Share News

ఆసియా క్రీడల్లో సునీల్ కుమార్ రికార్డ్.. వరుసగా రెండు పతకాలతో..

ABN , Publish Date - Sep 30 , 2026 | 05:47 PM

ఆసియా క్రీడల్లో సునీల్ కుమార్ మరోసారి కాంస్య పతకం సాధించాడు. పురుషుల 87 కేజీల విభాగంలో 9-0తో గెలిచి, ఆసియా క్రీడల్లో రెండు గ్రీకో-రోమన్ పతకాలు సాధించిన తొలి భారత రెజ్లర్‌గా చరిత్ర సృష్టించాడు.

ఆసియా క్రీడల్లో సునీల్ కుమార్ రికార్డ్.. వరుసగా రెండు పతకాలతో..
Wrestler Sunil Kumar

ఇంటర్నెట్ డెస్క్: భారత రెజ్లర్‌ సునీల్‌ కుమార్‌ ఆసియా క్రీడల్లో మరోసారి మెరిశాడు. పురుషుల 87 కేజీల విభాగంలో ఫిలిప్పీన్స్‌కు చెందిన కాలమ్‌ రాబర్ట్స్‌ను 9-0తో చిత్తుగా ఓడించి కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో ఆసియా క్రీడల్లో 2 గ్రీకో-రోమన్‌ పతకాలు సాధించిన తొలి భారత రెజ్లర్‌గా చరిత్ర సృష్టించాడు. మరోవైపు.. సునీల్ కంచు మోతతో భారత్‌ పతకాల సంఖ్య 60కి చేరింది.


ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించాడు సునీల్. ప్రత్యర్థిని రెండుసార్లు తిప్పికొట్టి 4 పాయింట్లు సాధించాడు. ప్రత్యర్థి పాసివిటీ కారణంగా మరో పాయింట్‌ రావడంతో.. కేవలం 90 సెకన్లలోనే 5-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఆ తర్వాతా అదే దూకుడును కొనసాగిస్తూ కీలకమైన త్రోలను విజయవంతంగా పూర్తి చేశాడు. చివరకు 9-0తో ఆధిక్యంతో మ్యాచ్‌ను ముగించాడు.


అంతకుముందు సునీల్‌ తొలి రౌండ్లో తజికిస్థాన్‌కు చెందిన మహమ్మద్‌ సుల్తాన్‌జోదాపై ఆధిక్యంతో విజయం సాధించాడు. సెమీఫైనల్లో జపాన్‌ రెజ్లర్‌ టైజో యోషిడా చేతిలో ఓడాడు. ఆ తర్వాత జరిగిన కాంస్య పతక పోరులో అద్భుతంగా పుంజుకుని భారత్ ఖాతాలో మరో పతకాన్ని చేర్చాడు.


గతంలో హాంగ్‌జౌ(చైనా) ఆసియా క్రీడల్లోనూ కాంస్యం మెరిసన సునీల్‌.. వరుసగా రెండోసారి ఆసియా క్రీడల్లో పతకం సాధించిన తొలి భారత గ్రీకో-రోమన్‌ రెజ్లర్‌గా రికార్డు నెలకొల్పాడు. గ్రీకో-రోమన్‌ రెజ్లింగ్‌లో నడుం కింది భాగంలో పట్టు పట్టడం పూర్తిగా నిషేధం. ఫ్రీస్టైల్‌తో పోలిస్తే ఈ విభాగంలో భారత రెజ్లర్లకు అంతగా విజయాలు దక్కలేదు. కానీ.. ఈ విభాగంలో సునీల్‌ వరుస విజయాలు భారత రెజ్లింగ్‌కు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి.


ఇవీ చదవండి:

ఆసియా క్రీడలు: కాంపౌండ్ ఆర్చరీలో భారత్‌కు మరో స్వర్ణం

టీమిండియాకు కొత్త చీఫ్ సెలెక్టర్.. రేసులో మాజీ స్టార్ స్పిన్నర్!

Updated Date - Sep 30 , 2026 | 05:53 PM