చెపాక్‌లో చెన్నై పోరు.. పంజాబ్‌తో బోణీ కొట్టేనా?
ABN , Publish Date - Apr 03 , 2026 | 01:48 PM
ఈ ఐపీఎల్ సీజన్లో మరో ఉత్కంఠపోరుకు నేడు తెరలేవనుంది. గత మ్యాచ్‌లో గెలుపుతో ఊపుమీదున్న పంజాబ్ కింగ్స్‌ను.. సొంతగడ్డపై చెన్నై ఢీకొనబోతోంది. మరి ఈ మ్యాచ్‌లో విజయం ఎవరిది.? చూడదగ్గ ప్రధాన ఆటగాళ్ల మధ్య పోరు ఎలా ఉంటుందో ఓ లుక్కేద్దాం..
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా శుక్రవారం మరో ఆసక్తికర పోరుకు తెరలేవనుంది. ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(CSK), పటిష్ఠమైన పంజాబ్ కింగ్స్(PBKS) జట్లు తలపడనున్నాయి. తొలి మ్యాచ్‌లో ఓడిన సీఎస్కే.. ఈసారి తన హోమ్‌గ్రౌండ్ చెపాక్‌లో బోణీ కొట్టాలని పట్టుదలగా ఉంది. గత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో భారీ ఓటమితో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న చెన్నై.. నేటి మ్యాచ్‌లో పంజాబ్‌ను కట్టడిచేయాలని చూస్తోంది. మరోవైపు.. గుజరాత్ టైటాన్స్‌పై అద్భుత విజయం సాధించిన పంజాబ్ కింగ్స్ అదే ఊపులో చెన్నైనూ మట్టికరిపించాలని ఆతృతగా ఉంది.
చిదంబరం స్టేడియం(చెపాక్) అంటే ఒకప్పుడు సీఎస్కే జట్టుకు కంచుకోటగా ఉండేది. కానీ గత సీజన్‌లో ఇక్కడ జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట్లో ఓడింది. అటు.. మూడు సీజన్లుగా పంజాబ్ కింగ్స్ మాత్రం.. ఈ వేదికపై విజయాల పరంపర కొనసాగిస్తోంది. అయితే.. ఈ పోరుకు ముందు ఇరు జట్లలో చూడదగిన, మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసే ఆటగాళ్లు కొందరున్నారు. ప్రధాన పోటీ వీరి మధ్యే ఉంటుందని పలువురు క్రీడానిపుణులు విశ్లేషిస్తున్నారు.
1. అర్ష్‌దీప్ సింగ్ Vs రుతురాజ్ గైక్వాడ్
పంజాబ్ తరఫున అర్ష్‌దీప్ సింగ్ కొత్త బంతిని అందుకోనుండగా.. రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. ఐపీఎల్‌లో అర్ష్‌దీప్ బౌలింగ్లో రుతురాజ్ ఇప్పటివరకు 114.28 స్ట్రైక్‌రేట్‌తో 40 పరుగులు మాత్రమే చేసి.. మూడుసార్లు అవుటయ్యాడు. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన జట్టుకు ఆరంభంలోనే గైక్వాడ్ వికెట్ కోల్పోవడం గట్టి దెబ్బ అవుతోంది. మరి నేటి మ్యాచ్‌లో గైక్వాడ్ అర్ష్‌దీప్‌పై ఆధిపత్యం చెలాయిస్తాడా లేక మరోసారి తడబడి వికెట్ సమర్పించుకుంటాడా చూడాలి.
2. ఖలీల్ అహ్మద్ Vs శ్రేయాస్ అయ్యర్
గత మ్యాచ్‌లో విఫలమైన శ్రేయాస్ అయ్యర్.. నేడు చెలరేగడానికి ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే.. అతను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగనుండటంతో మధ్య ఓవర్లలో బ్యాటింగ్ చేసే అవకాశముంది. ఒకవేళ టాపార్డర్ విఫలమైతే అయ్యర్ త్వరగా క్రీజులోకి రావచ్చు. అలా అయితే.. అతడికి ఖలీల్ అహ్మద్ నుంచి సవాల్ ఎదురుకానుంది. ఐపీఎల్‌లో ఖలీల్ బౌలింగ్లో అయ్యర్ 33 పరుగులు మాత్రమే చేసి, మూడుసార్లు ఔట్ అయ్యాడు.
3. యుజ్వేంద్ర చాహల్ Vs సంజూ శాంసన్
ఐపీఎల్‌లో యుజ్వేంద్ర చాహల్ తరచుగా సంజూ శాంసన్‌ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. సంజూ పవర్‌ప్లేలో వేగంగా పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. ఇద్దరి మధ్య పోరులో శాంసన్‌పై చాహల్‌దే పైచేయిగా ఉంది. ఈ లెగ్ స్పిన్నర్ బౌలింగ్లో తడబడుతున్న సంజూ.. ఇప్పటివరకు 12 ఇన్నింగ్స్‌లలో కేవలం 61 పరుగులే చేయగలిగాడు. ఐదుసార్లు అతడికి వికెట్ సమర్పించుకున్నాడు. ఈ లీగ్‌లో మరే ఇతర బౌలర్ కూడా సంజూను ఇన్నిసార్లు ఔట్ చేయకపోవడం గమనార్హం.
ఇవీ చదవండి:
ధోనీ, కపిల్‌కు క్షమాపణ చెబుతా!