Share News

మహిళలకు టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌లు పెంచాలి: హర్మన్‌ప్రీత్ కౌర్

ABN , Publish Date - Jul 09 , 2026 | 09:37 PM

మహిళలకు టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌ల సంఖ్య పెంచాలని భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అన్నారు. ఆరేళ్ల కాలంలో తమకు 7 టెస్ట్ మ్యాచ్‌లే నిర్వహించారని, ఇదే సమయంలో పురుషుల జట్టు 58 మ్యాచ్‌లు ఆడిందని గుర్తుచేశారు.

మహిళలకు టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌లు పెంచాలి: హర్మన్‌ప్రీత్ కౌర్
Harmanpreeth Kaur

ఇంటర్నెట్ డెస్క్: మహిళలకు టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌ల సంఖ్య పెంచాలని భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అన్నారు. ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా ఈ నెల 10 నుంచి ఏకైక టెస్ట్ మ్యాచ్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.


2020 నుంచి ఇప్పటివరకు భారత మహిళల జట్టు కేవలం ఏడు టెస్ట్ మ్యాచ్‌లే ఆడగా.. ఇదే సమయంలో టీమ్ఇండియా పురుషుల జట్టు 58 టెస్టులు ఆడిందని గుర్తుచేశారు హర్మన్. మహిళల క్రికెట్‌లో వన్డేలు, టీ20ల సంఖ్య పెరిగినా.. ఎర్రబంతి క్రికెట్‌కు సరైన అవకాశాలు రావడంలేదని ఆమె వాపోయారు. దేశీయ స్థాయిలోనూ పరిమిత ఓవర్ల క్రికెట్‌కే అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో టెస్ట్ మ్యాచ్‌ల సమయంలో ఆటగాళ్లకు తగినంత సన్నద్ధత ఉండట్లేదని ఆమె చెప్పారు. అయినప్పటికీ మహిళల క్రికెట్ సరైన దిశలోనే సాగుతోందనే నమ్మకం తనకు ఉందన్నారు.


'ఆటగాళ్లుగా మేం ఎక్కువ టెస్టు మ్యాచ్‌లు ఆడాలని కోరుకుంటాం. ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఎక్కువ సమయం క్రికెట్‌తోనే గడపాలనేది మా అభిలాష. మహిళల క్రికెట్ పురోగతి సాధిస్తోంది. గతేడాది మార్చిలో ఓ టెస్ట్ మ్యాచ్ ఆడాం. ఇప్పుడు మరొకటి ఆడుబోతున్నాం. భవిష్యత్తులో మరిన్ని టెస్టులు నిర్వహిస్తారని ఆశిస్తున్నాను' అని హర్మన్‌ప్రీత్ తెలిపారు.


ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌ మైదానంలో జులై 10న భారత మహిళల జట్టు తొలిసారి టెస్ట్ మ్యాచ్ ఆడబోతోంది. ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు కౌర్. చిన్నప్పటి నుంచి లార్డ్స్‌లో టెస్టు ఆడాలని కలలు కన్నామని చెప్పుకొచ్చారు. 'ఈ మైదానంలో టెస్ట్ మ్యాచ్ ఆడటమనేది ప్రతి క్రికెటర్‌కూ ఓ ప్రత్యేకమైన అనుభూతి. టీమ్ఇండియా ఉమెన్స్‌కు ఇదో చారిత్రక సందర్భం. కెప్టెన్‌గా, క్రీడాకారిణిగా ఈ అవకాశం కోసం ఎంతో ఉత్సాహంగా ఉన్నా. నాతో పాటు జట్టులోని ప్రతిఒక్కరూ ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు' అని కౌర్ పేర్కొన్నారు.


ఇవీ చదవండి:

వరుస ఓటములకు బ్రేక్ పడేనా? బరిలోకి దిగే భారత తుది జట్టు ఇదే!

గొప్ప కెప్టెన్‌ అవుతాడు.. శ్రేయస్‌కు మద్దతుగా నిలిచిన సోదరి శ్రేష్ఠ

Updated Date - Jul 09 , 2026 | 09:41 PM