Share News

వేసవి ఆటలు.. అధికారులకు కాసులు..!

ABN , Publish Date - May 28 , 2026 | 08:34 AM

జీహెచ్‌ఎంసీ క్రీడా విభాగంలో సీజనల్‌ దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. మరో మూడు రోజుల్లో వేసవి శిక్షణ శిబిరాలు ముగియనుండగా, ఇప్పటికీ 50 శాతం కూడా క్రీడా సామగ్రి సరఫరా కాలేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి.

వేసవి ఆటలు.. అధికారులకు కాసులు..!
Sports, Summer Camps

  • క్రీడా సామగ్రి సరఫరా సగమే

  • మరో మూడు రోజుల్లో ముగియనున్న వేసవి శిక్షణ శిబిరాలు

  • ఎంపికైన సంస్థతో ఇప్పటికీ జరగని అగ్రిమెంట్‌

  • జీహెచ్‌ంసీ క్రీడా విభాగంలో దోపిడీ

  • రూ.1.55 కోట్లు ఖర్చు చేస్తున్న సంస్థ.. సగం వరకు అధికారుల జేబుల్లోకే..?

  • శాట్‌ మాజీ అధికారి సంస్థకు కాంట్రాక్ట్‌..?

  • ఏజెన్సీ ఎంపికపై విజిలెన్స్‌ విచారణ

హైదరాబాద్‌ సిటీ: జీహెచ్‌ఎంసీ క్రీడా విభాగంలో సీజనల్‌ దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. మరో మూడు రోజుల్లో వేసవి శిక్షణ శిబిరాలు ముగియనుండగా, ఇప్పటికీ 50 శాతం కూడా క్రీడా సామగ్రి సరఫరా కాలేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ఎంపికైన సంస్థతో బుధవారం సాయంత్రానికి కూడా అగ్రిమెంట్‌ జరగకపోవడం గమనార్హం. ఒప్పందం జరగకున్నా సదరు సంస్థ మెటీరియల్‌ సరఫరా చేస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. ఏజెన్సీకి, కేంద్ర కార్యాలయ అధికారుల మధ్య ఆర్థిక ఒప్పందాలు కొలిక్కి రావకపోవడం వల్లే కాంట్రాక్ట్‌ అగ్రిమెంట్‌లో జాప్యం జరుగుతుందన్న ఆరోపణలున్నాయు. వేసవి క్రీడా శిబిరాలు ఏటా ఏప్రిల్‌ 25 నుంచి మే 31వరకు జరుగుతాయి. ఆలోపే టెండర్‌ ప్రక్రియ పూర్తి చేసి ఏజెన్సీని ఎంపిక చేయాలి. కోచింగ్‌ క్యాంప్‌ల ప్రారంభ గడువు సమీపించే వేళ హడావిడిగా నచ్చిన ఏజెన్సీని ఎంపిక చేస్తారు. ఈ క్రమంలో నిబంధనలను వారు పట్టించుకోరు.


నాణ్యతలేని క్రీడా సామగ్రి

జీహెచ్‌ఎంసీలోని ఆరు జోన్లలో క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు రూ.1.55 కోట్లు ఖర్చు చేస్తున్నారు. క్రికెట్‌, వాలీబాల్‌, బాస్కెట్‌ బాల్‌, టెన్నికాయిట్‌, క్యారమ్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌ తదితర క్రీడలకు సంబంధించి 148 రకాల మెటీరియల్‌ సరఫరా చేయాలి. ప్రమాణాల ప్రకారం క్రీడా సామగ్రి నాణ్యతను కమిటీ పరిశీలించాలి. కానీ కొన్ని క్రీడలకు సంబంధించి మెటీరియల్‌ క్వాలిటీని అధికారులు పరిశీలించలేదని సమాచారం.


‘నాణ్యత రహిత సామగ్రి సరఫరా చేశారని, శిక్షణ ప్రారంభించిన కొన్నాళ్లకే బ్యాట్లు, ప్యాడ్లు, గ్లోవ్స్‌, టెన్నికాయిట్‌ రింగ్‌ బాల్‌ తదితర మెటీరియల్‌ పాడయ్యాయి’ అని ఖైరతాబాద్‌ జోన్‌కు చెందిన ఓ కోచ్‌ పేర్కొన్నారు. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ(ఎస్ఏటీ)లో పదవీ విరమణ చేసిన అధికారికి చెందిన సంస్థను అధికారులు ఎంపిక చేసినట్టు చెబుతున్నారు. సదరు అధికారి భార్య పేరిట సికింద్రాబాద్‌లో ఏజెన్సీ నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఈ సంస్థ ఎంపికలో కేంద్ర కార్యాలయంలోని ఓ అధికారి చక్రం తిప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఏజెన్సీ ఎంపికైనా కమిషనర్‌కు ఫిర్యాదులు అందగా విజిలెన్స్‌ విచారణకు ఆదేశించినట్టు సమాచారం.


city3.jpgమొత్తం సరఫరా చేసినట్టు బిల్లులు

జీహెచ్‌ఎంసీలోని 752 కేంద్రాల్లో 44 క్రీడల్లో శిక్షణ శిబిరాలు జరుగుతున్నాయి. అరకొర వసతుల మధ్య పేద, మధ్య తరగతివర్గాల పిల్లలు ఆసక్తి ఉన్న క్రీడలు నేర్చుకుంటున్నారు. సరిపడా కోచ్‌లు లేకపోవడం ఒక సమస్య అయితే.. అవసరమైన మేర మెటీరియల్‌ చాలా చోట్ల అందుబాటులో లేదు. కానీ మొత్తం సరఫరా అయినట్టు అధికారులు బిల్లులు సిద్ధం చేస్తుండడం గమనార్హం. సగం మెటీరియల్‌ వస్తే.. మొత్తం సరఫరా అయినట్టు ఎలా సంతకం చేస్తానని ఓ జోన్‌కు చెందిన గేమ్‌ ఇన్‌స్పెక్టర్‌ తిరస్కరించినట్టు తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 28 , 2026 | 08:34 AM