Nadeen de Klerk: డిక్లెర్క్ ధమాకా
ABN , Publish Date - Jan 10 , 2026 | 04:20 AM
మహిళల ప్రీమియర్ లీగ్ డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్‌కు అదిరే ఆరంభం. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, మాజీ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపింది.
ఆఖరి బంతికి ఆర్‌సీబీ విజయం
ముంబై ఇండియన్స్‌కు నిరాశ
నవీ ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాలుగో సీజన్‌కు అదిరే ఆరంభం. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, మాజీ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపింది. ఆరు బంతుల్లో 18 పరుగులు కావాల్సిన వేళ ఆల్‌రౌండర్ నాడిన్ డి క్లెర్క్ (44 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 63 నాటౌట్) బౌండరీలతో విరుచుకుపడి ముంబైకి గట్టి షాక్ ఇచ్చింది. తద్వారా మూడు వికెట్లతో గెలిచిన ఆర్‌సీబీ ఘనంగా బోణీ చేసింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. సంజన (25 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 45), కేరీ (29 బంతుల్లో 4 ఫోర్లతో 40), కమలిని (28 బంతుల్లో 5 ఫోర్లతో 32) రాణించారు. డి క్లెర్క్‌కు 4 వికెట్లు లభించాయి. ఛేదనలో ఆర్‌సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసి గెలిచింది. హ్యారిస్ (25), అరుంధతి (20) సహకరించారు. కెర్, కేరీలకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా డి క్లెర్క్ నిలిచింది.
చివర్లో చెలరేగి..: ఓ మాదిరి ఛేదనలో ఆర్‌సీబీ ఓపెనర్లు హ్యారిస్, మంధాన (18) ఎడాపెడా షాట్లతో విరుచుకుపడ్డారు. మూడో ఓవర్‌లో హ్యారిస్ 6,4 మంధాన 4,4లతో ఏకంగా 20 పరుగులు సమకూరాయి. తొలి మూడు ఓవర్లలోనే స్కోరు 40కి చేర్చిన వీరు ముంబైలో గుబులు రేపారు. కానీ ఆ వెంటనే వరుస విరామాల్లో ఈ ఇద్దరితో పాటు హేమలత (7), రాధా యాదవ్ (1), హిట్టర్ రిచా (6) వరుసగా పెవిలియన్‌కు చేరడంతో ఆర్‌సీబీ 65/5 స్కోరుతో ఇబ్బందుల్లో పడింది. ఈ స్థితిలో డి క్లెర్క్-అరుంధతి ఎదురుదాడికి దిగి జట్టును కాపాడే ప్రయత్నం చేశారు. ఆరో వికెట్‌కు 52 పరుగులు జోడించాక అరుంధతి వికెట్ కోల్పోవడంతో ఉత్కంఠ పెరిగింది. ఇక 19వ ఓవర్‌లో డి క్లెర్క్ ఇచ్చిన 2క్యాచ్‌లతో పాటు తన రనౌట్‌ను ముంబై మిస్ చేసుకోవడం నష్టపరిచింది. ఆఖరి ఓవర్‌లో 18 రన్స్ కావాల్సిన వేళ డి క్లెర్క్ 6,4,6,4తో చెలరేగి జట్టుకు అపూర్వ విజయాన్నందించింది.
ఆదుకున్న సజన-కేరీ: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై తొలి 11 ఓవర్లలో చేసింది 67 పరుగులే కాగా నాలుగు వికెట్లను కోల్పోవడం గమనార్హం. అయితే మిడిలార్డర్‌లో సజన-నికోలా కేరీ దూకుడుతో ముంబై కోలుకుంది. దీనికి తోడు బెంగళూరు ఫీల్డింగ్ వైఫల్యం కూడా వీరికి కలిసి రావడంతో స్కోరు 150 దాటింది. మొదట పేసర్ లారెన్ బెల్ తొలి ఓవర్‌నే మెయిడిన్‌తో ఆకట్టుకుంది. ఓపెనర్ అమెలియా కెర్ (4) విఫలం కాగా మరో ఓపెనర్ కమలిని ధాటిని ప్రదర్శించింది. అయితే చక్కగా కుదురుకున్న తను స్పిన్నర్ శ్రేయాంక ఓవర్‌లో బౌల్డయ్యింది. ఇక మధ్య ఓవర్లలో డి క్లెర్క్ రాణిస్తూ సివర్ బ్రంట్ (4), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (20) వికెట్లను తీసింది. ఈ దశలో బేలగా కనిపించిన ముంబై జట్టును సజన-కేరీ ఆదుకుని ఐదో వికెట్‌కు 82 పరుగులు జోడించడం విశేషం. సజన 2, 4 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇచ్చిన సులువైన క్యాచ్‌లను బెంగళూరు వదిలేసింది. 15వ ఓవర్‌లో సజన 6,4తో 15 పరుగులు రాబట్టగా.. డిక్లెర్క్ ఓవర్‌లో మరో మూడు ఫోర్లతో జోరు చూపింది. అటు కేరీ కూడా చక్కగా సహకరించింది. చివరి ఓవర్‌లో డిక్లెర్క్ ఐదు పరుగులే ఇచ్చి ఈ ఇద్దరినీ పెవిలియన్‌కు చేర్చినప్పటికీ ముంబై అప్పటికే సవాల్ విసిరే స్కోరందుకుంది.