Share News

అమ్మ మాట మంత్రంలా..

ABN , Publish Date - Sep 29 , 2026 | 05:45 AM

ఓ దశలో తీవ్ర ఒత్తిడికి గురై పతకం సాధిస్తానో లేదోనన్న ఆందోళనలో ఉన్న షూటర్‌ ఇషా సింగ్‌కు తల్లి చేసిన హెచ్చరిక మంత్రంలా పనిచేసింది. అమ్మ మాటలతో సాంత్వన పొందిన ఆమె ఆసియా క్రీడల్లో ఫలితం రాబట్టగలిగింది...

అమ్మ మాట మంత్రంలా..

ఓ దశలో తీవ్ర ఒత్తిడికి గురై పతకం సాధిస్తానో లేదోనన్న ఆందోళనలో ఉన్న షూటర్‌ ఇషా సింగ్‌కు తల్లి చేసిన హెచ్చరిక మంత్రంలా పనిచేసింది. అమ్మ మాటలతో సాంత్వన పొందిన ఆమె ఆసియా క్రీడల్లో ఫలితం రాబట్టగలిగింది. ఆసియాడ్‌లో రజతం గెలిచిన తర్వాత ఇషానే ఈ విషయాన్ని వెల్లడించింది. ఫైనల్స్‌కు ముందురోజు తీవ్ర ఆందోళన, ఒత్తిడితో తనకు నిద్ర పట్టలేదని ఇషా తెలిపింది. గత ఆసియా క్రీడల్లో ఏకంగా నాలుగు పతకాలతో సంచలన ప్రదర్శన చేసిన 21 ఏళ్ల ఇషా.. ఈసారి ఆసియాడ్‌ పోటీలకు కూడా ఎన్నో అంచనాలతో బరిలోకి దిగింది. కానీ, అప్పటికే పోటీపడ్డ మూడు ఈవెంట్లలోనూ ఇషాకు తీవ్ర నిరాశే ఎదురైంది. ఇక, పతకం నెగ్గేందుకు తనకు మిగిలింది సోమవారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌ మాత్రమే. ఈ నేపథ్యంలో ముందురోజు రాత్రి తీవ్ర ఆందోళన, ఒత్తిడికి లోనైన తనకు నిద్ర పట్టలేదని ఇషా తెలిపింది. ‘‘ఇదే విషయమై ఆ రాత్రి అమ్మకు ఫోన్‌ చేసి, ఆందోళనగా ఉందని చెప్పా. దీంతో అమ్మ నన్ను అనునయించింది. ‘ఎందుకు ఒత్తిడికి గురవుతున్నావు? పతకం సాధించే అవకాశం ఎంతమందికి వస్తుంది? ఇప్పుడు ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపో. ప్రశాంత చిత్తంతో ఈవెంట్‌లో పోటీపడు. కచ్చితంగా విజయం సాధిస్తావు’ అని అమ్మ నాలో మానసికంగా ధైర్యాన్ని నింపింది. అమ్మ చెప్పినట్టే ఉల్లాసభరితంగా ఈవెంట్‌ బరిలోకి దిగా. ఫలితాన్ని సాధించా’’ అని ఇషా పేర్కొంది.

ఈ వార్తలు కూడా చదవండి

ఆసియా క్రీడల్లో ఈషా సింగ్‌కు వెండి పతకం.. సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

ఖైరతాబాద్‌ స్థానం ఖాళీ అయినట్లుగా గెజిట్ నోటిఫికేషన్‌..

Updated Date - Sep 29 , 2026 | 05:45 AM