ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్: విక్రయానికి మ్యాచ్ టర్ఫ్.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!
ABN , Publish Date - Jul 11 , 2026 | 12:25 PM
ఫిఫా ప్రపంచ కప్ 2026 ఆఖరి అంకానికి చేరుకుంది. జులై 19న న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియం వేదికగా ఫైనల్ పోరు జరగనుంది. అయితే ఇప్పుడు ఫిఫా తీసుకున్న ఓ వింత నిర్ణయం చర్చనీయాంశమైంది.
ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026 ఆఖరి అంకానికి చేరుకుంది. జులై 19న న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియం వేదికగా ఫైనల్ పోరు జరగనుంది. అయితే ఇప్పుడు ఫిఫా తీసుకున్న ఓ వింత నిర్ణయం చర్చనీయాంశమైంది. టికెట్ ధరలు భారీగా పెంచి ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటోన్న ఫిఫా.. మరోసారి వార్తల్లో నిలిచింది. ఫైనల్ మ్యాచ్ అనంతరం మెట్‌లైఫ్ స్టేడియం టర్ఫ్‌ను ముక్కలుగా చేసి విక్రయించనున్నట్లు తెలిపింది. అయితే ఒక్కో ముక్కకు 450 అమెరికన్ డాలర్లు(సుమారు రూ.38 వేలు) కావడం గమనార్హం.
‘ప్రపంచ కప్ 2026 ఫైనల్‌లో పిచ్‌పై ఉపయోగించే టర్ఫ్‌ను సొంతం చేసుకునే అరుదైన అవకాశం ఇది. ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలోనే చిరస్మరణీయ క్షణానికి గుర్తుగా ప్రతి టర్ఫ్ ముక్కను ప్రత్యేకంగా భద్రపరిచి విక్రయించనున్నాం. వాటిని అక్రిలిక్ కేస్‌లో ఆకర్షణీయమైన ప్రీమియం బాక్స్‌లో పెట్టి జ్ఞాపికగా అందజేయనున్నాం’ అని ఫిఫా పేర్కొంది. అయితే టర్ఫ్ ముక్కల పరిమాణాన్ని 17.5 × 17.5 × 17.5గా మాత్రమే పేర్కొనగా, అది అంగుళాల్లోనా, సెంటీ మీటర్లలోనా, మిల్లీ మీటర్లలోనా అనే విషయాన్ని స్పష్టం చేయలేదు. ఈ ప్రత్యేక జ్ఞాపికలను ప్రస్తుతం అమెరికా, యూరప్‌లో ఉన్న అభిమానులకు మాత్రమే పంపనున్నట్లు ఫిఫా తెలిపింది. ప్రపంచ కప్ ఫైనల్ ముగిసిన తర్వాతే ఆర్డర్ల డెలివరీ ప్రారంభమవుతుందని వెల్లడించింది.
టికెట్ల ధరలపైనా విమర్శలు
మరోవైపు ఫిఫా ఫైనల్ మ్యాచ్ టికెట్ల ధరలు కూడా భారీగా ఉండటం చర్చనీయాంశమైంది. సాధారణ టికెట్ల ధర గరిష్ఠంగా 32,970 డాలర్లు (సుమారు రూ.28 లక్షలు) ఉండగా, ఫుడ్, డ్రింక్స్‌తో కూడిన హాస్పిటాలిటీ టికెట్ల ధరలను 34,500 డాలర్లు, 32,500 డాలర్లుగా నిర్ణయించింది. కాగా, సాధారణంగా ఎన్‌ఎఫ్‌ఎల్ జట్లు న్యూయార్క్ జెయింట్స్, న్యూయార్క్ జెట్స్ మ్యాచ్‌లకు కృత్రిమ గడ్డిని ఉపయోగించే మెట్‌లైఫ్ స్టేడియంలో ఏర్పాటు చేసిన మైదానం నాణ్యతపై ఇప్పటికే పలువురు ఆటగాళ్లు, కోచ్‌లు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
వింబుల్డన్‌లో ఓటమి.. రిటైర్‌మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన జకోవిచ్
ఒకే ఫ్రేమ్‌లో సచిన్, కోహ్లీ, గిల్.. వింబుల్డన్ పోస్ట్ వైరల్!