Share News

ప్రపంచ కప్ ఫిక్సింగ్ ఆరోపణలు.. మౌనం వీడిన అర్జెంటీనా కోచ్

ABN , Publish Date - Jul 11 , 2026 | 01:35 PM

ఫిఫా ప్రపంచ కప్ 2026లో అర్జెంటీనాపై ఫిక్సింగ్ ఆరోపణలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఆ ఆరోపణలపై ఆ జట్టు ప్రధాన కోచ్ లియోనెల్ స్కలోనీ తొలిసారి స్పందించాడు.

ప్రపంచ కప్ ఫిక్సింగ్ ఆరోపణలు.. మౌనం వీడిన అర్జెంటీనా కోచ్
Lionel Scaloni

ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026లో అర్జెంటీనాపై ఫిక్సింగ్ ఆరోపణలు వస్తోన్న సంగతి తెలిసిందే. ప్రిక్వార్టర్స్‌లో ఈజిప్ట్‌పై అర్జెంటీనా 3-2 తేడాతో విజయం సాధించింది. 2-0 తేడాతో వెనుకబడి ఉన్న డిఫెండింగ్ ఛాంపియన్.. అనూహ్యంగా పుంజుకుని ఆఖరి నిమిషాల్లో 3 గోల్స్ చేసి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఆ మ్యాచ్‌లో వీఏఆర్ వివాదం చెలరేగగా, ఈజిప్ట్ ప్లేయర్లు, సిబ్బంది.. అర్జెంటీనాపై ప్రపంచ కప్ ఫిక్సింగ్ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆ ఆరోపణలపై ఆ జట్టు ప్రధాన కోచ్ లియోనెల్ స్కలోనీ తొలిసారి స్పందించాడు. అర్జెంటీనా వరుసగా రెండోసారి ప్రపంచ కప్ గెలవకూడదని కోరుకునే వారే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని, అలాంటి విమర్శలు తమ ఆటగాళ్లకు మరింత ప్రేరణగా మారుతున్నాయని స్పష్టం చేశాడు.


స్విట్జర్లాండ్‌తో శనివారం జరిగే క్వార్టర్‌ ఫైనల్‌కు ముందు స్కలోనీ మీడియాతో మాట్లాడాడు. ‘డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఈ సీజన్‌లో బరిలోకి దిగాం. మేం ఓడిపోవాలని కోరుకునే వారు ఎక్కువగానే ఉంటారు. ఆ విమర్శలు మా ఆటగాళ్ల చెవిన కూడా పడుతున్నాయి. అయితే వాటిని మేం తిరుగుబాటు స్ఫూర్తిగా మార్చుకుని మరింత మెరుగ్గా ఆడేందుకు ఉపయోగించుకుంటాం. 1986లో కూడా మాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారని అప్పట్లో ఆరోపణలు చేశారు. కాబట్టి ఇవన్నీ మాకు కొత్తేం కావు. అర్జెంటీనా ఎప్పుడూ ప్రపంచ కప్‌లో ప్రధాన ఆకర్షణగానే ఉంటుంది. అందుకే మాపై ఇలాంటి చర్చలు సహజం. ప్రతి జట్టుకు వ్యతిరేకంగా ఉండే అభిమానులు ఉంటారు. అదే విధంగా అర్జెంటీనా గెలవకూడదని కోరుకునే వారూ ఉంటారు’ అని పేర్కొన్నాడు.


వీఏఆర్‌పై పూర్తి నమ్మకం..

‘వీఏఆర్ ద్వారా ఎవరికైనా అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా కష్టం. టోర్నీ ప్రారంభానికి ముందు మాకు నిర్వహించిన సమావేశాల్లోనే నిబంధనలన్నింటినీ స్పష్టంగా వివరించారు. ఏ పరిస్థితిలో ఎలా నిర్ణయం తీసుకుంటారో వీడియోలతో చూపించారు. ప్రస్తుతం అదే నిబంధనలను అక్షరాలా అమలు చేస్తున్నారు’ అని స్కలోని స్పష్టం చేశాడు. కాగా, స్విట్జర్లాండ్‌పై విజయం సాధిస్తే అర్జెంటీనా వరుసగా రెండో ప్రపంచ కప్ సెమీ ఫైనల్‌లోకి అడుగుపెడుతుంది. అయితే టోర్నీలో ఇప్పటివరకు ప్రపంచ టాప్-10 ర్యాంకింగ్ జట్టును ఎదుర్కోకుండానే క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకోవడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.


ఇవి కూడా చదవండి:

వింబుల్డన్‌లో ఓటమి.. రిటైర్‌మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన జకోవిచ్

ఒకే ఫ్రేమ్‌లో సచిన్, కోహ్లీ, గిల్.. వింబుల్డన్ పోస్ట్ వైరల్!

Updated Date - Jul 11 , 2026 | 01:35 PM