Share News

Womens Premier League Season Begins: విశ్వకప్‌కు సన్నాహకంగా..

ABN , Publish Date - Jan 09 , 2026 | 03:53 AM

ఐదు జట్లు పోటీపడనున్న మహిళల ప్రీమియర్‌ లీగ్‌ ఫిబ్రవరి 5 వరకు జరుగుతుంది. స్థానిక డీవై పాటిల్‌ స్టేడియంలో జరిగే నేటి ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తలపడనుంది.

Womens Premier League Season Begins: విశ్వకప్‌కు సన్నాహకంగా..

  • నేటి నుంచి మహిళల ప్రీమియర్‌ లీగ్‌

  • తొలిసారి వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన ఉత్సాహం ఇంకా తాజాగానే ఉండగా, భారత మహిళా క్రికెటర్లు మరో ఆసక్తికర పోరుకు సై అంటున్నారు. అంచనాలకు మించిన ఆదరణతో దూసుకెళుతున్న మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) నాలుగో సీజన్‌కు శుక్రవారం తెర లేవనుంది.

నవీ ముంబై: ఐదు జట్లు పోటీపడనున్న మహిళల ప్రీమియర్‌ లీగ్‌ ఫిబ్రవరి 5 వరకు జరుగుతుంది. స్థానిక డీవై పాటిల్‌ స్టేడియంలో జరిగే నేటి ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తలపడనుంది. 2024లో ఆర్‌సీబీ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. దేశవాళీ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసేందుకు ఆరంభించిన ఈ లీగ్‌ ఇప్పటికే సత్ఫలితాలనిస్తోంది. దీనిద్వారా జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న షఫాలీ, రిచా, శ్రేయాంక, శ్రీచరణి, క్రాంతి, సైకా తదితరులు కీలక ప్లేయర్లుగా కొనసాగుతున్నారు. అందుకే మరింత మంది యువ ప్లేయర్లు తమ సత్తా నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి తోడు పొట్టి ఫార్మాట్‌లో జరిగే డబ్ల్యూపీఎల్‌ ద్వారా భారత్‌తో పాటు ప్రపంచ క్రికెటర్లకు కూడా జూన్‌-జూలైలో జరిగే టీ20 వరల్డ్‌క్‌పనకు చక్కటి ప్రాక్టీస్‌ లభించనుంది. తాజా సీజన్‌ కోసం గతేడాది నవంబరులో జరిగిన మెగా వేలం ద్వారా ఆయా జట్లు కొత్త ప్లేయర్లతో బరిలోకి దిగబోతున్నాయి. ఈనేపథ్యంలో ఢిల్లీని గత మూడు పర్యాయాలు ఫైనల్‌కు చేర్చిన కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ ఇప్పుడు యూపీ వారియర్స్‌ను నడిపించబోతోంది. జెమీమా ఢిల్లీ కొత్త కెప్టెన్‌ అయ్యింది. అయితే ఎలిస్‌ పెర్రీ (ఆర్‌సీబీ), అన్నాబెల్‌ సదర్లాండ్‌ (డీసీ) వ్యక్తిగత కారణాలతో డబ్ల్యూపీఎల్‌కు దూరం కావడం ఆయా జట్లకు గట్టి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు.


రెండు దశలు...రెండే వేదికలు

గతేడాది మ్యాచ్‌లను నాలుగు నగరాల్లో నిర్వహించగా.. ఈసారి మాత్రం తొలి రెండు సీజన్ల మాదిరే రెండే వేదికలకు పరిమితం చేశారు. దీంతో రెండు దశల్లో జరిగే ఈ లీగ్‌కు మొదట నవీ ముంబై ఆతిథ్యమివ్వనుంది. ఇక్కడి డీవై పాటిల్‌ స్టేడియంలో జనవరి 17 వరకు 11 మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్‌లో ఏకైక డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు (జనవరి 10న) ఇక్కడే నిర్వహిస్తారు. ఆ తర్వాత వేదిక వడోదరకు మారనుంది. ఇక్కడ 19 నుంచి వచ్చే నెల 5 వరకు ఎలిమినేటర్‌, ఫైనల్‌ సహా మరో 11 మ్యాచ్‌లతో లీగ్‌ ముగియనుంది.

సమవుజ్జీల పోరుతో..

డబ్ల్యూపీఎల్‌ ఆరంభ పోరే అభిమానులను ఉర్రూతలూగించనుంది. భారత మహిళా జట్టు ప్రధాన క్రికెటర్లయిన హర్మన్‌ప్రీత్‌ ఆధ్వర్యంలోని ముంబై ఇండియన్స్‌, స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన నేతృత్వంలోని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు బోణీ కోసం ఆరాటపడుతున్నాయి. తమ కోర్‌ గ్రూప్‌ను అట్టిపెట్టుకున్న ముంబై టైటిల్‌ను నిలబెట్టుకోవాలనుకుంటోంది. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ సివర్‌ బ్రంట్‌, విండీస్‌ కెప్టెన్‌ హేలీ మాథ్యూస్‌ కూడా ఇదే జట్టులో ఉన్నారు. వీరికి తోడు అమెలియా కెర్‌, ఇల్లింగ్‌వర్త్‌, అమన్‌జోత్‌, కమలినితో పాటు బౌలింగ్‌లో షబ్నిం, సైకా ఇషాక్‌ కీలకం కానున్నారు. మరోవైపు ఆర్‌సీబీ కేవలం మూడు మ్యాచ్‌ల్లోనే నెగ్గి నిరాశపరిచింది. తాజాగా ఎలిస్‌ పెర్రీ దూరం కావడంతో లీగ్‌ ఆరంభానికి ముందే ఝలక్‌ తగిలింది. అయినా బ్యాటింగ్‌ ప్రధాన బలంగా సవాల్‌ విసరాలనుకుంటోంది. మంధానకు జతగా జార్జియా వాల్‌, ఆల్‌రౌండర్లు గ్రేస్‌ హ్యారిస్‌, నాడిన్‌ డి క్లర్క్‌తో పాటు రిచా ఘోష్‌ హిట్టింగ్‌ ప్రత్యర్థి జట్లకు వణుకుపుట్టించేదే. అరుంధతి రెడ్డి, పూజా వస్త్రాకర్‌, లారెన్‌ బెల్‌ ప్రధాన పేసర్లు. దీనికి తోడు రాధా యాదవ్‌, శ్రేయాంక, లిన్సే స్మిత్‌లతో కూడిన స్పిన్‌ విభాగం అదనపు బలం కానుంది.

Updated Date - Jan 09 , 2026 | 03:53 AM