Punjab vs Mumbai: ఉత్కంఠ పోరులో పంజాబ్ సంచలన విజయం..
ABN , Publish Date - Jan 08 , 2026 | 05:37 PM
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో పంజాబ్ సంచలన విజయం సాధించింది. ముంబై జట్టుపై ఒక్క పరుగు తేడాతో గెలిచింది. ఈ విజయంతో పంజాబ్ గ్రూప్ సి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
ఇంటర్నెట్ డెస్క్: విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy 2025-26)లో పంజాబ్ సంచలన విజయం సాధించింది. ముంబై జట్టుపై ఒక్క పరుగు తేడాతో పంజాబ్ గెలిచింది. ఇవాళ(గురువారం) జైపూర్ వేదికగా పంజాబ్, ముంబై మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 45.1 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ లో విఫమయ్యాడు. కేవలం 8 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. రమణ్ దీప్ సింగ్(72), అన్మోల్‌ప్రీత్ సింగ్(57) రాణించడంతో పంజాబ్ జట్టు ఆ పరుగులైన చేయగలింది. ఇక ముంబై బౌలర్లలో ముషీర్ ఖాన్ 3, ఓంకార్ తుకారం 2, శివం దూబే 2, శశాంక్ 2, సాయి రాజ్ పాటిల్ ఒక వికెట్ తీసుకున్నారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టు ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఒక దశలో 17.2 ఓవర్లకు 169/3 స్కోరుతో పటిష్ఠ స్థితిలో నిలిచింది. దీంతో ముంబై(Mumbai) సునాయసంగా విజయం సాధిస్తుందని అంతా భావించారు. తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి 26.2 ఓవర్లలోనే 215 పరుగులకు ఆలౌటైంది. ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ (20 బంతుల్లో 62 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ వృథా అయ్యింది. అభిషేక్ శర్మ వేసిన ఓవర్‌లో సర్ఫరాజ్ వరుసగా 6, 4, 6, 4, 6, 4 కొట్టాడు. కేవలం15 బంతుల్లోనే అర్ధ శతకం అందుకున్నాడు. టోర్నీ చరిత్రలో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కావడం గమన్హారం.
అలానే ముంబై కెప్టెన్ శ్రేయస్ (45) రాణించాడు. సూర్యకుమార్ యాదవ్ (15), శివమ్ దూబె (12), హార్దిక్ తమోర్ (15) క్రీజులో ఎక్కువసేపు నిలవకపోవడంతో ముంబై ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్ లో పంజాబ్(Punjab) ఎనిమిది మంది బౌలర్లను ఉపయోగించడం గమనార్హం. స్పిన్నర్ మయాంక్ మార్కండే, పేసర్ గూర్నూర్ బ్రార్ చెరో నాలుగు వికెట్లు తీశారు. ఈ విజయంతో పంజాబ్ గ్రూప్-సి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటికే ముంబై, పంజాబ్ నాకౌట్ దశకు అర్హత సాధించాయి.
ఇవి కూడా చదవండి..
టీ20 ప్రపంచ కప్‌నకు ముందు టీమిండియాకు షాక్.. తిలక్ వర్మకు సర్జరీ..
Hardik Pandya: హార్దిక్ పాండ్య సిక్సర్ల వర్షం .. భారీ స్కోరు చేసిన బరోడా..