Bangladesh Cricket: బంగ్లాదేశ్ క్రికెటర్లకు భారీ ఎదురుదెబ్బ.. ఆర్థికంగా కుదేలు కానున్నారా..?
ABN , Publish Date - Jan 09 , 2026 | 03:51 PM
భారత్, బంగ్లాదేశ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బంగ్లా క్రికెటర్లకు భారీ ఎదురు దెబ్బ తగలనున్నట్లు సమాచారం. అక్కడి టాప్ ప్లేయర్లకు స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న ప్రముఖ కంపెనీ 'ఎస్‌జీ' కీలక నిర్ణయం తీసుకుందని టాక్.
స్పోర్ట్స్ డెస్క్: కొన్ని రోజుల నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు(India Bangladesh Tensions) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బంగ్లాదేశ్ కు వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా ఆ దేశ క్రికెటర్లకు భారీగా ఆర్థిక నష్టం జరగనుందని సమాచారం. బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్, యాసిర్ అలీ, మోమినుల్ హక్ వంటి టాప్ ప్లేయర్లకు భారత సంస్థ ఎస్‌జీ(SG) స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ సంస్థ తమ స్పాన్సర్‌షిప్‌ను కొనసాగించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలానే బంగ్లాదేశ్ తో ఉన్న ఇతర భాగస్వామ్యాలనూ విరమించేందుకు సదరు సంస్థ రెడీ అయ్యిందని ఓ జాతీయ మీడియా సంస్థ పేర్కొంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ పరిణామాలపై బంగ్లా క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ ఎస్‌జీ అలాంటి నిర్ణయం తీసుకుంటే.. ఇతర సంస్థలు సైతం అదే మార్గంలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎస్‌జీ సంస్థ బంగ్లా క్రికెటర్ల స్పాన్సర్ షిప్ ను వెనక్కి తీసుకుంటే.. ఆ జట్టు కొత్త సంస్థ కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. బంగ్లాదేశ్‌లో హిందువులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఇదే సమయంలో బంగ్లా క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ (IPL-2026) మినీ వేలంలో కేకేఆర్ (Kolkata Knight Riders) రూ.9.20 కోట్లకు తీసుకోవడంపై భారత్ లో విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో అతడిని వదిలేయాలని బీసీసీఐ (BCCI).. కోల్‌కతా యాజమాన్యాన్ని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో కేకేఆర్ ఫ్రాంఛైజీ ముస్తాఫిజుర్‌ను విడుదల చేసింది. దీంతో ఈ రెండు ఆసియా దేశాల మధ్య దౌత్యపరమైన గొడవ మొదలైంది. ఈ పేసర్ విడుదలైన తర్వాత, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మొదట ఐపీఎల్‌లో ఆడటానికి ముస్తాఫిజుర్‌కు నిరభ్యంతర పత్రం ఇవ్వడానికి నిరాకరించింది. భద్రతా కారణాలను చూపుతూ, ఫిబ్రవరి 7న ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ 2026లో తమ మ్యాచ్‌లను ఇండియా నుంచి శ్రీలంకకు మార్చాలనీ ఐసీసీని అభ్యర్థించింది. అయితే దీనిపై ఐసీసీ ఇంతవరకూ అధికారికంగా స్పందించలేదు.
ఇవి కూడా చదవండి:
చరిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్
టెస్టులకు 15 రోజుల ప్రిపరేషన్ విండో.. గిల్ నిర్ణయంపై మాజీ క్రికెటర్ల ప్రశంసలు!