Share News

ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణాలు.. అభినందించిన ప్రధాని మోదీ!

ABN , Publish Date - Sep 30 , 2026 | 07:14 PM

ఆసియా క్రీడల్లో షూటర్‌ నీరూ దాండా చరిత్ర సృష్టించింది. ట్రాప్‌ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళగా నిలిచిన ఆమె.. కైనన్‌ చెనైతో కలిసి మిక్స్‌డ్‌ టీమ్‌ ట్రాప్‌లోనూ బంగారు పతకం గెలిచింది. ఈ విజయంపై ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.

ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణాలు.. అభినందించిన ప్రధాని మోదీ!
PM Modi congratulates Neeru Dhandha

ఇంటర్నెట్ డెస్క్: 'అమ్మా.. ప్రధాని నరేంద్ర మోదీ నన్ను స్వయంగా కలుస్తారు. నేను అంత బాగా ఆడతాను'.. అని ఆసియా క్రీడలకు వెళ్లేముందు షూటర్‌ నీరూ దాండా తన తల్లితో చెప్పిన మాటలివి. ఇప్పుడా మాటను నిలబెట్టుకుంది. ఈ ఏడాది ఆసియా క్రీడల్లో అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించింది.

ట్రాప్‌ షూటింగ్‌ వ్యక్తిగత విభాగంలో ఫైనల్లో నీరూ.. 30కి 28 హిట్లు సాధించి పసడి పతకం సాధించింది. తద్వారా ఆసియా క్రీడల్లో ట్రాప్‌ వ్యక్తిగత విభాగంలో గోల్డ్ నెగ్గిన తొలి భారత మహిళగా రికార్డు నెలకొల్పింది. అంతకుముందు మహిళల ట్రాప్‌ టీమ్‌ ఈవెంట్‌లోనూ ఆశిమా అహ్లావత్‌, మనీషా కీర్‌లతో కలిసి ఆమె రజతం సాధించింది. అంతే కాకుండా.. నేడు(బుధవారం) కైనన్‌ చెనైతో కలిసి మిక్స్‌డ్‌ టీమ్‌ ట్రాప్‌లోనూ బంగారు పతకం గెలుపొందింది. ఫైనల్లో 34 పాయింట్లతో ఆసియా క్రీడల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ విభాగంలో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం.


మోదీ స్పందిస్తూ..

నీరూ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. 'ఆసియా గేమ్స్‌లో ట్రాప్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించిన నీరూ దాండా, కైనన్‌ చెనైకు అభినందనలు. ఫైనల్లో భారత జోడీ ఆసియా రికార్డు నెలకొల్పి, ఈ విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించింది. భారత షూటింగ్‌కు ఇది చిరస్మరణీయ విజయం. ఇద్దరు క్రీడాకారులూ అద్భుతంగా రాణించారు. రానున్న రోజుల్లోనూ వారు ఇలాగే వెలుగొందాలని ఆకాంక్షిస్తున్నాను' అని ఎక్స్‌లో పేర్కొన్నారు మోదీ.


కష్టాలను అధిగమించి..

హరియాణాలోని జింద్‌ జిల్లా సంగత్‌పురాకు చెందిన నీరూ దాండా.. షూటింగ్‌లో అడుగుపెట్టేందుకు తన బంధువు, షూటర్‌ లక్ష్య షెరోన్‌ ప్రేరణగా నిలిచాడు. తొలుత అతడి తుపాకీతోనే ప్రాక్టీస్ చేసిన ఆమె.. 2019లో భోపాల్‌లోని మధ్యప్రదేశ్‌ షూటింగ్‌ అకాడమీలో చేరి మరింత ముమ్మరంగా సాధన చేయడం ప్రారంభించింది. ఆసియా క్రీడలకు ముందు తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమె.. 5 రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండింది. ఆ సమయంలో ద్రవ ఆహార పదార్థాలకే పరిమితమై కొన్ని వారాలపాటు శిక్షణకు దూరమైంది. అయినప్పటికీ పట్టుదలతో కోలుకుని ఆసియా క్రీడలకు వెళ్లింది. తన అద్భుత ప్రతిభతో రెండు స్వర్ణాలతో మెరిసింది.


అంతకుముందు ఈ ఏడాది జులైలో ఇటలీలో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌లో అదరగొట్టింది నీరూ. వ్యక్తిగత ట్రాప్‌ విభాగంలో పసిడి పతకం సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. ఇక.. ఈ సీజన్ ఆసియా క్రీడల్లో తన కుమార్తె స్వర్ణం సాధించిన విషయం నీరూ తల్లి సుదేశ్‌దేవికి వెంటనే తెలియలేదట. ఇంట్లో టీవీ, స్మార్ట్‌ఫోన్‌ లేకపోవడంతో.. రేషన్ సరకుల కోసం బయటకు వెళ్తుండగా ఓ పాత్రికేయుడు ఫోన్‌ చేసి ఈ శుభవార్త చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సమాచారం తెలియగానే ఆమె చాలా ఆనందించారని సమాచారం.


ఇవీ చదవండి:

ఆసియా క్రీడల్లో సునీల్ కుమార్ రికార్డ్.. వరుసగా రెండు పతకాలతో..

ఆసియా క్రీడలు: ఒకే రోజు నాలుగు స్వర్ణాలు.. ఆర్చరీలో హ్యాట్రిక్

Updated Date - Sep 30 , 2026 | 07:17 PM