Share News

జింబాబ్వేతో భారత్ టీ20 మ్యాచ్.. అందరి చూపూ ఆ ఇద్దరిపైనే.!

ABN , Publish Date - Jul 23 , 2026 | 02:41 PM

వరుస పరాజయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న భారత జట్టు.. నేటి నుంచి జింబాంబ్వేతో 3 మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో తలపడనుంది. నేడు తొలి మ్యాచ్ జరిగే హరారే పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలం. కాబట్టి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్‌కే మొగ్గుచూపే అవకాశముంది.

జింబాబ్వేతో భారత్ టీ20 మ్యాచ్.. అందరి చూపూ ఆ ఇద్దరిపైనే.!

ఇంటర్నెట్ డెస్క్: ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో వరుస పరాజయాలతో విమర్శలు ఎదుర్కొన్న భారత జట్టు ఇప్పుడు జింబాబ్వేతో జరిగే 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌పై దృష్టి సారించింది. గురువారం(జులై 23) నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లో గెలిచి ఆత్మవిశ్వాసాన్ని తిరిగిపొందాలని మెన్ ఇన్ బ్లూ భావిస్తోంది.


ఇటీవల యూకే పర్యటనలో టీమ్ఇండియా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ను 2-0తో, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను 4-0తో కోల్పోయిన భారత్.. ఆ తర్వాత వన్డే సిరీస్‌నూ 2-1తో ఆతిథ్య జట్టుకే సమర్పించుకుంది. దీంతో జట్టు ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. కొత్తగా సారథ్య బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్.. నాయకుడిగా ఇప్పటివరకు గెలుపు రుచి చూడలేదు. ఈ నేపథ్యంలో జింబాబ్వే సిరీస్ అతడికి అగ్నిపరీక్షగా మారింది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో నిరాశపరిచిన భారత బ్యాటింగ్ విభాగం.. ఈ సిరీస్‌లోనైనా గాడినపడాల్సి ఉంది.


ఇక ఈ మ్యాచ్‌లో.. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి నిలిచింది. ఈ సిరీస్‌లో అతడికి మరోసారి తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం లభించింది. సంజూ శాంసన్ జట్టులో లేకపోవడంతో టాప్ఆర్డర్‌లో వైభవ్ కీలక పాత్ర పోషించే అవకాశముంది. గతంలో అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన హరారే మైదానంలోనే మరోసారి మెరుపులు మెరిపించాలని అతడు ఉవ్విళ్లూరుతున్నాడు. కాగితంపై బలంగానే కనిపిస్తున్న భారత జట్టు.. ఇటీవలి ఫామ్‌ ఆధారంగా ప్రతీ మ్యాచ్‌ను అత్యంత జాగ్రత్తగా ఆడాల్సిన పరిస్థితి ఉంది. ఈ సిరీస్‌లో విజయం సాధించి తిరిగి గెలుపుబాట పట్టాలని టీమ్ఇండియా ఆశిస్తోంది.


పిచ్ ఎలా ఉందంటే?

హరారే పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలం. అయితే.. ప్రస్తుతం జింబాబ్వేలో శీతాకాలం కావడంతో పిచ్‌పై తేమ ఉంటుంది. అందువల్ల బౌలర్లు మరింతగా రాణించే అవకాశముంది. కాబట్టి ఈ వేదికపై భారీ స్కోర్లు ఆశించలేం. సమయం గడిచేకొద్దీ పిచ్ నెమ్మదిస్తుందని అంచనాలున్న నేపథ్యంలో టాస్ గెలిచిన జట్టు.. తొలుత బ్యాటింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక.. మ్యాచ్ సమయంలో సగటు ఉష్ణోగ్రత 20 డిగ్రీలు నమోదుకావచ్చని అంచనా.


ఇవీ చదవండి:

ఢిల్లీ ఆందోళనల్లో సంఘ విద్రోహ శక్తుల చొరబాటు!: ఢిల్లీ పోలీసులు

ముంబై నిరసనల్లో పోలీస్ వ్యాన్‌ను అడ్డుకున్న యువతి.. వీడియో వైరల్

Updated Date - Jul 23 , 2026 | 02:46 PM