Ankush Bhardwaj: యువతిపై లైంగిక దాడి ఆరోపణలు.. జాతీయ కోచ్ అంకుశ్‌పై సస్పెన్షన్ వేటు
ABN , Publish Date - Jan 08 , 2026 | 04:30 PM
జాతీయ స్థాయి షూటింగ్ క్రీడలో తీవ్ర కలకలం రేగింది. 17 ఏళ్ల జాతీయ స్థాయి ఉమెన్ షూటర్‌పై లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో జాతీయ షూటింగ్ కోచ్ అంకుశ్ భరద్వాజ్‌పై వేటు పడింది. ఆయనపై హర్యానా పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: కామన్వెల్త్ యూత్ గేమ్స్ బంగారు పతక విజేత, జాతీయ షూటింగ్ కోచ్ అంకుశ్ భరద్వాజ్(Ankush Bhardwaj)పై సస్పెన్షన్ వేటు పడింది. ఫరీదాబాద్ లోని ఓ హోటల్ గదిలో తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు జాతీయ స్థాయి షూటర్ అయిన 17 ఏళ్ల బాలిక ఆరోపించడంతో ఆయనపై ఈ వేటు పడింది. ఈ నేపథ్యంలో అంకుశ్‌పై హర్యానా పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. హోటల్ గదిలో జరిగిన సంఘటనల గురించి సదరు యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
తన ఆటతీరు సమీక్షించాలనే సాకుతో ఫరీదాబాద్‌లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌కు పిలిచి, తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని యువతి ఆరోపించింది. ఈ విషయాన్ని బయటకు చెబితే కెరీర్‌ను నాశనం చేస్తానని కోచ్ బెదిరించాడని తెలిపింది. హోటల్ నుంచి బయటకు వెళ్లిన బాధితురాలు కుటుంబసభ్యులకు జరిగిన దారుణం గురించి చెప్పగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలోని డాక్టర్ కర్ణిసింగ్ షూటింగ్ రేంజ్‌లో జాతీయస్థాయి షూటింగ్ పోటీల సందర్భంగా షూటర్‌పై ఈ లైంగిక దాడి జరిగింది.
అంకుశ్ భరద్వాజ్‌పై పోక్సో(POCSO case) సహా పలు సెక్షన్ల కింద ఫరీదాబాద్ మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా మైనర్‌పై లైంగిక దాడి ఆరోపణలను ధ్రువీకరించడానికి సంఘటన జరిగిన రోజు హోటల్‌లోని అన్ని సీసీటీవీ కెమెరా ఫుటేజీలను వెంటనే భద్రపరిచి తమకు అందజేయాలని నిర్వాహకులను కోరామని పోలీసులు తెలిపారు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(NRAI) నియమించిన 13మంది జాతీయ షూటింగ్ కోచ్‌ల్లో అంకుశ్ ఒకరు. లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో విచారణ ముగిసేవరకూ అంకుశ్ భరద్వాజ్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఎన్‌ఆర్‌ఏఐ కార్యదర్శి పవన్ కుమార్ తెలిపారు.
జాతీయ షూటింగ్ కోచ్ అంకుశ్‌పై గతంలోనూ నిషేధం
అంకుశ్ భరద్వాజ్(Ankush Bhardwaj) 2008 కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో 50 మీటర్ల పిస్టల్ షూటింగ్ ఈవెంట్‌లో బంగారు పతకం సాధించాడు. రెండేళ్ల తర్వాత బీటా బ్లాకర్స్ కోసం నిర్వహించిన డోపింగ్ పరీక్షలో అతనికి పాజిటివ్ వచ్చింది. దీంతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అతనిపై నిషేధం విధించింది. తేలికపాటి తలనొప్పికి తాను మెడిసిన్ తీసుకున్నానని, దాని ప్రభావం పరీక్ష ఫలితంపై ఉంటుందని తనకు తెలియదంటూ అప్పట్లో వివరణ ఇచ్చాడు. అతను 2012లో తిరిగి పునరాగమనం చేసి, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించాడు. భరద్వాజ్ ప్రస్తుతం మొహాలీలో నివసిస్తూ.. ఢిల్లీలోని సెక్టార్ 86లో సాల్వో షూటింగ్ రేంజ్‌ను నడుపుతున్నాడు. ఈ షూటింగ్ అకాడమీకి అనేక బ్రాంచ్‌లు ఉన్నాయి. అంకుశ్ అంజుమ్ మౌద్గిల్ అనే అథ్లెట్‌ను వివాహం చేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి..
టీ20 ప్రపంచ కప్‌నకు ముందు టీమిండియాకు షాక్.. తిలక్ వర్మకు సర్జరీ..
Hardik Pandya: హార్దిక్ పాండ్య సిక్సర్ల వర్షం .. భారీ స్కోరు చేసిన బరోడా..