పసిడి పంచ్‌కు బౌట్ దూరంలో..
ABN , Publish Date - Sep 30 , 2026 | 02:10 AM
ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే నరేందర్ (+90 కిలోలు) కాంస్య పతకం దక్కించుకోగా.. తాజాగా మరో ఇద్దరు బాక్సర్లు అంకుశ్ (80 కిలోలు), పర్వీన్ హూడా (65 కిలోలు) తమ విభాగాల్లో ఫైనల్స్‌కు దూసుకెళ్లి పసిడి పతకాలకు ఒక్క బౌట్ దూరంలో నిలిచారు.
బాక్సింగ్ ఫైనల్స్‌కు అంకుశ్, పర్వీన్
నగోయ: ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే నరేందర్ (+90 కిలోలు) కాంస్య పతకం దక్కించుకోగా.. తాజాగా మరో ఇద్దరు బాక్సర్లు అంకుశ్ (80 కిలోలు), పర్వీన్ హూడా (65 కిలోలు) తమ విభాగాల్లో ఫైనల్స్‌కు దూసుకెళ్లి పసిడి పతకాలకు ఒక్క బౌట్ దూరంలో నిలిచారు. సెమీ్‌సలో అంకుశ్ 4-1తో ప్రపంచ చాంపియన్ ఫజ్లిద్దీన్ ఎర్కిన్‌బోవ్ (ఉజ్బెకిస్థాన్)ను చిత్తు చేశాడు. ఈ గెలుపుతో అంకుశ్.. ఆసియా క్రీడల్లో ఎనిమిదేళ్ల తర్వాత ఫైనల్ చేరిన భారత పురుష బాక్సర్‌గా నిలిచాడు. చివరిగా భారత్ తరఫున 2018లో అమిత్ ఫంగల్ (49 కి) ఫైనల్ చేరి స్వర్ణం గెలిచాడు.
తుదిపోరులో కిమ్ మిన్‌సియోంగ్ (దక్షిణ కొరియా)తో అంకుశ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఇక, మహిళల సెమీ్‌సలో పర్వీన్ 5-0తో చైనా బాక్సర్ లి షును కంగుతినిపించింది. దీంతో మేరీ కోమ్ (2014), లవ్లీనా బోర్గోహైన్ (2022) తర్వాత.. ఆసియాడ్‌లో ఫైనల్ చేరిన మూడో భారత మహిళా బాక్సర్‌గా పర్వీన్ రికార్డుకెక్కింది. పసిడి పోరులో పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత చెన్ నీన్ చిన్ (చైనీస్ తైపీ)తో పర్వీన్ తలపడనుంది.
ఆర్చరీలో క్వార్టర్స్‌కు ధీరజ్, నీరజ్, కుమ్‌కుమ్
ఆసియాడ్‌లో భారత ఆర్చర్లు ధీరజ్ బొమ్మదేవర, నీరజ్ చౌహాన్, కుమ్‌కుమ్ మొహాద్ అనిల్ వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్‌లో క్వార్టర్‌ఫైనల్స్ చేరారు. ప్రీక్వార్టర్స్‌లో తెలుగు కుర్రాడు ధీరజ్ 6-2తో చెంగ్ సియాంగ్ హూయి (చైనీస్ తైపీ)పై, నీరజ్ 6-4తో మూడుసార్లు ఒలింపిక్ స్వర్ణ పతక విజేత కిమ్ జె డియోక్ (దక్షిణ కొరియా)పై గెలిచారు. మహిళల ప్రీక్వార్టర్స్‌లో కుమ్‌కుమ్ 6-0తో సైమా సలావుద్దీన్ (బంగ్లాదేశ్)ను చిత్తు చేసింది. మరో భారత అమ్మాయి కీర్తి 3-7తో కాంగ్ చెయోంగ్ (దక్షిణ కొరియా) చేతిలో ఓటమిపాలై ప్రీక్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. సెమీస్ బెర్త్ కోసం అమీర్‌ఖాన్ సాదికోవ్ (ఉజ్బెకిస్థాన్)తో ధీరజ్, లామ్ డోర్జీ (భూటాన్)తో నీరజ్ పోటీపడనున్నారు.
కనోయింగ్‌లో సెమీస్‌కు..
ఆసియాడ్ కనోయి స్లాలోమ్ ఈవెంట్‌లో భారత క్రీడాకారులు సెమీఫైనల్స్‌లో అడుగుపెట్టారు. పురుషుల కయాక్ సింగిల్స్‌లో హితేశ్ కెవాత్, ప్రద్యుమ్నసింగ్ రాథోడ్..మహిళల కయాక్ సింగిల్స్‌లో శిఖా చౌహాన్, మహిళల కనోయి సింగిల్స్‌లో పల్లవి జగ్తాప్, రీనా సేన్ తమ హీట్స్‌లో మెరుగైన ప్రదర్శన చేసి సెమీస్ చేరారు.
వాలీబాల్‌లో పురుషులు ముందుకు..
ఆసియాడ్ పురుషుల వాలీబాల్‌లో భారత్ ముందంజ వేసింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన పోరులో భారత్ 3-2తో కతార్‌పై విజయం సాధించి క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించింది. పూల్ సిలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు సెట్లు వెనుకంజలో నిలిచి మరీ అద్భుతంగా పుంజుకొన్న భారత జట్టు 26-28, 25-27, 25-23, 25-20, 24-22తో గట్టెక్కి ఊపిరి పీల్చుకుంది. తన గ్రూప్‌లో వరుసగా మూడో విజయంతో భారత్‌కు క్వార్టర్స్ బెర్త్ ఖరారైంది.
ఇవి కూడా చదవండి: