Share News

10.14 సెకన్లలో 100 మీటర్లు.. విదేశీ గడ్డపై భారత స్ప్రింటర్ అరుదైన రికార్డు

ABN , Publish Date - Jul 11 , 2026 | 11:26 AM

భారత స్ప్రింటింగ్ సంచలనం అనిమేశ్ కుజుర్ మరో అరుదైన ఘనత సాధించాడు. పుమా ఫాస్ట్ ఆర్మ్స్-ఫాస్ట్ లెగ్స్ 2026 అథ్లెటిక్స్ మీట్‌లో పురుషుల 100 మీటర్ల ఫైనల్ పోరులో 10.14 సెకన్లలోనే రేసు పూర్తి చేసి రన్నరప్‌గా నిలిచాడు.

10.14 సెకన్లలో 100 మీటర్లు.. విదేశీ గడ్డపై భారత స్ప్రింటర్ అరుదైన రికార్డు
Animesh Kujur

ఇంటర్నెట్ డెస్క్: భారత స్ప్రింటింగ్ సంచలనం అనిమేశ్ కుజుర్ మరో అరుదైన ఘనత సాధించాడు. పుమా ఫాస్ట్ ఆర్మ్స్-ఫాస్ట్ లెగ్స్ 2026 అథ్లెటిక్స్ మీట్‌లో పురుషుల 100 మీటర్ల ఫైనల్ పోరులో 10.14 సెకన్లలోనే రేసు పూర్తి చేశాడు. ఈ ప్రదర్శనతో విదేశీ గడ్డపై అత్యంత వేగంగా 100 మీటర్ల రేసును పూర్తి చేసిన భారత అథ్లెట్‌గా అనిమేశ్ చరిత్ర సృష్టించాడు. అయితే ఇది అనిమేశ్ వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన కూడా కావడం విశేషం. భారత 100 మీటర్ల చరిత్రలో గురీందర్‌వీర్ సింగ్ (10.09 సెకన్లు) తర్వాత రెండో అత్యుత్తమ టైమ్ ఇదే.


ఫైనల్‌కు ముందు జరిగిన హీట్‌లోనే 10.19 సెకన్లతో తొలి స్థానంలో నిలిచిన అనిమేశ్.. ఫైనల్లో మరింత మెరుగైన ప్రదర్శన చేశాడు. 10.14 సెకన్ల టైమ్‌లో రేసు పూర్తి చేసి.. గతంలో తన పేరిట ఉన్న 10.15 సెకన్ల వ్యక్తిగత రికార్డును మరో 0.01 సెకనుతో అధిగమించాడు. ఇప్పటికే 200 మీటర్ల జాతీయ రికార్డు (20.32 సెకన్లు) కలిగిన అనిమేశ్.. ఇప్పుడు భారత 100 మీటర్ల చరిత్రలో నమోదైన ఐదు అత్యుత్తమ టైమ్‌లలో మూడింటిని తన ఖాతాలో వేసుకోవడం విశేషం.


ఆసియా క్రీడలపై గురి

జూన్‌లో జరిగిన అంతర్రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అనిమేశ్ 200 మీటర్లను 20.74 సెకన్లలో పూర్తి చేసి ఆసియా క్రీడలకు అర్హత సాధించాడు. తన లక్ష్యం కేవలం క్వాలిఫై అవ్వడం మాత్రమే కాదని.. ఆసియా క్రీడల నాటికి తన టైమింగ్‌ను మరింత మెరుగుపరుచుకోవడంపైనే దృష్టి పెట్టనున్నట్లు తెలిపాడు. ‘ఈసారి టైమింగ్ కోసం కాకుండా ఆసియా క్రీడల అర్హత మార్క్ సాధించడానికే బరిలోకి దిగాను. ఇప్పుడు అర్హత లభించింది కాబట్టి మరింత మెరుగైన ప్రదర్శనపై దృష్టి పెడతా. 200 మీటర్లు నా ఫేవరెట్ ఈవెంట్. కానీ భారతదేశంలో ఆ విభాగంలో నాకు పెద్దగా పోటీ లేదు. 100 మీటర్లలో గురీందర్‌వీర్, మణికంఠ, ప్రణవ్ లాంటి అథ్లెట్లు ఉండటంతో తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. అదే నా ప్రదర్శనను మరింత మెరుగుపరుస్తోంది’ అని అనిమేశ్ వివరించాడు. ఆసియా రిలే ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు మిక్స్‌డ్ 4×100 మీటర్ల రిలేలో కాంస్య పతకం అందించిన అనంతరం కూడా అనిమేశ్ అద్భుత ఫామ్ కొనసాగించడం భారత అథ్లెటిక్స్‌కు శుభసూచకంగా మారింది.


ఇవి కూడా చదవండి:

వింబుల్డన్‌లో ఓటమి.. రిటైర్‌మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన జకోవిచ్

ఒకే ఫ్రేమ్‌లో సచిన్, కోహ్లీ, గిల్.. వింబుల్డన్ పోస్ట్ వైరల్!

Updated Date - Jul 11 , 2026 | 11:26 AM