వన్డే ప్రపంచ కప్: జడేజాకు అవకాశం ఇస్తారా? కోచ్ ఏమన్నారంటే..
ABN , Publish Date - Sep 30 , 2026 | 07:38 AM
టీమిండియా వెటరన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో ఉంటాడా? అని కొంతకాలంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రశ్నకు స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియా ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనున్న ఈ మెగా టోర్నీకి జట్టు కూర్పుపై మేనేజ్‌మెంట్ దృష్టి సారించింది. ఈ క్రమంలో వెటరన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ప్రపంచకప్ ప్రణాళికల్లో ఉంటాడా? అని కొంతకాలంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రశ్నకు స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే స్పందించాడు.
‘జడేజాతో పాటు అక్షర్ పటేల్ కూడా అందుబాటులో ఉన్నాడు. రాబోయే టోర్నీలు, సిరీస్‌ల్లో ఆటగాళ్ల ప్రదర్శనను పరిశీలిస్తాం. ఎవరు జట్టుకు ఎంత ఉపయోగపడతారో అంచనా వేస్తాం. అయితే జడేజా తన బ్యాటింగ్ నైపుణ్యంతో పాటు ఎంతో అనుభవాన్ని తీసుకొస్తాడు. కాబట్టి అతడిని కచ్చితంగా రాబోయే రోజుల్లో పరిశీలిస్తాం. నాకు జడేజా ఎప్పుడూ యుటిలిటీ ప్లేయర్‌గానే కనిపిస్తాడు. బ్యాట్‌తోనూ, బంతితోనూ జట్టుకు సహకరించగలడు. గత ఆరు నెలల్లో బౌలర్‌గా కూడా అతడు చాలా మెరుగయ్యాడు’ అని బహుతులే వెల్లడించాడు. అఫ్గానిస్థాన్‌తో స్వదేశంలో, ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లకు జడేజా దూరంగా ఉన్నాడు. అయితే వెస్టిండీస్‌తో తిరువనంతపురంలో జరిగిన తొలి వన్డేలో మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఆ మ్యాచ్‌లో వికెట్ తీయలేకపోయినా.. 10 ఓవర్లలో 54 పరుగులు ఇచ్చాడు.
బౌలింగ్ కాంబినేషన్‌పై ప్రయోగాలు..
హార్దిక్ పాండ్య గాయపడటం, పలువురు ఆటగాళ్లు ఆసియా క్రీడలకు వెళ్లడంతో వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా పలు ప్రయోగాలు చేస్తోంది. తొలి వన్డేలో నమన్ ధీర్ అరంగేట్రం చేశాడు. మహ్మద్ సిరాజ్‌కు విశ్రాంతినివ్వగా.. హార్దిక్‌కు బ్యాకప్ సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దుతున్న నితీశ్ కుమార్ రెడ్డి కొత్త బంతిని అందుకున్నాడు. ప్రపంచకప్‌కు ముందు వివిధ బౌలింగ్ కాంబినేషన్లను పరీక్షించడమే ఈ ప్రయోగాల ఉద్దేశమని బహుతులే తెలిపాడు.
‘వివిధ దశల్లో బౌలింగ్ చేయగల ఆటగాళ్లను పరీక్షించేందుకు ఈ సిరీస్‌లు మంచి అవకాశం. నితీశ్ కొత్త బంతితో బౌలింగ్ చేయడం కూడా అందులో భాగమే. అతడు మంచి బౌలర్ మాత్రమే కాదు.. బ్యాటింగ్ కూడా చేయగలడు. ఇలాంటి మార్పులు చేసి ఎవరు ఏ స్థానానికి సరిపోతారో అర్థం చేసుకుంటున్నాం. మా జట్టులో అనుభవం ఉంది. యువ ఆటగాళ్లు కూడా వస్తున్నారు. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న చాలా మందికి ఛాన్స్‌లు ఇస్తున్నాం. ముందుకు వెళ్లేకొద్దీ దక్షిణాఫ్రికా పరిస్థితులకు సరిపోయే కాంబినేషన్‌ను రూపొందించడంపైనే దృష్టి ఉంటుంది’ అని తెలిపాడు.
ఇవి కూడా చదవండి: