న్యూజిలాండ్ సిరీస్.. గిల్, రాహుల్ రంజీ ఆడాల్సిందే: బీసీసీఐ
ABN , Publish Date - Sep 30 , 2026 | 11:29 AM
సీనియర్ ప్లేయర్లంతా దేశవాళీ రెడ్ బాల్ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేయనుంది. ఈ క్రమంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌లను రంజీ ట్రోఫీలో బరిలోకి దింపే అవకాశం ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత టెస్టు జట్టును గాడిలో పెట్టేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 22 నుంచి టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలవాలంటే భారత్‌కు ఈ టెస్టు సిరీస్ అత్యంత కీలకం. దీంతో సీనియర్ ప్లేయర్లంతా దేశవాళీ రెడ్ బాల్ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేయనుంది. ఈ క్రమంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌లను రంజీ ట్రోఫీలో బరిలోకి దింపే అవకాశం ఉంది.
బీసీసీఐ వైద్య బృందం నుంచి క్లియరెన్స్ లభించిన ప్రతి సీనియర్ ప్లేయర్ కనీసం ఒక రెడ్ బాల్ మ్యాచ్ ఆడాలనేదే బీసీసీఐ ఉద్దేశం. అయితే ఆటగాళ్ల పని భారం, ఫిట్‌నెస్‌ను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం అమలు చేయనుంది. ఇటీవల గాయాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆకాశ్ దీప్, నితీశ్ కుమార్ రెడ్డి ప్లేయర్లపై సెలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. వారి ఫిట్‌నెస్, మ్యాచ్ ప్రాక్టీస్‌ను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు సీనియర్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా విషయంలో మాత్రం మరింత జాగ్రత్తగా ఉండాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అతడిని రంజీ మ్యాచ్ ఆడించకుండా.. అవసరమైతే భారత్ ‘ఎ’ తరఫున ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో బరిలోకి దించే అవకాశం ఉంది.
ఎందుకీ నిర్ణయం?
టెస్టు సిరీస్‌కు ముందు రెడ్‌బాల్ క్రికెట్‌లో తగినంత ప్రాక్టీస్ లేకపోవడం గతంలో టీమిండియాకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా 2024లో సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ 0-3తో క్లీన్‌స్వీప్ కావడం బీసీసీఐకి చేదు అనుభవంగా మిగిలింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లే ముందు ఆటగాళ్లకు రెడ్‌బాల్ మ్యాచ్ ప్రాక్టీస్ ఉండేలా చూడాలని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. టెస్టుల్లో భారత జట్టు ప్రదర్శనపై కొంతకాలంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. న్యూజిలాండ్‌లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు బీసీసీఐ ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
ఆసియా క్రీడలు: కాంపౌండ్ ఆర్చరీలో భారత్‌కు మరో స్వర్ణం
టీమిండియాకు కొత్త చీఫ్ సెలెక్టర్.. రేసులో మాజీ స్టార్ స్పిన్నర్!