Share News

యువ పేసర్లకే సెలెక్టర్ల మొగ్గు.. షమీ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్టేనా?

ABN , Publish Date - Jul 30 , 2026 | 10:54 AM

టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం చేసే అవకాశాలు మరింత క్లిష్టంగా మారినట్లు తెలుస్తోంది. శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కూ అతణ్ని ఎంపిక చేయకపోవడంతో.. ఇక షమీ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్టేనన్న చర్చ జోరందుకుంది.

యువ పేసర్లకే సెలెక్టర్ల మొగ్గు.. షమీ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్టేనా?
Mohammed Shami

ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం చేసే అవకాశాలు మరింత క్లిష్టంగా మారినట్లు తెలుస్తోంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం జాతీయ జట్టుకు దూరమైన ఈ సీనియర్ బౌలర్‌కు రానున్న రోజుల్లోనూ ఛాన్స్ దక్కే సూచనలు కనిపించడం లేదు. శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కూ అతణ్ని ఎంపిక చేయకపోవడంతో.. ఇక షమీ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్టేనని పలువురు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని భారత సెలెక్షన్ కమిటీ 15 మంది యువ ఫాస్ట్ బౌలర్ల జాబితాను సిద్ధం చేసిందని ఓ మీడియా నివేదక వెల్లడించింది. రానున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్, 2027 వన్డే వరల్డ్ కప్‌ లక్ష్యంగా.. అన్ని ఫార్మాట్లలో వీరిని తీర్చిదిద్దాలని యోచిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ జాబితాలో మహ్మద్ షమీ పేరు లేకపోవడం గమనార్హం.


2023 వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించిన 35ఏళ్ల షమీ.. గాయాల కారణంగా కొంతకాలం ఆటకు దూరమయ్యాడు. అనంతరం దేశవాళీ క్రికెట్‌లో రాణించినప్పటికీ.. జాతీయ జట్టులో మాత్రం చోటు సాధించలేకపోయాడు. షమీని పక్కనపెట్టడంపై టీమ్ఇండియా మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 'యువ బౌలర్లకు అవకాశాలు ఇవ్వడం సమంజసమే. కానీ.. షమీ వంటి అనుభవజ్ఞుడిని పూర్తిగా విస్మరించడం సరైన నిర్ణయం కాదు. ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, మొహ్సిన్ ఖాన్ వంటి యువ పేసర్లు భవిష్యత్తులో భారత జట్టుకు ఉపయోగపడే అవకాశముంది. అయినప్పప్పటికీ షమీ సేవలను ఇంత త్వరగా పక్కన పెట్టడం ఆశ్చర్యకరం' అని అన్నాడు.

అయితే.. సెలెక్టర్లు మాత్రం భవిష్యత్తు ప్రణాళికలకే పెద్దపీట వేస్తూ యువ బౌలర్లకు అంతర్జాతీయ అనుభవం కల్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో షమీ అంతర్జాతీయ కెరీర్‌కు దాదాపు ముగింపు పలికే పరిస్థితులు నెలకొన్నాయనే చర్చ క్రికెట్ వర్గాల్లో జోరందుకుంది.


ఇవీ చదవండి:

అంతర్జాతీయ క్రికెట్‌కు అజింక్య రహానే గుడ్ బై

ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త మైలురాయి.. 300 మిలియన్ డాలర్ల బ్రాండ్‌గా ఆర్సీబీ

Updated Date - Jul 30 , 2026 | 11:04 AM