Janga Krishnamurthy: టీటీడీ సభ్యత్వానికి జంగా రాజీనామా.. ఆమోదించాలంటూ సీఎంకు లేఖ
ABN , Publish Date - Jan 09 , 2026 | 03:19 PM
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం తన రాజీనామా లేఖను సీఎం చంద్రబాబు నాయుడుకి పంపారు.
అమరావతి, జనవరి 09: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం తన రాజీనామా లేఖను సీఎం చంద్రబాబు నాయుడుకి పంపారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలంటూ ఆ లేఖలో సీఎం చంద్రబాబుకు జంగా కృష్ణమూర్తి విజ్ఞప్తి చేశారు. ఈ పదవికి రాజీనామా చేయడానికి గల కారణాలను ఆ లేఖలో జంగా వివరించినట్లు తెలుస్తోంది.
గతంలో తనకు కేటాయించిన బాలాజీనగర్‌లో ప్లాట్ నెంబర్ 2 నేటికీ ఖాళీగానే ఉందని.. దీనిని తనకు కేటాయించాలంటూ ప్రభుత్వాన్ని కోరారని సమాచారం. దీనిని టీటీడీ బోర్డుకు ప్రభుత్వం పంపడంతో.. ఆమోదముద్ర పడినట్లు తెలుస్తోంది. అయితే గురువారం (09-01-2026)న జరిగిన కేబినెట్ భేటీలో ఈ భూ కేటాయింపును రద్దు చేసినట్లు సమాచారం. దాంతో ఆయన టీటీడీ సభ్యత్వ పదవికి రాజీనామా చేశారనే ప్రచారం సాగుతోంది.
2024 ఎన్నికలకు కొన్ని రోజుల ముందు వైసీపీకి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. అనంతరం ఆయన టీడీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో కూటమికి ఓటరు పట్టం కట్టాడు. దాంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అనంతరం నామినేటెడ్ పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. దాంతో టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడుని నియమించి.. పాలక మండలి సభ్యులుగా పలువురుని నియమించారు. ఆ జాబితాలో జంగా కృష్ణమూర్తికి స్థానం కల్పించారు.
ఇక టీడీపీ చేరక ముందు జంగా కృష్ణమూర్తి వైసీపీలో ఉన్నారు. పల్నాడులోని గురజాలకు చెందిన ఆయనకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎమ్మెల్సీ పదవి కేటాయించారు. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈయనకు టీటీడీ చైర్మన్ పదవి కేటాయిస్తారంటూ ఒక ప్రచారం సాగింది. టీటీడీ చైర్మన్ పదవికి వైవీ సుబ్బారెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఈ పదవి జంగా కృష్ణమూర్తిని వరిస్తుందంటూ ఒక చర్చ జరిగింది. కానీ ఆ పదవిని భూమన కరుణాకర్ రెడ్డికి వైఎస్ జగన్ కేటాయించిన విషయం విదితమే.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీ శ్రేణుల నీచ బుద్ధికి నిదర్శనం.. శ్రీవారి చెంత ఇంతటి పాపమా..
జగన్ శైలి పైన మృదుత్వం.. లోన కర్కశత్వం: మంత్రి ఆనం
For More AP News And Telugu News