Share News

టీమిండియాకు కొత్త చీఫ్ సెలెక్టర్.. రేసులో మాజీ స్టార్ స్పిన్నర్!

ABN , Publish Date - Sep 30 , 2026 | 09:25 AM

టీమిండియా కొత్త చీఫ్ సెలెక్టర్ పదవిపై ఉత్కంఠ కొనసాగుతోంది. భారత మాజీ స్టార్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ఈ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

టీమిండియాకు కొత్త చీఫ్ సెలెక్టర్.. రేసులో మాజీ స్టార్ స్పిన్నర్!
Pragyan Ojha

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా కొత్త చీఫ్ సెలెక్టర్ పదవిపై ఉత్కంఠ కొనసాగుతోంది. భారత మాజీ స్టార్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ఈ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు చీఫ్‌ సెలెక్టర్‌గా ఉన్న‌ అజిత్‌ అగార్కర్‌ తప్పుకోవడంతో.. ప్రస్తుతం తాత్కాలికంగా సెలక్షన్‌ కమిటీకి ఓజానే నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయనే పూర్తిస్థాయి చీఫ్‌ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. గువాహటిలో భారత కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌తో జరిగిన కీలక సమావేశంలోనూ ఓజా పాల్గొనడంతో ఈ వార్తలకు బలం చేకూరింది.


వెస్టిండీస్‌తో రెండో వన్డేకు ముందు గువాహటిలోని బర్సాపరా స్టేడియంలో ఈ సమావేశం జరిగింది. వెస్టిండీస్‌ ఆటగాళ్లు ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో.. భారత జట్టు విశ్రాంతి తీసుకుంటోంది. సాధారణంగా ద్వైపాక్షిక సిరీస్‌ జరుగుతున్న సమయంలో సెలక్షన్‌ కమిటీ మొత్తం ఇలా సమావేశం కావడం అరుదే. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. భారత్‌ తదుపరి న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఈ పర్యటనకు సంబంధించిన జట్ల ఎంపిక, ఆటగాళ్లపై చర్చించేందుకే గంభీర్‌తో సెలెక్టర్లు సమావేశమైనట్లు తెలుస్తోంది.


ఎవరీ ప్రజ్ఞాన్‌ ఓజా?

భారత్‌ తరఫున 24 టెస్టులు ఆడిన ఎడమచేతి వాటం స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా.. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత బీసీసీఐ సెలక్షన్‌ కమిటీలో చోటు దక్కించుకున్నాడు. అగార్కర్‌ వైదొలగడంతో తాత్కాలికంగా చీఫ్‌ సెలెక్టర్‌ బాధ్యతలు చేపట్టాడు. ఇప్పుడు పూర్తిస్థాయి చీఫ్‌ సెలెక్టర్‌గా అతడినే కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే రాబోయే రోజుల్లో సెలెక్టర్లకు పని భారం భారీగా ఉండనుంది. అక్టోబర్‌ 22 నుంచి నవంబర్‌ 27 వరకు న్యూజిలాండ్‌ పర్యటనలో భారత్‌ ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. దీనికితోడు మూడు టెస్టుల న్యూజిలాండ్‌ పర్యటనకు భారత్‌ ‘ఎ’ జట్టును కూడా ఎంపిక చేయాల్సి ఉంది. 2027 వన్డే ప్రపంచకప్‌ సన్నాహకాల్లో భాగంగా జట్టు కాంబినేషన్లు, ఆటగాళ్ల ఫిట్‌నెస్‌, అందుబాటులో ఉండే ఆటగాళ్లపై సెలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది.


ఇవి కూడా చదవండి:

వన్డే ప్రపంచ కప్: జడేజాకు అవకాశం ఇస్తారా? కోచ్ ఏమన్నారంటే..

ఆసియా క్రీడలు: వర్షంతో టోర్నీ నుంచి ఔట్.. మలేసియా క్రికెటర్ ఎమోషనల్ పోస్ట్

Updated Date - Sep 30 , 2026 | 09:26 AM