Share News

హైవోల్టేజ్ డ్రామా.. ఇలాంటి రనౌట్‌ ఎప్పుడూ చూడలేదు!

ABN , Publish Date - Sep 29 , 2026 | 10:32 AM

క్రికెట్‌లో అప్పుడప్పుడు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇంగ్లండ్‌-శ్రీలంక మధ్య జరిగిన మూడో వన్డేలోనూ అలాంటి ఆసక్తికర ఘటనే జరిగింది. శ్రీలంక బ్యాటర్‌ పవన్‌ రత్నాయకే విషయంలో తొలుత ఔట్‌.. ఆ తర్వాత నాటౌట్‌.. చివరకు మళ్లీ ఔట్‌గా తేల్చారు అంపైర్లు.

హైవోల్టేజ్ డ్రామా.. ఇలాంటి రనౌట్‌ ఎప్పుడూ చూడలేదు!
England vs Sri Lanka

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్‌లో అప్పుడప్పుడు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇంగ్లండ్‌-శ్రీలంక మధ్య జరిగిన మూడో వన్డేలోనూ అలాంటి ఆసక్తికర ఘటనే జరిగింది. శ్రీలంక బ్యాటర్‌ పవన్‌ రత్నాయకే విషయంలో తొలుత ఔట్‌.. ఆ తర్వాత నాటౌట్‌.. చివరకు మళ్లీ ఔట్‌గా తేల్చారు అంపైర్లు. దాదాపు నాలుగు నిమిషాల పాటు సాగిన ఈ వ్యవహారం మ్యాచ్‌లో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. అసలు ఏమైందంటే?


శ్రీలంక ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. లియామ్‌ డాసన్‌ వేసిన బంతిని చరిత్‌ అసలంక షార్ట్‌ థర్డ్‌ దిశగా ఆడాడు. అక్కడ ఫీల్డింగ్‌ చేస్తున్న జోఫ్రా ఆర్చర్‌ వెంటనే బంతిని వికెట్ల వైపు విసిరాడు. ఆ సమయంలో రత్నాయకే క్రీజుకు చాలా దూరంలో ఉన్నాడు. బంతి వికెట్ల వద్దకు చేరుకునేలోపే బెయిల్స్‌ లైట్లు వెలిగాయి. స్క్వేర్‌ లెగ్‌ అంపైర్‌ తొలుత రత్నాయకేను ఔట్‌గా ప్రకటించాడు. అయితే నిర్ణయంపై అనుమానం రావడంతో టీవీ అంపైర్‌ను సంప్రదించారు. రీప్లేలో అసలు విషయం బయటపడింది.


బంతి వికెట్లను తాకడానికి ముందే వికెట్‌ కీపర్‌ జోర్డాన్‌ కాక్స్‌ గ్లోవ్స్‌ తగిలి బెయిల్స్‌ కిందపడినట్లు కనిపించింది. దీంతో టీవీ అంపైర్‌ తొలుత ఔట్‌ నిర్ణయాన్ని మార్చి నాటౌట్‌గా ప్రకటించాడు. ది ఓవల్‌ మైదానంలోని పెద్ద స్క్రీన్‌పై కూడా ‘నాటౌట్‌’ అని ప్రత్యక్షమైంది. అయితే ఇంతటితో కథ ముగియలేదు. డ్రింక్స్‌ బ్రేక్‌లోనూ టీవీ అంపైర్ ఈ ఘటనను మరోసారి పరిశీలించాడు. మరో 90 సెకన్లపాటు రీప్లేలను పరిశీలించిన అనంతరం రత్నాయకేను ఔట్‌గా ప్రకటించాడు. అప్పటికే 18 పరుగులతో ఉన్న శ్రీలంక బ్యాటర్‌ కూడా ఏం జరుగుతుందో అర్థంకాక ఆశ్చర్యంగా కనిపించాడు.


అసలు కారణం ఇదే..

వికెట్లపై ఉన్న బెయిల్స్‌ను కాక్స్‌ గ్లోవ్స్‌ కింద పడేసినప్పటికీ.. ఆర్చర్‌ విసిరిన బంతి వికెట్‌ను పూర్తిగా నేల నుంచి పెకిలించింది. ఇదే చివరకు రనౌట్‌ నిర్ణయానికి కారణమైంది. ఎంసీసీ క్రికెట్‌ నిబంధనల ప్రకారం.. బంతి తగిలి స్టంప్‌ నేల నుంచి బయటకు వస్తే వికెట్‌ విరిగినట్లే. అలాగే ఫీల్డర్‌ స్టంప్‌ను నేల నుంచి బయటకు లాగినా లేదా కొట్టినా వికెట్‌ విరిగినట్లుగా పరిగణిస్తారు. ఈ నిబంధనల ఆధారంగానే రత్నాయకేను ఔట్‌గా తేల్చారు. అటు ఇంగ్లండ్ ప్లేయర్లు, ఇటు శ్రీలంక ఆటగాళ్లు మ్యాచ్ అనంతరం ఈ ఘటనపై స్పందించారు. ఇలాంటి రనౌట్‌ను ఇన్నేళ్ల క్రికెట్ కెరీర్‌లో ఎప్పుడూ చూడలేదంటూ వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి:

మీరేనా సెలెక్షన్ కమిటీ ఛైర్మన్?.. పార్థివ్‌ను ఆటపట్టించిన ఆకాశ్ చోప్రా

నంబర్ల కోసం అయితే ఎక్కువకాలం ఆడలేం.. గిల్‌పై కోహ్లీ కీలక వ్యాఖ్యలు

Updated Date - Sep 29 , 2026 | 10:32 AM