Share News

ఆసియా క్రీడలు: భారత మహిళల ట్రాప్ షూటింగ్ టీమ్‌కు సిల్వర్

ABN , Publish Date - Sep 29 , 2026 | 10:58 AM

ఆసియా క్రీడలు-2026లో భారత షూటర్లు సత్తా చాటారు. మహిళల ట్రాప్‌ షూటింగ్ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌ రజత పతకం సాధించింది. నీరూ దండా, ఆషిమా అహ్లావత్‌, మనీషా కీర్‌లతో కూడిన భారత బృందం 328 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది.

ఆసియా క్రీడలు: భారత మహిళల ట్రాప్ షూటింగ్ టీమ్‌కు సిల్వర్
Asian Games shooting

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడలు-2026లో భారత షూటర్లు సత్తా చాటారు. మహిళల ట్రాప్‌ షూటింగ్ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌ రజత పతకం సాధించింది. నీరూ దండా, ఆషిమా అహ్లావత్‌, మనీషా కీర్‌లతో కూడిన భారత బృందం 328 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. 346 పాయింట్లతో చైనా స్వర్ణ పతకం దక్కించుకోగా.. 325 పాయింట్లతో కువైట్‌ కాంస్యం గెలుచుకుంది.


భారత్‌ తరఫున నీరూ ధాండా అత్యుత్తమ ప్రదర్శన చేసింది. మొత్తం 125 షాట్లలో 118 పాయింట్లు సాధించింది. వ్యక్తిగత క్వాలిఫికేషన్‌లో ఖతార్‌కు చెందిన రే బాసిల్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. అంతేకాకుండా ఆసియా క్రీడల క్వాలిఫికేషన్‌ రికార్డును కూడా నమోదు చేసింది. మహిళల ట్రాప్‌ వ్యక్తిగత విభాగంలోనూ నీరూ దండా ఫైనల్‌కు అర్హత సాధించింది. ఎనిమిది మంది షూటర్లతో జరిగే ఫైనల్‌లో ఆమె బరిలోకి దిగనుంది. మరోవైపు ఆషిమా అహ్లావత్‌ 106 పాయింట్లతో 16వ స్థానంలో, మనీషా కీర్‌ 104 పాయింట్లతో 23వ స్థానంలో నిలిచారు.


పురుషుల టీమ్‌ ఆరో స్థానం

గత ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన పురుషుల ట్రాప్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌కు ఈసారి నిరాశే ఎదురైంది. శపథ్‌ భరద్వాజ్‌, కైనన్‌ చెనై, అహ్వర్‌ రిజ్వీ కలిసి 339 పాయింట్లు సాధించడంతో భారత్‌ ఆరో స్థానంలో నిలిచింది. 355 పాయింట్లతో కువైట్‌ స్వర్ణం, 349 పాయింట్లతో ఖతార్‌ రజతం, 348 పాయింట్లతో కజకిస్థాన్‌ కాంస్యం సాధించాయి. అయితే వ్యక్తిగత విభాగంలో శపథ్‌ భరద్వాజ్‌ ఫైనల్‌కు చేరాడు. క్వాలిఫికేషన్‌లో ఎనిమిదో స్థానంలో నిలిచిన 24 ఏళ్ల మీరట్‌ షూటర్‌.. చివరి రెండు బెర్తుల కోసం జరిగిన షూటాఫ్‌లో పోటీ పడ్డాడు. అందులో మహ్మద్‌ అల్‌ రుమైహీని వెనక్కి నెట్టి ఎనిమిదో స్థానాన్ని దక్కించుకున్నాడు.


ఇవి కూడా చదవండి:

మీరేనా సెలెక్షన్ కమిటీ ఛైర్మన్?.. పార్థివ్‌ను ఆటపట్టించిన ఆకాశ్ చోప్రా

నంబర్ల కోసం అయితే ఎక్కువకాలం ఆడలేం.. గిల్‌పై కోహ్లీ కీలక వ్యాఖ్యలు

Updated Date - Sep 29 , 2026 | 10:58 AM