రైతు బిడ్డ.. పసిడి పంట
ABN , Publish Date - Sep 30 , 2026 | 02:03 AM
ఈ ఆసియాడ్‌లో పోటీలు ముగింపుకొస్తున్నా, షూటింగ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం దక్కలేదే అన్న బాధ.. ఈ పరిస్థితుల్లో ‘పసిడి’ చూపులకు తెరదించుతూ నీరూ ధాండా గన్‌తో గర్జించింది.
(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)
ఈ ఆసియాడ్‌లో పోటీలు ముగింపుకొస్తున్నా, షూటింగ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం దక్కలేదే అన్న బాధ.. ఈ పరిస్థితుల్లో ‘పసిడి’ చూపులకు తెరదించుతూ నీరూ ధాండా గన్‌తో గర్జించింది. ట్రాప్ విభాగంలో చాంపియన్‌గా నిలిచి ఈసారి క్రీడల్లో బంగారం తెచ్చిన భారత షూటర్‌గా రికార్డుకెక్కింది. అయితే, ఈ అద్భుత విజయం వెనుక ఆమె అసాధారణ కృషి ఉంది. హరియాణాలోని జింధ్ ప్రాంతానికి చెందిన ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన నీరూ.. తన మేనమామ కొడుకు లక్ష్యయ్ షెరోన్ 2018 ఆసియా క్రీడల్లో రజత పతకం నెగ్గడాన్ని చూసి స్ఫూర్తి పొందింది.
లక్ష్యయ్ ప్రోత్సాహంతో షూటింగ్‌ను కెరీర్‌గా ఎంచుకొన్న నీరూ.. కేవలం ఆరునెలల అనుభవంతో 2019లో భోపాల్‌లోని మధ్యప్రదేశ్ షూటింగ్ అకాడమీలో చేరింది. షెరోన్ తండ్రి దగ్గర గన్‌ను అప్పుగా తీసుకున్న ఆమె.. భోపాల్‌లోని ఓ చెరువు వద్ద ఖాళీ డబ్బాలను ఉంచి ప్రాక్టీస్ చేసేది. 2022 జాతీయ క్రీడల్లో స్వర్ణం నెగ్గిన నీరూ.. ఆ తర్వాత మూడేళ్లకు అంటే నిరుడు కజకిస్థాన్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షి్‌పలో ట్రాప్ ఈవెంట్‌లో వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో పసిడి పతకాలు సాధించి వెలుగులోకొచ్చింది. ఈ ఏడాది షాట్‌గన్ ప్రపంచక్‌పలో వ్యక్తిగత స్వర్ణం నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించింది. ఈ రైతుబిడ్డ.. తాజాగా ఆసియాడ్‌లోనూ అదేస్థాయి ప్రదర్శనతో అలరిస్తూ పసిడి పంట పండించింది.
టెన్నిస్‌లో సుమిత్, దక్షిణేశ్వర్ బోణీ
భారత టెన్నిస్ ఆటగాళ్లు సుమిత్ నగాల్, దక్షిణేశ్వర్ సురేశ్ ఆసియాడ్‌లో శుభారంభం చేశారు. సింగిల్స్ ఆరంభ రౌండ్లో సుమిత్ 6-4, 6-0తో సియోంగ్‌చాన్ హాంగ్ (దక్షిణ కొరియా)పై, రైజింగ్ స్టార్ దక్షిణేశ్వర్ 7-5, 7-6(2)తో గునావన్ రిస్మువంతార (ఇండోనేసియా)పై గెలుపొంది ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లారు.
స్పీడ్ క్లైంబింగ్‌లో క్వార్టర్స్‌కు..
భారత టీనేజర్ జోగా పుర్టి ఆసియా క్రీడల మహిళల స్పీడ్ క్లైంబింగ్ ఈవెంట్‌లో క్వార్టర్‌ఫైనల్ చేరింది. 19 ఏళ్ల జోగా క్వాలిఫికేషన్ రౌండ్లో 15 మీటర్ల వాల్‌ను 7.28 సెకన్లలో ఎక్కి తొమ్మిదో స్థానంలో నిలిచి నాకౌట్‌కు అర్హత సాధించింది. ఇక, సైక్లింగ్ క్రీడలో భారత క్రీడాకారులు ప్రిలిమినరీ రౌండ్లలోనే ఓటమిపాలై పతక రేసు నుంచి నిష్క్రమించారు. కురాష్ క్రీడలో సోమవా రం పింకీ కాంస్యంతో మెరవగా.. పురుషుల విభాగంలో విపిన్ కుమార్‌కు నిరాశ ఎదురైంది. 66 కిలోల విభాగం ప్రీక్వార్టర్స్‌లో విపిన్ ఓడాడు.
స్క్వాష్ టీమ్‌లో మహిళల హ్యాట్రిక్
ఆసియాడ్ స్క్వాష్ క్రీడలో వ్యక్తిగత విభాగాల్లో పతకాలతో మెరిసిన భారత మహిళలు అనాహత్ సింగ్, జోష్న చినప్ప టీమ్ ఈవెంట్‌లోనూ పతకం దిశగా సాగుతున్నారు. మహిళల టీమ్‌లో అనాహత్, జోష్న, తన్వీ ఖన్నాలతో కూడిన భారత జట్టు హ్యాట్రిక్ విజయాలతో గ్రూప్ టాపర్‌గా నిలిచి క్వార్టర్‌ఫైనల్ చేరింది. మంగళవారం జరిగిన తమ గ్రూప్ సి ఆఖరి మ్యాచ్‌లో భారత్ 3-0తో ఇరాన్‌ను ఓడించింది. అంతకుముందు చైనా, జపాన్‌లపై భారత్ నెగ్గింది. క్వార్టర్స్‌లో సింగపూర్‌తో భారత్ తలపడనుంది.
ఇవి కూడా చదవండి:
నంబర్ల కోసం అయితే ఎక్కువకాలం ఆడలేం.. గిల్‌పై కోహ్లీ కీలక వ్యాఖ్యలు