడే అవకాశం ఉందని ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఇది పూర్తిగా దర్యాప్తు దశలో ఉన్న అంశమేనని, ఇప్పటివరకు ఎలాంటి నిర్ధారణ జరగలేదని అధికారులు చెబుతున్నారు.
అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ తర్వాతే..
ఈ ఘటనకు మరో రాజకీయ కోణం కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నిన్న(బుధవారం) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ సమావేశం జరిగిన మరుసటి రోజే ఇవాళ(గురువారం) ఐప్యాక్‌పై ఈడీ దాడులు జరగడం రాజకీయ వర్గాల్లో అనుమానాలకు దారితీసింది. ఈ విషయంపై అధికారికంగా ఎవరూ స్పందించకపోయినా, ఈ పరిణామం రాజకీయ చర్చకు కారణమైంది.
కోల్‌కత్తాలో ఈడీ దాడుల వివరాలు...
కోల్‌కత్తాలోని ఐప్యాక్ కార్యాలయంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. కీలక పత్రాలు, డిజిటల్ డేటా, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలించినట్లు సమాచారం. కొన్ని కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ దాడుల నేపథ్యంలో ఐప్యాక్ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది.
టీఎంసీ ఎన్నికల వ్యూహాలపై ప్రభావమా?
ప్రస్తుతం టీఎంసీ పార్టీకి ఐప్యాక్ వ్యూహకర్తగా పనిచేస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ వ్యూహాలు రూపొందిస్తోంది. ఈడీ దాడుల ప్రభావం టీఎంసీ ఎన్నికల ప్రణాళికలపై పడే అవకాశాలు ఉన్నాయి.
రాజకీయ వర్గాల్లో భిన్న అభిప్రాయాలు
ఈడీ దాడులపై రాజకీయ పార్టీల నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి. కొందరు ఇది సాధారణ చట్టపరమైన ప్రక్రియ అని అంటున్నారు. మరికొందరు మాత్రం రాజకీయ ఒత్తిడిలో భాగంగానే ఈడీ దాడులు జరుగుతున్నాయంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే, ఈడీ అధికారులు మాత్రం చట్టప్రకారమే ఈ సోదాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.
ఈడీ తదుపరి చర్యలిలా..!
ఐప్యాక్‌కు సంబంధించిన బ్యాంక్ లావాదేవీలు, అకౌంట్లు, ఫండింగ్ సోర్సులపై మరింత సమగ్ర దర్యాప్తు కొనసాగనుంది. అవసరమైతే సంబంధిత వ్యక్తులను విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. దర్యాప్తు పూర్తయ్యాకే పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఐప్యాక్‌పై ఈడీ దాడులు దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామంగా మారాయి. ఈడీ దర్యాప్తులో నిజాలు ఏమిటన్నది పూర్తిగా బయటపడేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. ప్రసుత్తం ఈ అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి...
సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు వ్యాపించి..
విద్యార్థులకు అలర్ట్.. సంక్రాంతి సెలవులపై క్లారిటీ..
Read Latest Telangana News And Telugu News