ఇంగ్లండ్‌ను కూల్చిన క్రాంతి.. భారీ ఆధిక్యం దిశగా భారత్
ABN , Publish Date - Jul 11 , 2026 | 09:07 PM
ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌లో చరిత్ర సృష్టించడం ప్రతి ప్లేయర్ కల. ఆ కలను భారత మహిళా జట్టు యువ పేసర్ క్రాంతి గౌడ్ సాకారం చేసుకుంది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 5 వికెట్లతో విజృంభించిన ఆమె.. లార్డ్స్ టెస్ట్ హానర్స్ బోర్డులో పేరు లిఖించుకున్న తొలి మహిళా క్రికెటర్‌గా అరుదైన రికార్డు నెలకొల్పింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత యువ పేసర్ క్రాంతి గౌడ్ లార్డ్స్ మైదానంలో చరిత్ర సృష్టించింది. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు(17-7-37-5) తీసి లార్డ్స్ టెస్టు హానర్స్ బోర్డులో చోటు దక్కించుకున్న మొదటి మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. తన రెండో టెస్ట్ మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించిన 21 ఏళ్ల క్రాంతి.. భారత మహిళల క్రికెట్‌లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. అంతేకాకుండా.. టెస్టుల్లో ఐదు వికెట్లు తీసిన అత్యంత పిన్న వయస్కురాలైన భారతీయ మహిళా పేసర్‌గానూ ఆమె రికార్డు నెలకొల్పింది.
గత వారం ఇదే లార్డ్స్ మైదానంలో మహిళల టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఆస్ట్రేలియాపై నిరాశాజనక ప్రదర్శన చేసిన క్రాంతి.. ఈసారి మాత్రం అద్భుతంగా పుంజుకుంది. ట్యామీ బీమాంట్‌తో ఆరంభమైన వికెట్ల వేట.. మాయా బౌచియర్, అలీస్ క్యాప్సీ, కెప్టెన్ నాట్ స్కివర్-బ్రంట్, లారెన్ బెల్‌ల వికెట్లతో కొనసాగింది. ముఖ్యంగా క్యాప్సీ ఆఫ్ స్టంప్‌ను ఎగరగొట్టిన బంతి మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. 21/1తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. భారత బౌలర్ల ధాటికి నిలవలేక 170 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్‌కు 115 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో అమీ జోన్స్(52), నాట్ సీవర్ బ్రంట్(44) రాణించారు. ఓపెనర్ మైయా బౌచియర్(23) పరుగులు చేసింది. టీమ్ఇండియా బౌలర్లలో క్రాంతి గౌడ్(5/37) సత్తాచాటింది. సయాలి సత్ఘరే 2, స్నేహ్ రాణా 2, దీప్తి శర్మ ఒక వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 285 రన్స్‌కు ఆలౌటైంది.
ఇవీ చదవండి:
స్టోక్స్ రిటైర్మెంట్ వీడియోపై రచ్చ.. ఈసీబీకి ఐసీసీ క్లీన్ చిట్!
ఆ ఫొటోలు చూసి కోహ్లీ షాకైపోయాడు: ఇంగ్లండ్ బ్యాటర్ జార్డన్ కాక్స్