Share News

ఆసియా క్రీడలు: ఒకే రోజు నాలుగు స్వర్ణాలు.. ఆర్చరీలో హ్యాట్రిక్

ABN , Publish Date - Sep 30 , 2026 | 01:20 PM

ఆసియా క్రీడల్లో బుధవారం భారత అథ్లెట్లు చెలరేగిపోతున్నారు. గంటల వ్యవధిలోనే నాలుగు స్వర్ణ పతకాలు సాధించారు. ఆర్చరీలో హ్యాట్రిక్ గోల్డ్ రావడం విశేషం.

ఆసియా క్రీడలు: ఒకే రోజు నాలుగు స్వర్ణాలు.. ఆర్చరీలో హ్యాట్రిక్
India Gold Medals

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడల్లో బుధవారం భారత అథ్లెట్లు చెలరేగిపోతున్నారు. గంటల వ్యవధిలోనే నాలుగు స్వర్ణ పతకాలు సాధించారు. ఆర్చరీలో హ్యాట్రిక్ గోల్డ్ రావడం విశేషం. ఇప్పటికే మహిళల టీమ్ ఈవెంట్‌లో తెలుగమ్మాయిలు జ్యోతి సురేఖ, చికిత, మహారాష్ట్రకు చెందిన ప్రీతిక త్రయం చైనాను ఓడించి స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మిక్స్‌డ్ టీమ్ విభాగంలో చికితా, సాహిల్ జాదవ్ జోడీ దక్షిణ కొరియాతో జరిగిన ఫైనల్‌లో పసిడి దక్కించుకున్నారు.


తాజాగా కాంపౌండ్ పురుషల ఆర్చరీ ఈవెంట్‌లోనూ భారత్‌కు గోల్డ్ మెడల్ వచ్చింది. సాహిల్ జాదవ్, గణేశ్ మణిరత్నం, కుషాల్ త్రయం చైనాపై అద్భుత ప్రదర్శనతో నెగ్గారు. దీంతో ఒకే రోజు ఆర్చరీలో భారత్ మూడు స్వర్ణాలు కైవసం చేసుకుంది.


షూటింగ్‌లో నీరూ రికార్డు..

ఆర్మీ షూటర్ నీరూ దండా రెండోరోజూ తన విజయ ప్రయాణాన్ని కొనసాగించింది. కైనాన్ చెనైతో కలిసి ట్రాప్ మిక్స్‌డ్ షూటింగ్ టీమ్ విభాగంలో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. మంగళవారం జరిగిన పోటీల్లో వ్యక్తిగత ట్రాప్ ఈవెంట్‌లో పసిడి గెలిచిన భారత తొలి మహిళగా నీరూ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. అటు మహిళల ట్రాప్ షూటింగ్ టీమ్ ఈవెంట్‌లోనూ రజత పతకాన్ని దక్కించుకుంది.


ప్రియ ఘంఘాస్‌కు కాంస్యం..

భారత బాక్సర్ ప్రియా ఘంఘాస్ ఆసియా క్రీడల్లో కాంస్యంతో సరిపెట్టుకుంది. 60 కేజీల విభాగంలో పోటీ పడిన ఆమె.. చైనా బాక్సర్ యాంగ్ చేతిలో ఓడి, సెమీ ఫైనల్‌తో తన ప్రయాణాన్ని ముగించాల్సి వచ్చింది. ఇక మహిళల బాక్సింగ్ 75 కేజీల విభాగంలో భారత్‌కు కనీసం రజతం ఖాయమైంది. ఒలింపిక్ కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. అక్కడ చైనాపై ఫైనల్‌లో స్వర్ణం కోసం పోటీ పడనుంది. కాగా భారత్ ఖాతాలో ఇప్పటి వరకు 58 పతకాలు వచ్చి చేరాయి. అందులో 10 స్వర్ణాలు, 21 రజతాలు, 27 కాంస్యాలు ఉన్నాయి.


ఇవి కూడా చదవండి:

ఆసియా క్రీడలు: కాంపౌండ్ ఆర్చరీలో భారత్‌కు మరో స్వర్ణం

టీమిండియాకు కొత్త చీఫ్ సెలెక్టర్.. రేసులో మాజీ స్టార్ స్పిన్నర్!

Updated Date - Sep 30 , 2026 | 01:20 PM