Share News

బంగారు భామలు

ABN , Publish Date - Sep 30 , 2026 | 01:53 AM

బోరున వర్షం.. వణికిస్తున్న చలి.. ప్రతికూల వాతావరణం.. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఆర్మీ అధికారిణి అయిన నీరూ ధాండా గన్‌ గర్జించింది. స్వర్ణం కోసం నిరీక్షిస్తున్న భారత అభిమానుల వదనాల్లో వెలుగులు నింపింది.

బంగారు భామలు
Asian Games India

  • అథ్లెటిక్స్‌లో ఎట్టకేలకు పసిడి

  • మహిళల 4x400 రిలే జట్టుకు గోల్డ్‌

అథ్లెటిక్స్‌లో భారత ‘పసిడి’ ఎదురు చూపులకు తెరపడింది. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్స్‌ ఈవెంట్ల చివరి రోజు మహిళల 4x400 మీటర్ల రిలే జట్టు బంగారు పతకంతో గ్రాండ్‌ ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చింది. ఇక, గర్జిస్తాయనుకొన్న గన్‌లు మూగబోయిన తరుణంలో.. ట్రాప్‌ షూటింగ్‌లో నీరూ ధాండా చారిత్రక స్వర్ణంతో జాతీయ జెండాను రెపరెపలాడించింది. అలాగే టీమ్‌ ఈవెంట్‌లోనూ రజతం సొంతం చేసుకొంది. దీంతో ఆసియాడ్‌ 10వ రోజు భారత్‌ రెండు స్వర్ణాలు సహా 8 పతకాలు సాధించింది. పురుషులు, మిక్స్‌డ్‌ రిలే జట్లు కాంస్యాలు దక్కించుకోగా.. లాంగ్‌ డిస్టెన్స్‌ రన్నర్‌ గుల్వీర్‌ సింగ్‌, విత్యా రామ్‌రాజ్‌ మొత్తంగా మూడేసి పతకాలతో హ్యాట్రిక్‌ కొట్టేశారు. హైజంపర్‌ పూజా సింగ్‌ కాంస్యం పట్టేసింది. ఇక బాక్సింగ్‌ సెమీస్‌లో ఓడిన నరేందర్‌ కంచుతో సరిపెట్టుకొన్నాడు. మొత్తంగా 6 స్వర్ణాలు సహా పతకాల్లో హాఫ్‌ సెంచరీ దాటిన భారత్‌.. 10వ స్థానంలో నిలిచింది.

నగోయ: బోరున వర్షం.. వణికిస్తున్న చలి.. ప్రతికూల వాతావరణం.. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఆర్మీ అధికారిణి అయిన నీరూ ధాండా గన్‌ గర్జించింది. స్వర్ణం కోసం నిరీక్షిస్తున్న భారత అభిమానుల వదనాల్లో వెలుగులు నింపింది. మంగళవారం జరిగిన మహిళల ట్రాప్‌ వ్యక్తిగత ఈవెంట్‌ ఫైనల్లో నీరూ 28 పాయింట్లతో ఆసియా రికార్డును సృష్టిస్తూ పసిడిని కొల్లగొట్టింది. అంతేకాకుండా ఆసియాడ్‌ ట్రాప్‌ ఈవెంట్‌లో స్వర్ణం సాధించిన తొలి భారత షూటర్‌గా రికార్డులకెక్కింది. కాగా, ఈ క్రీడల్లో మొదటి వ్యక్తిగత పసిడిని దక్కించుకొన్నది కూడా నీరూనే కావడం గమనార్హం.


ఇక, టీమ్‌ ఈవెంట్‌లో ఆషిమా అహ్లీవత్‌, నీరూ, మనీషా కీర్‌ల త్రయం మొత్తం 328 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకొంది. చైనా, కువైట్‌లు స్వర్ణ, కాంస్యాలు సాధించాయి. అయితే, కైనన్‌ చెనాయ్‌, భరద్వాజ్‌ శపథ్‌, అహ్వర్‌ రిజ్వీలతో కూడిన భారత పురుషుల ట్రాప్‌ జట్టు ఆరో స్థానంలో నిలిచినిరాశపర్చింది. వ్యక్తిగత విభాగం ఫైనల్లో భరద్వాజ్‌ ఎనిమిదో స్థానంలో అట్టడుగున నిలిచాడు. కైనన్‌, రిజ్వీ క్వాలిఫికేషన్‌ రౌండ్‌లోనే వెనుదిరిగారు.


ఆరు రోజులుగా అథ్లెటిక్స్‌ ఈవెంట్లు జరుగుతున్నా.. ‘పసిడి’ మాత్రం పలకరించలేదు. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్స్‌ ముగింపు దశకు చేరుకొన్న తరుణంలో అమ్మాయిలు అదిరే ప్రదర్శనతో ఆ లోటును భర్తీ చేశారు. మహిళల 4గీ400 మీటర్ల రిలేలో కిరణ్‌ పహల్‌, పూవమ్మ, ప్రాచీ చౌదరి, విత్య రామ్‌రాజ్‌ల జట్టు 3 నిమిషాల 29.69 సెకన్ల టైమింగ్‌తో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం చేజిక్కించుకొంది. అథ్లెటిక్స్‌లో భారత్‌కు ఇదే ఏకైక బంగారు పతకం. బహ్రెయిన్‌, చైనా రజత, కాంస్యాలు దక్కించుకొన్నాయి. 2002 నుంచి 2018 వరకు ఈ ఈవెంట్‌లో స్వర్ణాలతో సత్తాచాటుతున్న భారత్‌.. గత క్రీడల్లో రజతం దక్కించుకొంది. రేస్‌లో మూడో లెగ్‌ వరకు భారత్‌ తృతీయ స్థానంలో ఉంది.


అయితే, చివరగా బ్యాటన్‌ అందుకొన్న విత్య అనూహ్య రీతిలో వేగం పుంజుకొని.. చైనా, బహ్రెయిన్‌ రన్నర్‌లను వెనక్కునెడుతూ గెలుపు గీత దాటింది. విత్యకు ఇది మూడో పతకం కావడం విశేషం. కాగా, గురీందర్‌వీర్‌ సింగ్‌, స్నేహ సత్యనారాయణ, అనిమేష్‌ కుజూర్‌, హరిత భద్రల 4గీ100 మీ. మిక్స్‌డ్‌ రిలే జట్టు 41.06 సెకన్ల టైమింగ్‌తో జాతీయ రికార్డును సృష్టిస్తూ కాంస్యం దక్కించుకొంది. అంతిమంగా ధరమ్‌వీర్‌, మను, జై కుమార్‌, విశాల్‌తో కూడిన పురుషుల 4గీ400 మీ. రిలే బృందం 3:01.61 సెకన్ల టైమింగ్‌తో కంచుమోత మోగించింది. హైజం్‌పలో పూజా సింగ్‌ 1.84 మీ. ఎత్తు దూకి కాంస్యం నెగ్గింది. మరో ఇద్దరు కూడా పూజతో సమంగా నిలిచినా.. కౌంట్‌బ్యాక్‌లో భారత అథ్లెట్‌కు మూడోస్థానం దక్కింది. అథ్లెటిక్స్‌లో భారత్‌ స్వర్ణం, 9 రజతాలు, 14 కాంస్యాలు సాధించింది. గత క్రీడల్లో (హాంగ్‌ఝౌ)లో 29 పతకాలతో (6 స్వర్ణ, 14 రజత, 9 కాంస్య) పోల్చితే తక్కువ పతకాలే గెలిచింది.


గుల్వీర్‌, విత్య హ్యాట్రిక్‌

రన్నర్లు గుల్వీర్‌ సింగ్‌, విత్యా రామ్‌రాజ్‌ ఈ పోటీల అథ్లెటిక్స్‌లో హ్యాట్రిక్‌ పతకాలతో అదరగొట్టారు. 10000 మీ., 1500 మీ. రేస్‌లో రజతాలు సాధించిన గుల్వీర్‌.. 5000 మీ. ఈవెంట్‌లో కాంస్యం నెగ్గాడు.. ఇక విత్య 400 మీ. హర్డిల్స్‌ కాంస్యం, 4x400 రిలేలో స్వర్ణం, 4x400 మిక్స్‌డ్‌ రిలేలో రజతం సాధించింది. ఒకే క్రీడల ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్స్‌లో మూడు, అంతకంటే ఎక్కువ పతకాలు సాధించిన వారిలో లవీ పింటో (1951), పీటీ ఉష (5 మెడల్స్‌-1986), కేఎం బీనామోల్‌ (2002) ఈ ఫీట్‌ సాధించారు.


సెమీస్‌లో ఓడిన నరేందర్‌

బాక్సింగ్‌ పురుషుల 90+ కిలోల విభాగంలో నరేందర్‌ బెర్వాల్‌ కాంస్యంతో సంతృప్తి పడ్డాడు. సెమీ్‌సలో నరేందర్‌ 0-5తో వరల్డ్‌ చాంపియన్‌ ఐబెక్‌ ఓరల్‌బె (కజకిస్థాన్‌) చేతిలో ఓడాడు.


పతకాల పట్టిక

దేశం

స్వర్ణం

రజతం

కాంస్యం

మొత్తం

1 చైనా

143

62

51

256

2 జపాన్‌

45

71

69

185

3 ద.కొరియా

24

27

44

95

4ఉజ్బెకిస్థాన్‌

14

17

14

45

6థాయ్‌లాండ్‌

12

9

12

33

7బహ్రెయిన్

11

5

4

20

8 ఇరాన్‌

10

16

12

38

5 కజకిస్థాన్‌

9

14

25

48

9 ఉ.కొరియా

7

5

7

19

10 భారత్‌

6

21

26

53


ఇవి కూడా చదవండి:

మీరేనా సెలెక్షన్ కమిటీ ఛైర్మన్?.. పార్థివ్‌ను ఆటపట్టించిన ఆకాశ్ చోప్రా

నంబర్ల కోసం అయితే ఎక్కువకాలం ఆడలేం.. గిల్‌పై కోహ్లీ కీలక వ్యాఖ్యలు

Updated Date - Sep 30 , 2026 | 01:56 AM